"ప్రేమించడం అంటే జీవించడమే కదా. ప్రేమ లేని జీవితం నా దృష్టిలో జీవితమే కాదు. మనల్ని మనం ప్రేమిస్తూ మన చుట్టూ ప్రపంచాన్ని ప్రేమిస్తుంటే జీవితం ఎంత అందంగా ఉంటుందో ఒకసారి ప్రయత్నించి చూడండి. అబ్బాయితోనో, అమ్మాయితోనో ప్రేమలో ఉంటేనే ప్రేమికుల రోజుని జరుపుకోవాలనేమీ లేదు. ఈ రోజు మనసున్న ప్రతి ఒక్కరిదీ. అందరం ఏదో ఒక దశలో ప్రేమలో పడతాం, ఓడిపోతాం, గెలుస్తాం. అందరిలాగే నిజ జీవితంలో నాకూ ప్రేమకథ ఉంటుంది. ప్రస్తుతానికి నేను సినిమాతో ప్రేమలో ఉన్నా. భవిష్యత్తులో ఇంకో ప్రేమకథ మొదలైందంటే తప్పకుండా నేనే చెబుతా"
- పూజాహెగ్డే
మనసుకు నచ్చినవాడు దొరకగానే నా జీవితం కొత్త రంగులు అద్దుకుందంటూ ఆనందంగా ప్రపంచం మొత్తానికి ఆ విషయాన్ని చాటింది రకుల్‌ప్రీత్ సింగ్. జాకీ భగ్నానీతో ప్రేమ జీవితాన్ని ఆస్వాదిస్తున్న రకుల్... అన్ని రోజులూ ప్రేమకే అంకితం అని చెబుతోంది. "ప్రేమని ఒక్క రోజుకే పరిమితం చేయడం ఎందుకూ? ప్రతి రోజునీ, ప్రతీ క్షణాన్నీ ప్రేమతో గడుపుదాం. నటిగా చాలా ప్రేమకథల్లో నటించా. వాటితో నాకు ప్రేమ గురించి మరిన్ని విషయాలు తెలిశాయి. ఒక్కో పాత్ర ఒక్కో జీవితం, ఒక్కో రకమైన ప్రేమని పరిచయం చేశాయి. ప్రేమపై నాకు మొదట్నుంచీ నమ్మకం ఉంది. ప్రేమ జీవితం ఎప్పటికీ ప్రత్యేకం".
- రకుల్‌ప్రీత్ సింగ్
"ప్రేమికుల రోజంటే నాకు ఇష్టం. అందరూ ఆ రోజు ప్రేమని వ్యక్తం చేస్తుంటారు కదా. అందుకేనేమో. ఒక రోజు ఇంకొంచెం ప్రేమని ఎక్కువగా ప్రదర్శించే అవకాశం ఉందంటే మంచిదే కదా! అందరిలాగే నా జీవితంలోనూ చిన్న చిన్న ప్రేమకథలు ఉన్నాయి. అవన్నీ స్కూల్ డేస్‌లోనే. ఇప్పుడు తలచుకుంటే నవ్వొస్తుంది. అవే కదా అందమైన జ్ఞాపకాలంటే. ప్రేమికుల రోజున పువ్వు ఇచ్చి ప్రేమని వ్యక్తం చేసినవాళ్లు ఉన్నారు, నేనూ పువ్వు ఇచ్చి శుభాకాంక్షలు చెప్పిన రోజులు ఉన్నాయి. ఇప్పుడైతే ప్రేమకి సమయం లేదు. కాకపోతే ఇప్పుడు కెరీర్, జీవితం... ఇలా ఇంకో రకమైన ప్రేమలో గడుపుతుంటాం. అందమైన ప్రేమకథల్లో నటించడం నాకెప్పుడూ ఇష్టమే. ‘ఊహలు గుసగుసలాడే’ మొదలుకొని ‘తొలిప్రేమ’ వరకు నేను చేసిన, నాకు నచ్చిన ప్రేమ కథలు చాలానే ఉన్నాయి".
- రాశీఖన్నా
ఇవీ చదవండి: