ప్రేమ ఎంత పాతదైనా అందులో పడ్డ ప్రతివారికీ అది కొత్తదే కదా! ఆ పరవశాన్ని సరిగ్గా పట్టుకున్న ప్రతిగీతం యువతకి ఇట్టే దగ్గరైపోతుంది. ఆ జాబితాలోకి తాజాగా వచ్చిచేరింది 'ఉప్పెన'లోని 'నీ కన్ను నీలి సముద్రం...' పాట. యువరచయిత శ్రీమణి గీతం అది. ప్రేమ... ఎన్నెన్ని మాటల్లో చెప్పినా తనివి తీరని భావాల జలపాతం. దాన్ని తన పాట దోసిట్లోపట్టి కొత్తతరం నోటికి తీయగా అందించిన శ్రీమణి ఆ క్రమాన్ని ఇలా వివరించారు...
'100% లవ్'తో సుకుమార్‌గారే నన్ను సినీరంగానికి పరిచయం చేశారు. ఆయన నిర్మాతగా మారి తన శిష్యుడు బుచ్చిబాబు దర్శకుడిగా ఓ సినిమా తీస్తుంటే... దానికి దేవిశ్రీ ప్రసాద్‌గారే సంగీతమైతే... ఆ పాటల సిట్టింగ్ కోసమని నన్ను పిలిస్తే... మనసు ఆనందంతో గంతులేయకుండా ఉంటుందా! ఆ ఆనందంతోనే 'రంగులద్దుకున్న' పాట రాశాను. ఆ సందర్భంలోనే నాకు బుచ్చిబాబుగారు పూర్తి కథనీ చెప్పారు. ఆ పాట సినిమా మధ్యలో వస్తుంది. ఈలోపు హీరో మనసులో దాచిన ప్రేమని చూపే పాట ఒకటుంటే బావుంటుందనుకున్నారట. దానికి గోదావరి జిల్లాల్లో జరిగే ముస్లిం బషీర్‌బేబీ (బంగారు పాప) తిరునాళ్ల నేపథ్యంగా అనుకోవడం వల్ల... దేవి ‘ఖవాలి శైలిలో అద్భుతమైన బాణీనిచ్చారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
అందుకు అనుగుణంగానే ఓ హిందీ పల్లవినీ రాయించి, పాడించారు. తెలుగుకి వచ్చేసరికి దేవిశ్రీ ప్రసాద్‌గారే 'నీ కన్ను నీలి సముద్రం నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం...' అని పల్లవిని చెప్పారట. దాన్ని ఆపై అంచెకు తీసుకెళ్లే బాధ్యత నాకు అప్పగించారు సుకుమార్. సినిమాలో వచ్చే మొదటి పాట ఇదే కాబట్టి ప్రేక్షకుల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ కట్టిపడేసి తీరాలి. కథకి తగ్గట్టూ హీరో దాచుకున్న ప్రేమ తీవ్రతనీ బలంగా చెప్పాలి. ఆ రెండింటితోపాటూ ఇక ఉండనే ఉంది సుకుమార్‌గారు ఎప్పుడూ చెప్పే 'ప్రేక్షకుల తల తిరిగిపోయే వర్ణనలొద్దూ... పండితులకి మాత్రమే అర్థమయ్యే పదాలు వద్దూ...!' అన్న నియమం. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకునే రాయడం మొదలుపెట్టాను...
చరణాల తర్వాతే పల్లవి...
తొలి ప్రేమ అవస్థను మనసులోకి తెచ్చుకోగానే... వరసగా ఏడెనిమిది చరణాలు గబగబా వచ్చేశాయి. కానీ వాటన్నింటినీ ఐదు నిమిషాల పాటలో పెట్టలేం కదా! అందుకే దేవిశ్రీగారు తనకి నచ్చినవాటిని ఎన్నుకోవడం మొదలుపెట్టారు. అలా మొదటి చరణం ప్రారంభానికి 'చిన్ని ఇసుకగూడు కట్టినా,నీ పేరు రాసిపెట్టినా,దాన్ని చెరిపేటి కెరటాలు పుట్టలేదు తెలుసా!' వాక్యాల్ని తీసుకున్నారు. రెండో చరణానికి 'నీ అందమంత ఉప్పెనా,నన్ను ముంచినాది చప్పునా,ఎంత ముంచేసినా తేలే బంతిని నేనేననా అన్నవి ఎంపికచేసుకున్నారు. ఆ రెండు చరణాలు ఖరారయ్యాక మిగతా వాక్యాల కోసం ఉర్దూ గజల్ శైలిని అనుసరిద్దామనుకున్నాను. మామూలుగా గజల్స్‌లో మొదటి రెండు పాదాలు ఓ ప్రశ్నని లేవనెత్తితే మూడోది దానికి సమాధానంగా చెప్పి... పైనున్న వాక్యాల్ని అర్థవంతం చేస్తుంది. దాన్ని గుర్తుచేసేలాగే 'ఆ గోరువంక పక్కనా...' అన్నవాక్యాల్ని మొదటి చరణానికీ, 'చుట్టూ ఎంత చప్పుడొచ్చినా..., అన్న పాదాల్ని రెండోదానికీ జతచేశాను. ప్రేమ ఎంత పాతదో దాన్ని మాటల్లో పెట్టలేని మనిషి నిస్సహాయతా అంతే పాతది!
దాన్నే కొత్తగా చెప్పాలనిపించి 'అప్పు అడిగానే కొత్తకొత్త మాటలనీ,తప్పుకున్నాయే భూమిపైన భాషలన్నీ,చెప్పలేమన్నాయే అక్షరాల్లో ప్రేమనీ' అన్న పాదాలని మొదటి చరణానికి జతచేస్తే సుకుమార్‌కీ, దర్శకుడు బుచ్చిబాబుకీ బాగా నచ్చేశాయి. అలా చరణాలయ్యాక పల్లవిపైన దృష్టిపెట్టాను. ముందుగా 'నీ కన్ను నీలి సముద్రం...' అన్న దేవిశ్రీ గారి పదాలకి 'నీ నవ్వు ముత్యాలహారం/నన్ను తీరానికి లాగేటి దారం దారం' అని కలిపాను. ‘నల్లనైన ముంగురులే,అల్లరేదో రేపాయిలే,నువ్వు తప్ప నాకింకో లోకాన్ని లేకుండా కప్పాయిలే' అన్న వాక్యాల్ని అనుపల్లవిగా చేశాను. 'ఉప్పెన' సినిమా రిలీజుకి దాదాపు ఏడాది ముందే విడుదలైందీ పాట. ఆ రోజు నుంచీ ఇప్పటిదాకా ప్రపంచంలో ఎక్కడెక్కడి నుంచో ప్రశంసల్ని కురిపిస్తూనే ఉంది!
ఇదీ చూడండి: 'జల జల జలపాతం' పాట ఎలా తీశారంటే?