ప్రేమ పుట్టేందుకు సమయం అక్కర్లేదు. అనుకోకుండా ఓ రోజు కొంటెగా గుండె తలుపు తట్టే ఫీలింగ్ అది. విజయవంతమైతే జీవితంలో తుదిశ్వాస వరకు నిలిచే బంధమవుతుంది. అలాంటి లవ్ మాయలో పడిన సినీతారలూ ఉన్నారు. కొందరు వెండి తెరపై అమర ప్రేమికులుగా కనిపించి మెప్పించారు.ఈ రోజు ప్రపంచ ప్రేమికుల దినోత్సవం. ఈ సందర్భంగా ప్రేమ గురించి మన తారలు ఏమంటున్నారు? వాళ్ల జీవితంలో ప్రేమ కథలేంటి? అందుకున్న ప్రేమలేఖలెన్ని.. ఈ విషయాల్ని ప్రేమగా ఆరా తీస్తే పంచుకున్న విశేషాలివే..
కీర్తి సురేష్
ప్రేమపై, ప్రేమ పెళ్లిళ్లపై నాకు చాలా గౌరవం, నమ్మకం ఉన్నాయి. మా అమ్మానాన్నలది ప్రేమ వివాహమే. ఆ బంధంలో ఉన్న అందం ఏంటో నాకు బాగా తెలుసు. నేను ప్రేమించి పెళ్లి చేసుకుంటానో, లేదో ఇప్పుడే చెప్పలేను. నాది ప్రేమ పెళ్లే అయినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. కాలేజీ రోజుల్లో ప్రేమకథలు, ప్రేమ లేఖలు లాంటి అనుభవాలేం లేవు. కానీ సినిమాల్లోకి వచ్చాక ఓ ప్రేమలేఖ వచ్చింది. అదీ ఓ అభిమాని నుంచి. నాకు సంబంధించిన ఫొటోలన్నీ సేకరించి ఓ పుస్తకంలా మలిచాడు. పెళ్లి చేసుకోవాలని ఉంది అంటూ ప్రపోజల్ పెట్టాడు. ఇవన్నీ మంచి జ్ఞాపకాలు.

రాశీ ఖన్నా
స్కూలు రోజుల్లోనే తొలి ప్రేమలేఖ అందుకున్నాను. నా సీనియర్ అబ్బాయి గులాబీ పువ్వు, ఓ ప్రేమలేఖ అందించాడు. అదో అల్లరి ప్రేమ. ఆ తర్వాత ప్రేమకూ, అలాంటి వాతావరణానికీ దూరంగా పెరిగాను. ప్రేమికుల రోజు జరుపుకోవడానికి నేనేం వ్యతిరేకం కాదు. పైగా నాకు ఇలాంటి వేడుకలంటే చాలా ఇష్టం. ప్రేమని వ్యక్తపరచుకోవడానికో, మనసులో ఉన్న భావాల్ని పంచుకోవడానికో ఓ రోజు తప్పకుండా కావాలి. అందుకు ఫిబ్రవరి 14 ఓ వేదిక. కాకపోతే ప్రేమించుకోవడానికి ఈ ఒక్క రోజు సరిపోదు. 365 రోజులూ ప్రేమవే.

విజయ్ దేవరకొండ
ఇది వరకు ప్రేమపై నాకు ఎలాంటి అభిప్రాయమూ ఉండేది కాదు. ఓ అమ్మాయిని ప్రేమించి అది బ్రేకప్ అయ్యాకా మరొకరిని కూడా అదే స్థాయిలో ప్రేమించే అబ్బాయిలు నాకు తెలుసు. వాళ్లని చూసినప్పుడల్లా ‘ఇదేం ప్రేమరా బాబూ’ అనుకునేవాడిని. కానీ మెల్లమెల్లగా ప్రేమపై నమ్మకం పెరుగుతోంది. మన కోసం మరొకరు ఉన్నారన్న అద్భుతమైన ఫీలింగ్ ప్రేమ. నేనెవరికీ ప్రేమలేఖలు రాయలేదు గానీ, నాకు ఇప్పుడు బాగానే వస్తున్నాయి. మా ఇంటి చిరునామా వెదుక్కుంటూ మరీ అమ్మాయిలు వస్తున్నారు. వాచ్‌మెన్‌కి ప్రేమలేఖలూ, బహుమతులూ ఇచ్చి వెళ్లిపోతున్నారు. అలాంటివన్నీ చాలా జాగ్రత్తగా దాచుకుంటున్నా.

కాజల్
ప్రేమలేక పోతే ఏ వ్యక్తి జీవితమూ పరిపూర్ణం కాదు. నిజానికి ప్రేమతోనే జీవితం మొత్తం ముడిపడి ఉంది. నిజమైన ప్రేమని అందుకోవడానికే ఈ ప్రయాణం సాగిస్తుంటాం. అది ఎప్పుడు దొరుకుతుందో ఎవరూ చెప్పలేరు. నాకైతే ఇప్పటి వరకూ ఎదురుకాలేదు. నాకు చాలా లవ్ ప్రపోజల్స్ వచ్చాయి. సినీ నటి కాకముందే ఓ కుర్రాడు నా వెంట పడ్డాడు. తను నాకు మంచి స్నేహితుడు. అయితే.. 'ఇది ప్రేమించే వయసు కాదులే..' అని సర్దిచెప్పాను. ఆ తరవాత ప్రేమించడానికి తీరికే లేకుండా పోయింది.

నితిన్
కాలేజీ రోజుల్లో నాకు ప్రేమకథలు లేవు. ప్రేమలేఖలు రాసింది కూడా లేదు. ఇప్పుడు మాత్రం ప్రేమించిన అమ్మాయినే పెళ్లి చేసుకోబోతున్నా. ఏప్రిల్‌లో మా పెళ్లి. అందుకే ఈ వాలెంటెన్స్ డే కాస్త స్పెషల్. నిజానికి నాకు ఇలాంటి రోజులపై పెద్దగా నమ్మకం లేదు. కాకపోతే.. మనమంతా బిజీ లైఫ్‌లో పడిపోతున్నాం. ప్రేమించడానికి కూడా తీరిక ఉండడం లేదు. ఇలాంటి సమయంలో.. ఇష్టపడినవాళ్ల కోసం, మనల్ని ప్రేమించిన వాళ్ల కోసం సమయం కేటాయించడం చాలా అవసరం. అందుకు ఇలాంటి ప్రేమికుల దినోత్సవాలు ఉపయోగపడుతుంటాయి.
