VijaySethupati helping nature: విలక్షణ నటుడు విజయ్‌సేతుపతి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తనదైన శైలి నటనతో అని భాషల్లోనూ క్రేజ్ సంపాదించుకున్నారు. ఆపదలో ఉన్న ఎంతో మందికి ఆపన్న హస్తం అందించారు. తాజాగా అందుకు సంబంధించిన ఓ వార్త ఒకటి వెలుగులోకి వచ్చింది. లక్షకుపైగా నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పించడంలో తనవంతు సహకారం విజయ్ అందించారని తెలిసింది. ఈ విషయాన్ని పుదుచ్చేరికి చెందిన ఓ సామాజిక కార్యకర్త వీరరాఘవన్ తెలిపారు.
వీరరాఘవన్.. ఓ కేంద్ర ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తుండేవారు. ఈ క్రమంలోనే 2016 నుంచి ఆయన పలు సేవాకార్యక్రమాలు చేయడం ప్రారంభించారు. ఇందులో భాగంగానే నిరుద్యోగులైన యువతకు ఉద్యోగావకాశాలను కల్పించే దిశగా ప్రయత్నాలు చేశారు. అలా 2019 వరకు దాదాపు 3300 మందికి వాట్సాప్ గ్రూప్‌ల ద్వారా ఉద్యోగావకాశాల సమాచారాన్ని తెలియజేయడంలో తనవంతు సహకారం అందించారు. ఆ సమయంలో ఆయన సేవాకార్యక్రమాలను మెచ్చి 'నమ్మ ఓరు హీరో'(అవర్ విలేజ్ హీరో) అనే టెలివిజన్ షో ఆయనకు ఆహ్వానం పంపింది. ఆ షోకు విజయ్ సేతుపతి హోస్ట్‌గా వ్యవహరించారు. ఆ కార్యక్రమంలో రాఘవన్ చేస్తున్న సామాజిక కార్యక్రమాల గురించి తెలుసుకున్న విజయ్ అందులో భాగస్వామ్యమయ్యారు.
"షో పూర్తయ్యాక విజయ్ నాతో మాట్లాడారు. తనవంతుగా పూర్తిస్థాయి సహకారం అందిస్తానని మాట ఇచ్చారు. ఆయన మాట నమ్మిన నేను నా ఉద్యోగానికి రాజీనామా చేసి పూర్తి సమయాన్ని సేవాకార్యక్రమాలకే కేటాయించాను. దీంతో విజయ్ నా చేత పుదుచ్చేరిలో 'వల్లలార్ వెలై సెవాయ్ ఇయక్కమ్'(Vallallar Velai Vaaipu Sevai Iyakkam)పేరుతో ఓ ఆర్గనైజేషన్‌ను స్థాపించారు. ఆఫీస్‌లో ఉద్యోగులకు జీతాలు కూడా ఇచ్చారు. అలా ఈ ఆర్గనైజేషన్ ద్వారా కంపెనీలకు నిరుద్యోగులకు మధ్య మధ్యవర్తిగా(కన్సల్టెన్సీ)ఉండి లక్షకు పైగా నిరుద్యోగులకు ఉద్యోగావకాశాల సమాచారాన్ని అందించాం. వారంతా ఇప్పుడు ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. ఇదంతా విజయ్ వల్లే సాధ్యమైంది. ఆయనది చాలా గొప్ప మనసు." అని వీరరాఘవన్ తెలిపారు. కాగా, విజయ్ సేతుపతి ప్రస్తుతం పలు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. 'కాతువాకులా రెండు కాదల్', 'విక్రమ్', 'మేరీ క్రిస్మస్', 'గాంధీ టాక్స్', 'ముంబైకర్' సహా పలు చిత్రాలు ఉన్నాయి.
ఇదీ చూడండి: స్టార్ హీరో కారు ఢీకొని వికలాంగుడు మృతి.. ఒకరు అరెస్టు!