'వందేమాతరం..' అంటూ ఆయన గొంతెత్తి పాడితే ఆ పదాలకు మన పాదాలు కదులుతాయి. 'నీ పాదం మీద పుట్టు మచ్చనై చెల్లెమ్మా' అంటూ పాట అందుకుంటే అన్నాచెల్లెళ్ల అనుబంధం గుర్తొచ్చి కళ్లు చెమరుస్తాయి. 'కీరవాణి రాగంలో..' పాట వింటే మనసు ప్రేమతో పులకరిస్తుంది. 'అయ్యప్ప దేవాయ నమః' అంటూ పాట వినపడితే భక్తి పారవశ్యంతో తన్మయత్వానికి గురవుతాం. తొలినాళ్లలో విప్లవ గీతాలకు సంగీతం సమకూర్చిన ఆయన ఆ తరవాత మనసుకు హత్తుకునే ఎన్నో మెలొడీలను అందించారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనే తత్వం... జనరంజకమైన తన పాటలతో పోటీపడే అపురూపమైన వ్యక్తిత్వం కలిగిన ఆయనే.. వందేమాతరం శ్రీనివాస్. ఆయన పుట్టిన రోజు సందర్భంగా ఎవర్‌గ్రీన్ పాటల సంగీత దర్శకుడికి శుభాకాంక్షలు చెబుతూ ఆయన గురించిన ఆసక్తికర విశేషాలు..
చిన్నప్పటి నుంచే పాటలంటే మక్కువ
'వందేమాతరం' ఇంటి పేరుగా ప్రేక్షకులకు సుపరిచితులైన శ్రీనివాస్ అసలు ఇంటి పేరు కన్నెబోయిన. ఖమ్మం జిల్లా చింతకాని మండలం రామకృష్ణాపురంలో పేద వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. శ్రీనివాస్‌కు చిన్నప్పటి నుంచి పాటలంటే ఇష్టం. అప్పట్లో విడుదలైన సినిమాల్లో పాటలు వినపడితే తెలియని భావోద్వేగానికి గురయ్యే వారు. కేవలం పాటలు నేర్చుకునేందుకే సినిమాలు చూసేవారు. ఇక ఊళ్లో ఏ పండగ చేసినా, ఫంక్షన్ జరిగినా శ్రీనివాస్ పాట ఉండాల్సిందే. అడిగి మరీ తనతో పాటలు పాడించుకునే వారు. అలా చిన్నప్పుడే పాట పట్ల ఎంతో మక్కువ ఏర్పడింది. సరిగ్గా అదే సమయంలో 'భూమి కోసం', 'అల్లూరి సీతారామరాజు' చిత్రాలు విడుదలయ్యాయి. వాటిల్లోని 'ఎవరో వస్తారని..', 'తెలుగు వీర లేవరా..' పాటలంటే శ్రీనివాస్‌కు ఎంతో ఇష్టం ఏర్పడింది. 'తెలుగు వీర లేవరా..' పాట నేర్చుకునేందుకు 'అల్లూరి సీతారామరాజు' చిత్రాన్ని దాదాపు 10 సార్లు చూశారు.
ప్రజా నాట్యమండలిలో అడుగుపడిందలా..
శ్రీనివాస్ అన్నయ్య అంజయ్య ప్రజా నాట్యమండలి కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవారు. 1975 ప్రజా నాట్యమండలి శిక్షణ శిబిరం ఖమ్మంలో పెట్టడంతో శ్రీనివాస్ కూడా దానికి వెళ్లారు. కానీ శిబిరంలోకి అనుమతించలేదు. ఆ సమావేశాలు జరిగినన్ని రోజులూ గేటు బయట కూర్చొనేవారు. పదమూడేళ్ల అతడి మనసులో శిక్షణ శిబిరంలోకి వెళ్లాలనీ, పాటలు పాడాలనీ ఒకటే ఆరాటం. బయటికి వచ్చి వెళ్లే చాలామందిని లోపలికి పంపించండన్నా అని అడిగాడు. ఎవరూ సాయం చేయలేదు. 'అక్కడ నల్లూరి గారుంటారు, ఆయన్ని అడుగు బాబూ' అంటూ చేయి చూపించారొకరు. నల్లూరి వెంకటేశ్వర్లు ప్రజా నాట్యమండలి అధ్యక్షులు. నల్లూరన్నగా చాలామందికి చేరువైన వారు. ఒకరోజు ఆయన శ్రీనివాస్ కంటపడ్డారు. 'నన్ను లోపలికి రానివ్వండన్నా, బాగా పాడతాను' అని అడిగారు. ఆ పసి కళ్లల్లో పాడాలన్న తపన. ఆ అడగడంలో ఆత్మవిశ్వాసం. 'సరే' అన్నారాయన. 'తెలుగు వీర లేవరా... దీక్ష బూని సాగరా' పాట ఓ ప్రవాహంలా సాగింది. నల్లూరి మంత్ర ముగ్ధులయ్యారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాలు తిరిగి నటుడు నాగభూషణంతో కలిసి ప్రజానాట్యమండలిని పునరుద్ధరించి, ఎందరో కళాకారులను తయారు చేసిన నల్లూరి... శ్రీనులో ఉన్న ప్రతిభ చూసి ఆశ్చర్యపోయారు. 'శభాష్' అంటూ భుజం తట్టారు. సమావేశాలు జరుగుతున్న లోపలికి వెళ్లి గాన మాధుర్యం నిండిన ఓ చిన్నారి గొంతు బయట ఉంది. దానిని మీరూ వినాలి అని అబ్బురంగా వారందరికీ చెప్పారు.
నల్లూరితో ఒంగోలుకు..
శ్రీనివాస్ పాటలకు ముచ్చటపడిన నల్లూరన్న 'నాతో పాటు ఒంగోలు వస్తావా, ఇంకా పాటలు నేర్పిస్తా' అని అడగటం వల్ల శ్రీనివాస్ 'వస్తాను' అని చెప్పారు. 'నేను ఊరు వెళ్లాక మీ స్థానిక నాయకుడు టీవీ చౌదరికి కబురు చేస్తాను' అని వెళ్లిపోయారు. ఆ తర్వాతి రోజు నుంచి శ్రీనివాస్ ఖమ్మం సీపీఐ ఆఫీసుకు వెళ్లి 'నల్లూరి గారి నుంచి నాకేమైనా కబురొచ్చిందా' అని వెంటపడటం వల్ల అతని బాధ భరించలేక టీవీ చౌదరి.. నల్లూరి విజయవాడలో ఓ సమావేశానికి వచ్చినప్పుడు శ్రీనివాస్‌ను తీసుకెళ్లి ఆయనకు అప్పగించారు. ఏదో ఒకటి రెండు జతల బట్టలతో వచ్చిన శ్రీనివాస్‌ను నల్లూరి తన వెంట ఒంగోలు తీసుకెళ్లి తన ఇంట్లో కుమారులతో సహా పెంచి పెద్ద చేశారు. 'విద్యలేనిదే ఏ కళా రాణించదు' అని విశ్వసించే నల్లూరి మొదట శ్రీనివాస్‌కు ట్యూషన్ పెట్టి ఓ బడిలో చేర్పించి మెట్రిక్ చదివించారు. ఆపై కాలేజీలో చేర్పించారు. అదయ్యాక, నెల్లూరులో న్యాయవిద్య చదువుకునేందుకు ఏర్పాట్లు చేశారు.
గాయకుడిగా అడుగులు అలా..
చదువుతున్న సమయంలోనే శ్రీనివాస్ పాటల గురించి తెలిసిన సంగీత దర్శకుడు చక్రవర్తి, మాదాల రంగారావు, పోకూరి బాబూరావు, టి.కృష్ణ వంటి వాళ్లు ఆయనను మద్రాసుకు పంపమని నల్లూరిని కోరారు. వారంతా ఆయన శిష్యులు. అందరికీ 'ఇప్పుడు కాదు, శ్రీను చదువు పూర్తి అయ్యాక చూద్దాం' అని చెప్పారు. చదువు పూర్తయింది. ఆ తర్వాత మద్రాసు చేరుకున్నారు. మాదాల రంగారావు సారథ్యంలో తెరకెక్కిన 'స్వరాజ్యం'లో రెండు పాటలు పాడారు. 'కాలేజీ కుర్రవాడ కులాసాగ తిరిగెటోడ' పాట మంచి టాక్‌ను తెచ్చుకుంది. ఆ తర్వాత ‘నేటి భారతం'లో 'అత్తా పోదాం రాయే.. సర్కారు దవఖానకు' పాటతో పాటు మరో గీతాన్ని ఆలపించారు. ఓ రోజు ఒంగోలులో జరిగిన వివాహ కార్యక్రమానికి హాజరైన శ్రీనివాస్... సి.నారాయణరెడ్డి రాసిన 'వందేమాతరం' పాటను అక్కడ పాడారు. సరిగ్గా అదే సమయంలో టి.కృష్ణ ఓ సినిమాను తెరకెక్కిస్తుండటం వల్ల శ్రీనివాస్ పాడిన పాట గురించి తెలిసి మద్రాసు పిలిపించుకుని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత సి.నారాయణరెడ్డితో మాట్లాడి తన సినిమాలో శ్రీనివాస్‌తో ఈ పాట పాడించారు. అప్పటివరకూ సినిమాకు టైటిల్ కూడా పెట్టలేదు. శ్రీనివాస్ పాట పాడిన తర్వాత ‘వందేమాతరం’ అని టైటిల్ ఖరారు చేశారు. ఆ పాట తెలుగునాట మార్మోగిపోయింది. అయితే, అప్పటికే చిత్ర పరిశ్రమలో అనేకమంది శ్రీనివాస్‌లు ఉండటంతో ఈయనను కూడా శ్రీనివాస్ అని రాస్తే పాఠకులు తికమకపడతారని ‘వందేమాతరం’ శ్రీనివాస్ అని పత్రికల్లో రాశారు. అప్పటి నుంచి కన్నెబోయిన శ్రీనివాస్ కాస్తా ‘వందేమాతరం’ శ్రీనివాస్‌గా మారారు.
ఆదర్శ వివాహం
నెల్లూరులో లా చదువుతున్న సమయంలో శ్రీనివాస్ తన కళాశాలలో బీకామ్ చదువుతున్న ఓ అమ్మాయిని ఇష్టపడ్డారు. ఆమెకీ శ్రీనివాస్ నచ్చారు. వీరి పెళ్లికి అమ్మాయి ఇంట్లో వాళ్లు ఒప్పుకోకపోవడంతో నల్లూరి స్వయంగా వారి వివాహం చేశారు. ఆ తర్వాత శ్రీనివాస్ నేపథ్యం, మంచితనం, తెలుసుకున్న అమ్మాయి కుటుంబ సభ్యులు వారి వివాహానికి ఆశీర్వాదం అందించారు. శ్రీనివాస్ దంపతులకు ఇద్దరు కుమార్తెలు. ఒక కుమారుడు. కుమార్తెలిద్దరూ వైద్య విద్యను అభ్యసిస్తున్నారు. కుమారుడు కంప్యూటర్ సైన్స్ చదువుతున్నారు.
ఆ చిత్రంతో సంగీత దర్శకుడిగా..
తొలినాళ్లలో విప్లవ సినిమాల్లో పాటలు పాడిన ఆయన ‘లాల్ సలాం’తో సంగీత దర్శకుడిగా మారారు. ఆ చిత్రానికి రూ.25వేలు పారితోషికం తీసుకున్నారు. సంగీత దర్శకుడిగానూ తొలినాళ్లలో విప్లవ సినిమాలకే పనిచేశారు. ‘ఒరేయ్ రిక్షా’, ‘శ్రీరాములయ్య’, ‘ఒసేయ్ రాములమ్మ’ వంటివి వందేమాతరం శ్రీనివాస్‌కు ఎంతో గుర్తింపును తెచ్చాయి. ఇంటింటా అతణ్ని పరిచయం చేశాయి. ‘పెళ్లి పందిరి’లో పాటలకూ ఎంతో పేరొచ్చింది. ఆ తర్వాత పలు చిత్రాలకు సంగీత దర్శకత్వం వహించినా ‘స్వయంవరం’లో పాటలు అభ్యుదయ బాణీల శ్రీనూని మెలొడీ పాటల మెరుపుగా సంగీత ప్రియులకు పరిచయం చేశాయి. ఒక తరహా పాటలకు పరిమితమైన కళాకారుడు కాదు... ‘అతడో ఆల్‌రౌండర్’ అనుకునేలా చేశాయి. అప్పట్నుంచి కమర్షియల్ సినిమాలూ అతని ముంగిట వాలాయి. వెంకటేశ్ కథానాయకుడిగా వచ్చిన ‘జయం మనదేరా’లో పాటలు మీకు గుర్తుంటే, అందులో ఒక్కోటి ఓ సూపర్ హిట్!
అలా అయితేనే ‘జయం మనదేరా’కు పేరు వేస్తామన్నారట!
వెంకటేశ్ కథానాయకుడిగా ఎన్.శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘జయం మనదేరా’. ఈ చిత్రానికి సంగీతం అందించడం వెనుక చిన్న సంఘటన జరిగింది. సినిమా షూటింగ్ జరిగినన్ని రోజులు దర్శకుడు శంకర్‌తో పాటే సంగీత దర్శకుడు ఉండాలి. పైగా శంకర్ తన మొదటి చిత్రం నుంచి వందేమాతరం శ్రీనివాస్‌ను సంగీత దర్శకుడిగా తీసుకోవడం అలవాటు. ఇదే విషయాన్ని వెంకటేశ్‌కు చెబితే ‘ఆయన విప్లవ సినిమాలకు సంగీతం అందిస్తారు కదా! ఈ సినిమాకు చేయగలరా’ అని అడిగారట. అప్పుడు చిత్ర నిర్మాణ సంస్థ ఒక షరతు పెట్టింది. ‘ఈ సినిమాలో మీరిచ్చే పాటలు నచ్చితే మీ పేరు వేస్తాం. లేకపోతే వేయం’ అని. వాళ్లు సరదాగా కూడా అని ఉండొచ్చు. కానీ శ్రీనివాస్ దాన్ని ఓ ఛాలెంజ్‌గా తీసుకున్నారు. ఆ సినిమాకు అద్భుతమైన పాటలు అందించారు. కోడి రామకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ‘దేవుళ్లు’ సినిమాకు పనిచేసినప్పుడూ కొందరు పెదవి విరిచారట. అయితే అందులో పాటలు విని అందరూ ఆశ్చర్యపోయారు. తన కెరీర్‌లో ఈ రెండు సినిమాలకు పనిచేయడం పెద్ద సవాల్ అని అంటారు వందేమాతరం శ్రీనివాస్.
అవార్డులు
వందేమాతరం శ్రీనివాస్ ఉత్తమ గాయకుడిగా మూడుసార్లు, ఉత్తమ సంగీత దర్శకుడిగా మరో మూడు సార్లు నంది అవార్డులు అందుకున్నారు. ‘ఒసేయ్ రాములమ్మా’ చిత్రానికి గానూ ఉత్తమ సంగీత దర్శకుడిగా ఫిల్మ్‌ఫేర్ సొంతం చేసుకున్నారు. కేవలం సంగీత దర్శకుడు, గాయకుడిగానే కాదు, ‘అమ్ములు’ చిత్రంతో నటుడిగానూ మంచి పేరు తెచ్చుకున్నారు. 2010లో ‘బద్మాష్’ చిత్రానికి దర్శకత్వం వహించారు.
ఓ గాయకుడిగా తెలుగు వారికి తను చిరపరిచితుడు. సంగీత దర్శకుడిగా తనదో ప్రత్యేక ముద్ర. నాలుగున్నర దశాబ్దాలుగా ‘పాట’సారిగా తను నడిచిన బాట కోట్ల మందికి ఆనందాల ఊట. ఇవన్నీ ఒకెత్తయితే, చుట్టూ చప్పట్లు, ప్రశంసల ప్రపంచం ఉన్నా తను నడిచొచ్చిన దారినీ, సాయం అందించిన చేతుల్నీ మరిచిపోని ఉన్నత వ్యక్తిత్వం తనది. ‘మీకు పుట్టిన రోజు శుభాకాంక్షలు సర్’ అంటే, ‘థ్యాంక్స్ తమ్ముడూ, కానీ నీకో విషయం చెప్పాలి, నిజానికి నా అసలైన పుట్టిన రోజేదో నాకు తెలియదు. నా గురువు, ఆత్మీయుడు నా పాట విని సంతోషించిన రోజు, అక్కణ్నుంచి నేను అడుగులు వేసిన రోజు... ఈ సెప్టెంబరు 9. నా పాట మురిసిన ఈ రోజునే నా పుట్టిన రోజుగా చాలా ఏళ్లుగా జరుపుకొంటున్నా’ అంటూ నల్లూరన్నను గుర్తు చేసుకుంటారు. చప్పట్లు కొట్టిన చేతుల్ని మరిచిపోవచ్చు. చేయూతనిచ్చిన వారిని జీవితాంతం గుండెల్లో పెట్టుకోవాలి. తన ఎదుగుదలకు కృషి చేసిన ప్రతి ఒక్కరి గురించీ శ్రీనివాస్ పదేపదే చెబుతుంటారు. సుమారు ఇరవై ఏళ్ల క్రితం శ్రీనివాస్ రీరికార్డింగ్ థియేటర్ ఏర్పాటు చేయాలనుకున్నారు. తెలిసిన వాళ్లు రకరకాల పేర్లు సూచించారు. కానీ అప్పటికే శ్రీనివాస్ మదిలో ఓ పేరుంది. అదే నల్లూరి. ప్రచారాన్ని కోరుకోని నల్లూరి ‘నా పేరు వద్దు శ్రీను’ అంటూ సున్నితంగా వారించారు. మనసులో ఒకటి రెండు రోజులు మథనం. చివరికి ‘అన్నా స్టూడియోస్’ పేరుతో రికార్డింగ్ థియేటర్‌ను ప్రారంభించారు. నల్లూరన్న ఏం అడగలేదు. ‘అదేంటి’ అన్నట్టు ఓసారి శ్రీను వైపు చూశారు. పసి వాడుగా నా చేయి పట్టి నడిపించి, ఉన్నత చదువుల వైపు దారి చూపించి, పాటల బాటలో పేరు పొందేలా చేసిన నీ పేరు గాక ఇంకేం పేరు పెట్టను అన్నా... అన్నట్టు పెద్దాయన వైపు చూశారు. గురు భావంతో చేతులు జోడించారు. దజీట్.. వందేమాతరం శ్రీనివాస్.