రాసుకున్న కథని తెరపైకి తీసుకొచ్చేందుకు ఒక్కో దర్శకుడు ఒక్కో విషయంలో కంఫర్ట్, సెంటిమెంట్ అనురిస్తారనే విషయం తెలిసిందే. తాము తెరకెక్కించే ప్రతి సినిమాకు ఒకే సంగీత దర్శకుడ్ని తీసుకునే వాళ్లు కొందరైతే.. ఒక్క సన్నివేశం అయినా సరే ఫలానా లొకేషన్‌లో చిత్రీకరించాల్సిందే అనుకునే వాళ్లు మరికొందరు. విక్రమ్ కె. కుమార్ దీనికి విభిన్నంగా నిలుస్తారు. అదెలా అంటే.. ఇప్పటి వరకు 8 సినిమాలు తీసిన ఆయన 6 సినిమాల్లోని నాయిక పాత్రకు 'ప్రియ' అనే పేరును పెట్టారు. ప్రియ అంటే ఆయనకు అంత ప్రియం! మరి ఆయన చిత్రాలేవి? ప్రియగా కనిపించిందెవరు? చూద్దాం..
'సైలెంట్ స్ర్కీమ్' అనే లఘు చిత్రం తెరకెక్కించి జాతీయ అవార్డు అందుకున్న విక్రమ్ తొలిసారి 'ఇష్టం' సినిమా కోసం మెగాఫోన్ పట్టారు. ప్రముఖ నటి శ్రియ తొలి చిత్రమిదే. ఇందులో ఆమె నేహ అనే పాత్ర పోషించింది. ఆయన ద్వితీయ చిత్రం 'అలై' (తమిళ్). ఇందులో మీరాగా కనిపించింది త్రిష. ఈ రెండు సినిమాలు మినహా ఆయన దర్శకత్వంలో వచ్చిన చిత్రాలన్నీ ప్రియమైనవే. నీతూ చంద్ర, సమంత, నిత్యా మేనన్, కల్యాణి ప్రియదర్శిని, ప్రియాంక అరుళ్ మోహన్ ఈ జాబితాలో నిలిచారు.