చిత్రం: సామాన్యుడు; నటీనటులు: విశాల్, డింపుల్ హయతి, యోగిబాబు, బాబురాజ్ జాకబ్, తులసి, రవీనా రవి, మనోహర్ తదితరులు; దర్శకత్వం: తు ప శరవణన్; నిర్మాత: విశాల్; సంగీతం: యువన్ శంకర్ రాజా; సినిమాటోగ్రఫీ: కెవిన్ రాజా; ఎడిటర్: ఎన్ బి శ్రీకాంత్; కళ: ఎస్ఎస్ మూర్తి
యాక్షన్ కథలకు కేరాఫ్ అడ్రస్ విశాల్. సాంకేతికత, థ్రిల్లింగ్ అంశాలతో కూడిన కథలతో సినిమాలు చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తుంటారు. ఈసారి క్రైమ్ నేపథ్యంలో సాగే యాక్షన్ థ్రిల్లర్ 'సామాన్యుడు' చేశారు. జనవరిలోనే ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ చిత్రం కాస్త ఆలస్యంగా ఈ శుక్రవారం(ఫిబ్రవరి 4) విడుదలైంది. మరి ఈ సినిమా ఎలా ఉంది? ప్రేక్షకులని థ్రిల్ చేసిందా? లేదా?
కథ: పోరస్(విశాల్) పోలీస్ ఆఫీసర్ కావాలని కలలు కనే ఓ సామాన్య యువకుడు. మైథిలి (డింపుల్ హయాతి)తో ప్రేమలో ఉంటాడు. కుటుంబం, కలలే ప్రపంచంగా బతుకుతున్న పోరస్ చెల్లెలు ద్వారక ఓ పోకిరి వల్ల ఇబ్బంది పడుతుంది. పోకిరి నుంచి ద్వారకను కాపాడుకునే క్రమంలోనే ఆమె హత్యకు గురవుతుంది. ద్వారకతో పాటు మరి కొన్ని హత్యలు కూడా జరుగుతాయి. ఈ హత్యల వెనక రాజకీయం ఉంటుంది. ఆ వలయాన్ని ఛేదించి హత్యల వెనకున్న హంతకులను పోరస్ ఎలా బయటకు తీశాడన్నదే ఈ కథ.
ఎలా ఉందంటే: క్రైమ్ డ్రామాతో కూడిన ఓ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం ఇది. చాలా సినిమాల్లో చూసిన సాధారణ కథే. కానీ, దర్శకుడు ప్రత్యేకమైన కథనంతో సినిమాను అసక్తికరంగా మార్చారు. ఆరంభ సన్నివేశాలు సాదా సీదాగానే అనిపించినా, కథలోకి రాజకీయం ప్రవేశించాక ఆసక్తికరంగా మారుతుంది. కథానాయకుడి చెల్లెలు, దివ్య అనే యువతి, సామాజిక కార్యకర్త కథలను ముడిపెట్టిన విధానం మెప్పిస్తుంది. ప్రథమార్థం హత్యోదంతాలు, బాధితుల నేపథ్యాల పరిచయంతో సాగుతుంది. ఆ హత్యల వెనకున్న హంతకులను కథానాయకుడు వేటాడే క్రమమే ద్వితీయార్థం. విరామానికి ముందు సన్నివేశాలు, పతాక సన్నివేశాలు మరింత బిగితో సాగుతాయి. గౌరవం, పలుకుబడి కోసం కొంతమంది రాజకీయ నాయకులు చేసే ఆకృత్యాలను కళ్లకు కట్టే ప్రయత్నం చేశారు. విశాల్ మార్క్ యాక్షన్ కథ ఇది.
ఎవరెలా చేశారంటే: విశాల్‌కు అలవాటైన పాత్రే ఇది. పోరస్‌గా మధ్య తరగతి కుటుంబానికి చెందిన ఓ సామాన్య యువకుడి పాత్రలో ఒదిగిపోయారు. యాక్షన్ సన్నివేశాల్లో ఆకట్టుకున్నారు. డింపుల్ హయాతి కథానాయకుడి ప్రియురాలిగా కనిపించింది. ఆమె పాత్రకు పెద్దగా ప్రాధాన్యం లేదు. కానీ, ఉన్నంతలో అందంగా కనిపించింది. యోగిబాబు కథానాయకుడి స్నేహితుడిగా ప్రథమార్థంలో నవ్వించాడు. విశాల్ చెల్లెలిగా రవీనారవి, తల్లిగా తులసి ఆయా పాత్రలపై ప్రభావం చూపించారు. సాంకేతిక విభాగంలో యువన్ సంగీతం హైలెట్‌గా నిలిచింది. కెవిన్ కెమెరా పనితనం పర్వాలేదు. దర్శకుడు శరవణన్ కథనంపై ప్రభావం చూపించారు. తెలిసిన కథే అయినా కొత్తగా చెప్పే ప్రయత్నం చేశారు.
బలాలు
+విశాల్ నటన
+కథనం, థ్రిల్లింగ్ అంశాలు
+ద్వితీయార్థం
బలహీనతలు
-ఆరంభ సన్నివేశాలు
-తెలిసిన కథ
చివరిగా: సామాన్యుడు అలరిస్తాడు..!
గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!
ఇదీ చూడండి: Good Luck Sakhi Movie review: 'సఖి'ని అదృష్టం వరించిందా?