బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'తలైవి'. తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత జీవితాన్ని ఆధారంగా చేసుకుని ఈ సినిమా రూపుదిద్దుకుంది. సెప్టెంబర్ 10న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా నటి కంగన శనివారం ఉదయం చెన్నైకు చేరుకుని జయలలిత సమాధి వద్ద నివాళులర్పించారు. 'తలైవి' సినిమా అందరికీ చేరువ కావాలని కోరుకున్నారు. ఎంజీఆర్ సమాధి వద్ద కూడా నివాళులర్పించి.. కొంత సమయంపాటు అక్కడే మౌనం పాటించారు. ఇకపై ఆమె ‘తలైవి’ ప్రమోషన్స్‌లో ఫుల్ యాక్టివ్‌గా పాల్గొననున్నారు.
విద్యార్థి దశ నుంచి సినిమా హీరోయిన్.. అక్కడి నుంచి రాజకీయ నేతగా ఎదిగే క్రమంలో జయలలిత ఎదుర్కొన్న ఇబ్బందులేమిటి?ఎంజీఆర్‌తో ఆమెకు పరిచయం ఎలా ఏర్పడింది? ఇలా ఎన్నో ఆసక్తికర అంశాలతో ఏ.ఎల్.విజయ్ 'తలైవి' చిత్రాన్ని రూపొందించారు. టైటిల్ రోల్‌లో కంగన నటిస్తుండగా.. ఎంజీఆర్‌గా అరవిందస్వామి సందడి చేయనున్నారు. భాగ్యశ్రీ కీలకపాత్రలో కనిపించనున్నారు. విష్ణువర్ధన్ ఇందూరి, శైలేష్ ఆర్.సింగ్, బ్రిందా ప్రసాద్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు.