మహారాష్ట్ర ప్రభుత్వంతో మాటల యుద్ధం కొనసాగిస్తున్న బాలీవుడ్ నటి కంగనా రనౌత్‌కు దక్షిణాది సినీనటుడు విశాల్ మద్దతు పలికాడు. శివసేన నేతలతో ఆమె తలపడుతుండటాన్ని ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు భగత్‌సింగ్ పోరాటంతో పోల్చాడు. ఈ మేరకు కంగన ధైర్యాన్ని ప్రశంసిస్తూ విశాల్ ఓ ట్వీట్ చేశాడు.
"డియర్ కంగన.. నీ ధైర్యసాహసాలకు హ్యాట్సాఫ్. నీ వ్యక్తిగత సమస్య కాకపోయినా ధైర్యంగా నిలబడి ప్రభుత్వాన్ని ఎదురిస్తున్నావు. ప్రభుత్వాలు తప్పులు చేసినప్పుడు తమ గళాన్ని ఎలా వినిపించాలో ప్రజలకు ఓ పెద్ద ఉదాహరణగా నిలిచావు. ఇది 1920లలో భగత్‌సింగ్ చేసిన పోరాటంలాంటిదే. ఒక సెలబ్రిటీనే కాకుండా సామాన్యుడు కూడా ప్రభుత్వాన్ని నిలదీయ వచ్చనే సందేశాన్ని సమాజానికి ఇచ్చినందుకు అభినందనలు."
-విశాల్, సినీ నటుడు
బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ అనుమానాస్పద మరణం తర్వాత కంగన ముంబయిని పాక్ ఆక్రమిత కశ్మీర్‌తో పోలుస్తూ వ్యాఖ్యలు చేసింది. ఈ కారణంగా ఆమెకు, అధికార శివసేన పార్టీ నేతలకు మధ్య వివాదం నెలకొంది.