కోలీవుడ్లో మరో వివాదం చెలరేగింది. తమిళ నటుడు రాధారవిపై హీరో విశాల్ మండిపడ్డారు. మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు రవి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
"రాధారవి గారు.. నడిగర్ సంగం ప్రధాన కార్యదర్శిగా మీపై చర్యలు చేపట్టే అధికారం నాకు ఉండుంటే బాగుండేది. మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన మీరు ఇంకా ఎదగాలి. మీ పేరులో రాధాని తీసి రవి అని పెట్టుకోండి. మరి రాధా అంటే మహిళ పేరే కదా" -విశాల్, తమిళ హీరో
రవి వివాదాస్పద వ్యాఖ్యలు...
నయనతార ప్రధాన పాత్రలో నటించిన 'కొలైముదిర్కాలం' ప్రచారంలో భాగంగా ముఖ్య అతిథిగా వచ్చారు రాధారవి. ఈ కార్యక్రమంలో రవి మాట్లాడుతూ..."నయనతార గొప్ప నటే. కానీ ఆమెను ఎంజీఆర్, శీవాజీ గణేశన్లతో పోల్చడం బాధగా ఉంది. ఒకపక్క దెయ్యాల పాత్రలో నటించే ఆమె మరోపక్క సీత పాత్రలోనూ మెప్పిస్తున్నారు. ఆమెను చూస్తే దెయ్యాలు కూడా పారిపోతాయి" అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
రవి వ్యాఖ్యల పట్ల తమిళ చిత్రసీమలో విమర్శలు వెల్లువెత్తాయి. ఆయనపై చర్యలు తీసుకోవాలని కొందరు సినీ ప్రముఖులు డిమాండ్ చేశారు. నటి వరలక్ష్మీ, గాయని చిన్మయి, దర్శకుడు విఘ్నేశ్ శివన్.. రాధారవి వ్యాఖ్యలను ఖండించారు.