తమిళ నటుడు విజయ్ సేతుపతి.. మరోసారి రియల్ హీరో అనిపించుకున్నాడు. ఇప్పటికే పలు సేవా కార్యక్రమాలతో గుర్తింపు తెచ్చుకున్న ఈ కథానాయకుడు.. మరోసారి తన దాతృత్వం చాటుకున్నాడు. రైతులకు ఓ భవంతిని విరాళంగా ఇచ్చాడు.
ఏం జరిగిందంటే..!
విజయ్ సేతుపతి, శ్రుతి హాసన్.. ప్రస్తుతం 'లాభం' అనే సినిమాలో జంటగా నటిస్తున్నారు. వ్యవసాయం నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో యూనియన్ నాయకుడిగా కనిపించనున్నాడీ నటుడు. ప్రస్తుతం కుంద్రతూర్ దగ్గరలోని పెరువయాల్ ప్రాంతంలో షూటింగ్ జరుగుతోంది. సినిమా కోసం రైతుసంఘ భవనం ఒకటి నిర్మించాలని నిర్మాతలు భావించారు.
అయితే ఈ భవనాన్ని సెట్ మాదిరిగా కాకుండా నిజంగా రూపొందించాలని నిర్మాతలని అడిగాడట మక్కల్. అందుకు అంగీకరించిన నిర్మాతలు భవంతిని రూపొందించి, షూటింగ్ పూర్తయిన తర్వాత సమీప ప్రాంతానికి చెందిన రైతులకు విరాళంగా అందించారట. విజయ్ సేతుపతి తీసుకున్న ఈ నిర్ణయంపై నెటిజన్లతో పాటు రైతులు కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు.
ఇటీవలే వచ్చిన 'సైరా'లో రాజా పాండీ అనే పాత్రలో నటించి ఆకట్టుకున్నాడు విజయ్. మెగాహీరో వైష్ణవ్‌తేజ్ హీరోగా పరిచయమవుతున్న 'ఉప్పెన'లోనూ కీలక పాత్ర పోషిస్తున్నాడు.
ఇది చదవండి: విలన్ పాత్ర కోసం విజయ్ సేతుపతికి రూ.5 కోట్లు..!