వయసు పైబడినా సినిమాల్లో యంగ్‌గా కనిపించడం మామూలే. కానీ యువ హీరోలు ఓల్డ్ గెటప్ వేసుకోవడం అంటే కాస్త ధైర్యం చేయాల్సిందే. క్రేజ్ ఉన్న హీరోలు ఇలాంటి పాత్రలు చేస్తే అది మరింత ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. కెరీర్ ఉన్నత దశలో ఉన్నప్పుడు ఎన్టీఆర్, ఏఎన్నార్ వంటి స్టార్ హీరోలు ఓల్డ్ గెటప్‌లో కనిపించారు. తర్వాత కూడా కొంతమంది ఈ వేషాల్ని ధరించారు. అలాంటి హీరోలపై ఓ లుక్కేద్దాం.
చిరంజీవి - స్నేహం కోసం
మెగాస్టార్ చిరంజీవి డ్యుయర్ రోల్ చేసిన చిత్రాల్లో స్నేహం కోసం ఒకటి. ఈ సినిమాలో మెగాస్టార్ నటనకు ఫిదా అవ్వాల్సిందే. ఓల్డ్ గెటప్‌లో భావోద్వేగ సన్నివేశాల్లో చిరు జీవించాడని చెప్పుకోవచ్చు.

బాలకృష్ణ -పెద్దన్నయ్య, చెన్నకేశవరెడ్డి
ఈ రెండు చిత్రాల్లోనూ బాలయ్య నటనకు మంచి మార్కులు పడ్డాయి. రెండింటిలోనూ ఓల్డ్ గెటప్ పాత్రే హైలెట్.

వెంకటేశ్ - సూర్యవంశం
ఈ చిత్రంలో హరిశ్చంద్ర ప్రసాద్ పాత్రలో వెంకటేశ్ నటన అద్భుతం. సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది.

మోహన్ బాబు - పెదరాయుడు, రాయలసీమ రామన్న చౌదరి
మోహన్ బాబు కెరీర్లో 'పెదరాయుడు' ఓ మైలురాయిగా నిలిచిపోతుంది. 'రాయలసీమ రామన్న చౌదరి' చిత్రంలో కూడా మోహన్ బాబు ఓల్డ్ గెటప్‌తో ప్రేక్షకుల్ని కట్టిపడేశాడు. సినిమా పెద్దగా ఆడకపోయినా ఆ క్యారెక్టర్‌కు మంచి గుర్తింపు వచ్చింది.

రజినీకాంత్ : పెదరాయుడు, ముత్తు, నరసింహా
సూపర్ స్టార్ రజనీకాంత్ కెరీర్లో ఈ మూడు చిత్రాలు బ్లాక్బాస్టర్లుగా నిలిచాయి.

కమల్ హాసన్ - భారతీయుడు
శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు భారీ హిట్‌ను ఖాతాలో వేసుకుంది. ఇందులో సేనాపతి క్యారెక్టర్లో కమల్‌హాసన్ నటనకు మంచి పేరొచ్చింది. ప్రస్తుతం భారతీయుడు 2లో 90 ఏళ్ల వృద్ధుడిగా కనిపించనున్నాడు కమల్.

రాజశేఖర్ - మా అన్నయ్య
ఈ చిత్రంలో రాజశేఖర్ నటన ప్రేక్షకుల్ని కంటతడి పెట్టిస్తుంది. ఈ హీరో కెరీర్లో మరపురాని చిత్రంగా నిలిచిపోయింది.

నాగార్జున : అన్నమయ్య
అన్నమయ్య అనగానే గుర్తొచ్చేది కింగ్ నాగార్జున. ఆ పాత్రలో నాగ్ ఒదిగిపోయిన తీరు అద్భుతం. ముఖ్యంగా ఓల్డ్ గెటప్‌లో అతడి యాక్టింగ్ చాలా బాగుంటుంది. ఈ పాత్రకు గానూ స్పెషల్ జ్యూరీ కేటగిరీలో నేషనల్ అవార్డు గెలుచుకున్నాడీ హీరో.

మహేశ్ బాబు – నాని
అమ్మాయిల కలల రాకుమారుడిగా పేరుగాంచాడు ప్రిన్స్ మహేశ్ బాబు. ఈ హీరో కూడా నాని చిత్రంలో కాసేపు ఓల్డ్ గెటప్‌లో కనిపించి ఆకట్టుకున్నాడు.

రానా – బాహుబలి, బాహుబలి 2
బాహుబలి.. తెలుగు సినీ చరిత్రలో నిలిచిపోయే సినిమా. ఇందులో హీరోగా నటించిన ప్రభాస్‌తో పాటు ప్రతినాయకుడు రానాకు మంచి పేరొచ్చింది. ఇందులో ఓల్డ్ క్యారక్టర్లో రానా నటన ప్రేక్షకుల చేత విజిల్స్ కొట్టిస్తుంది.

సుమంత్ : ఎన్టీఆర్ కథానాయకుడు
ఎన్టీఆర్ బయోపిక్‌లో ఏఎన్నార్‌గా నటించి మెప్పించాడు సుమంత్. ప్రేక్షకుల చేత చప్పట్లు కొట్టించాడు.

వీరే కాకుండా కార్తీ (ఖాకీ), సుధీర్ బాబు (వీర భోగ వసంత రాయలు), నారా రోహిత్ (అప్పట్లో ఒకడుండేవాడు), శ్రీవిష్ణు (అప్పట్లో ఒకడుండేవాడు) కాసేపు ఓల్డ్ గెటప్స్‌లో మెరిశారు.
ఇవీ చూడండి.. అమ్మాయిల మధ్యలో అల్లు అర్జున్ అలా...