ఒక్కసారిగా ద్విచక్రవాహనం అదుపు తప్పి జారుకుంటూ వచ్చింది.. దానిపై ప్రయాణిస్తున్న వ్యక్తి కింద పడి పల్టీలు కొట్టాడు.. ఆయన ఎవరో తెలీని పరిస్థితి.. సినీనటుడు సాయిధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదంలో గాయపడినపుడు పక్క నుంచి వెళ్తున్న అబ్దుల్ అనే వ్యక్తి ఒక పౌరుడిగా తన బాధ్యతను నిర్వర్తించారు. వెంటనే డయల్ 100కు, ఆ తర్వాత 108 అంబులెన్స్‌కు ఫోన్ చేశారు. ఆయన్ను ఆసుపత్రికి తరలించడంలో సహకారం అందించడమేకాక ఆసుపత్రి వరకూ వెంట ఉన్నారు.
సకాలంలో స్పందించి..
అమీర్‌పేట ఎల్లారెడ్డిగూడకు చెందిన అబ్దుల్ సీఎంఆర్ సంస్థలో వ్యాలెట్ పార్కింగ్‌లో ఉద్యోగం చేస్తుంటారు. ఆయనకు నిజాంపేటలో పని ఉండడంతో జూబ్లీహిల్స్, వేలాడే వంతెన మీదుగా హైటెక్ సిటీ, జేఎన్‌టీయూ మీదుగా వెళ్లాలని ద్విచక్రవాహనంపై బయలు దేరారు. తాను వెళ్తున్న మార్గంలో ప్రమాదం జరిగిన విషయాన్ని గమనించి వెంటనే డయల్ 100కు ఫోన్ చేశారు. ఆ తర్వాత 108 అంబులెన్స్‌కూ సమాచారం అందించారు. అంబులెన్స్ వచ్చే వరకు అక్కడే ఉండి అందులోకి క్షతగాత్రుడిని ఎక్కించడంలోనూ సహాయం అందించారు. ఆ తర్వాత ఆసుపత్రికి వెళ్లారు.
సమయస్ఫూర్తితో..
మరోవైపు ప్రమాదం జరిగిన ప్రదేశానికి కొద్దిదూరంలో విధుల్లో ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుల్ ఇస్లావత్ గోవింద్ కూడా సకాలంలో స్పందించారు. డయల్ 100 నుంచి ప్రమాదంపై ఆయనకు సమాచారం అందింది. ట్రాఫిక్‌ను నియంత్రిస్తూ స్థానిక పోలీసులకు సమాచారం అందించడమే కాకుండా ఆసుపత్రికి తరలించడంలో సహకారం అందించారు. వీరిద్దరి సమయస్ఫూర్తితో సాయిధరమ్ తేజ్‌ను సకాలంలో ఆసుపత్రికి తరలించగలిగారని పోలీసు అధికారులు తెలిపారు.
సంబంధిత కథనాలు:
హీరో సాయిధరమ్ తేజ్‌కు రోడ్డు ప్రమాదం
sai dharam tej: అతివేగం, నిర్లక్ష్యం వల్లే సాయిధరమ్ తేజ్‌కు ప్రమాదం: డీసీపీ