ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, కే.జే.యేసుదాస్.. సంగీతానికి రెండు కళ్లు లాంటివారు. వీరిద్దరూ కలిసి 1991లో వచ్చిన 'దళపతి' చిత్రంలో 'సింగారాలా..' అనే పాటను కలిసి ఆలపించారు. ఈ పాట ఇప్పటికీ అభిమానుల హృదయాల్లో మెదులుతూనే ఉంది. దాదాపు 27 ఏళ్ల తర్వాత మళ్లీ వీరిద్దరూ కలిసి ఓ పాటకు గాత్రం అందించారు. మలయాళం, తమిళంలో తెరకెక్కిన 'కినార్-కెని' సినిమాలోని 'అయ్య సామి' పాటకు గాత్రం అందించారు.
కేరళ-తమిళనాడు సరిహద్దులో నీటి సమస్య నేపథ్య కథతో దర్శకుడు ఎం.ఏ.నిషద్ ఈ సినిమాను తెరకెక్కించారు. బాలు, యేసుదాస్ పాడిన ఈ పాట వీడియోను చిత్రబృందం యూట్యూబ్‌లో విడుదల చేసింది. ఓ పక్క కేరళ, తమిళనాడు రాష్ట్రాల అందాలను, సంస్కృతిని చక్కగా చూపిస్తూ మరోపక్క బాలు, యేసుదాస్ సరదాగా ఆలపిస్తున్న ఈ పాట ఆకట్టుకుంటోంది. పాట మధ్యలో పచ్చని పొలంలో తమిళ సూపర్‌స్టార్లు కమల్ హాసన్, రజనీకాంత్ బొమ్మలు వేసి వాటి చుట్టూ కళాకారులు చిందులు వేయడం హైలైట్‌గా నిలిచింది.
ఈ 'కినార్-కెని' సినిమాలో జయప్రద, రేవతి, నాజర్, సముద్రఖని, పార్ధిబన్, పుష్పతి, పార్వతి నంబియార్, జోయ్ మ్యాథ్యు, అను హాసన్ తదితరులు నటించారు. ఇందులో జయప్రద ఇందిర అనే గృహిణి పాత్రలో, రేవతి తిరునెల్వేలి జిల్లా కలెక్టర్‌గా కనిపించారు. సంజీవ్ పీకే, అన్నే సంజీవ్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">