ఎన్నో సవాళ్లను, సమస్యలను దాటుకుని 2021 సంవత్సరం ముగింపునకు వచ్చింది. ముఖ్యంగా కరోనా కారణంగా అన్ని రంగాలతో పాటు, చిత్ర పరిశ్రమ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంది. పడిలేచిన కెరటంలా వరుస సినిమాలతో సందడిగా సాగుతోంది. ఈ ఏడాది చివరి శుక్రవారం, కొత్త సంవత్సరంలో మొదటిరోజు ప్రేక్షకులను పలకరించే చిత్రాలు థియేటర్/ఓటీటీలో విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. అవేంటో చూసేయండి.
వైవిధ్య కథాంశంతో 'అర్జున ఫల్గుణ'
శ్రీవిష్ణు కథానాయకుడిగా తేజ మర్ని తెరకెక్కించిన చిత్రం 'అర్జున ఫల్గుణ'(Arjuna Phalguna). నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి సంయుక్తంగా నిర్మించారు. అమృతా అయ్యర్ కథా నాయిక. నూతన సంవత్సరం సందర్భంగా డిసెంబర్ 31న ప్రేక్షకుల ముందుకు రానుంది. శ్రీవిష్ణు శైలికి తగ్గ వైవిధ్యభరితమైన కథాంశంతో ఈ సినిమా రూపొందించామని, పసందైన వినోదాన్ని పంచుతుందని చిత్ర బృందం చెబుతోంది.
స్వాతంత్య్ర పూర్వం జరిగే ఆసక్తికర కథతో..
రానా హీరోగా సత్యశివ తెరకెక్కించిన పీరియాడిక్ డ్రామా చిత్రం '1945'. సి.కల్యాణ్ నిర్మించారు. రెజీనా కథానాయిక. సత్యరాజ్, నాజర్ కీలక పాత్రలు పోషించారు. ఎప్పుడో చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఎట్టకేలకు డిసెంబర్ 31న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు దర్శక నిర్మాతలు ఇటీవల ప్రకటించారు. రానా ఇందులో స్వాతంత్య్ర సమరయోధుడిగా కనిపించనున్నారు. యువన్ శంకర్ రాజా మ్యూజిక్ డైరెక్టర్.
ఎమోషనల్ జర్నీ ఇప్పుడు హిందీలో..
షాహిద్ కపూర్ కీలక పాత్రలో గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న బాలీవుడ్ చిత్రం 'జెర్సీ'(Jersy). తెలుగులో నాని కథానాయకుడిగా నటించిన 'జెర్సీ' చిత్రాన్నే గౌతమ్ హిందీలోనూ రూపొందిస్తున్నారు. మృణాల్ ఠాకూర్ కథానాయిక. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా డిసెంబరు 31న ప్రేక్షకుల ముందుకు రానుంది. క్రికెటర్‌గా చూడాలనుకున్న తన కొడుకు కోరికను తీర్చేందుకు ఓ తండ్రి ఏం చేశాడు? 36ఏళ్ల వయసులో తిరిగి క్రికెట్ బ్యాట్ పడితే అతడికి ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? ఆటలో గెలిచాడా? జీవితంలో గెలిచాడా? తెలియాలంటే సినిమా చూడాల్సిందే!
'డిటెక్టివ్ సత్యభామ' వచ్చేస్తోంది!
సోని అగర్వాల్ ప్రధాన పాత్రలో నవనీత్ చారి తెరకెక్కించిన చిత్రం 'డిటెక్టివ్ సత్యభామ'(Detective Satyabhama). శ్రీశైలం పోలెమోని నిర్మించారు. ఈ సినిమా ఈనెల 31న ప్రేక్షకుల ముందుకు రానుంది. '7/జీ బృందావన్ కాలనీ' తర్వాత నటిగా తనకు గుర్తింపు తెచ్చిన చిత్రాలు లేవని, సెకండ్ ఇన్నింగ్స్‌లో ఈ 'డిటెక్టివ్ సత్యభామ' చిత్రమే తనకు మంచి క్రేజ్ తీసుకొస్తుందన్న నమ్మకం ఉందని సోని అగర్వాల్ ధీమా వ్యక్తం చేస్తోంది.
'అంతఃపురం'లోకి వెళ్లేది ఆరోజే!
ఆర్య, రాశి ఖన్నా, ఆండ్రియా నాయకానాయికలుగా సి.సుందర్ తెరకెక్కించిన చిత్రం 'అరణ్మణై 3'. గతంలో వచ్చిన 'అరణ్మణై', 'అరణ్మణై 2' సినిమాలకు కొనసాగింపుగా రూపొందింది. హారర్ కామెడీ కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రాన్ని 'అంతఃపురం'(Anthapuram) పేరుతో తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తోంది గంగ ఎంటర్‌టైన్‌మెంట్స్. డిసెంబర్ 31న థియేటర్‌లలో విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. హారర్, కామెడీ సన్నివేశాలు అందరినీ ఆకట్టుకుంటాయి. విజువల్స్ కనుల విందులా ఉంటాయని దర్శకడు సుందర్ సి చెబుతున్నారు.
యాక్షన్ ప్రేమకథా చిత్రం విక్రమ్'
నాగవర్మ బైర్రాజు హీరోగా నటిస్తూ .. స్వయంగా నిర్మించిన చిత్రం ‘విక్రమ్(Vikram). హరిచందన్ దర్శకుడు. దివ్య సురేష్ నాయిక. ఆదిత్య ఓం, పృథ్విరాజ్, చలపతిరాజు తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాని తెలుగు, తమిళ భాషల్లో ఈనెల 31న విడుదల చేయనున్నారు. యాక్షన్‌కు ప్రాధాన్యమున్న ప్రేమకథా చిత్రమిమని, విక్రమ్ అనే ఓ సినిమా రచయిత తన ప్రేమను సాధించడం కోసం ఏం చేశాడన్నది దీంట్లో ఆసక్తికరంగా చూపించామని కథానాయకుడు నాగవర్మ చెబుతున్నారు. ఆదిత్యం ఓం ఇందులో ప్రతినాయకుడిగా నటిస్తున్నారు.
మరో 'టెన్ కమాండ్‌మెంట్స్'
ప్రపంచ సినీ చరిత్రలో 'టెన్ కమాండ్‌మెంట్స్' ఓ క్లాసిక్. ఆ చిత్రానికి రీమేక్‌గా ఇప్పుడు హాలీవుడ్‌లో మరో చిత్రం రాబోతోంది. 'మిషన్ ఇంపాజిబుల్2', 'బ్యాట్ ఉమెన్' ఫేమ్ డౌగ్రే స్కాట్ ఇందులో మోసెస్ పాత్రలో నటించారు. రాబర్ట్ డోర్న్ హెల్మ్, జెఫ్రీ మడేజా దర్శకత్వం వహించారు. ఇంగ్లీష్‌తో పాటు భారతీయ భాషల్లోనూ డిసెంబరు 31న ఈ సినిమా విడుదల కానుంది.
కొత్త ఏడాదిలో మొదటి చిత్రం 'ఇందు వదన'
'హ్యాపీడేస్', 'కొత్త బంగారులోకం' తదితర చిత్రాలతో యువతని ఆకట్టుకున్న నటుడు వరుణ్ సందేశ్. కొన్నాళ్ల విరామం అనంతరం ఆయన నటిస్తున్న 'ఇందువదన'(Induvadana). ఫర్నాజ్ శెట్టి కథానాయిక. ఎం.శ్రీనివాసరాజు దర్శకుడు. మాధవి ఆదుర్తి నిర్మిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా కొత్త ఏడాదిలో జనవరి 1న ప్రేక్షకుల ముందుకు రానుంది.లవ్, థ్రిల్లింగ్ అంశాలతో 'ఇందువదన' సాగనున్నట్లు ప్రచార చిత్రాలను చూస్తే అర్థమవుతోంది.
వాస్తవ ఘటనల ఆధారంగా.. 'ఆశా ఎన్‌కౌంటర్'
యావత్ దేశాన్ని ఉలిక్కిపడేలా చేసిన హైదరాబాద్ గ్యాంగ్‌రేప్‌ను ఆధారంగా చేసుకుని తెరకెక్కిన చిత్రం 'ఆశ ఎన్‌కౌంటర్'. 2019 నవంబర్ 26న హైదరాబాద్ నగరశివారులోని చటాన్‌పల్లి వద్ద ఓ యువతిపై కొందరు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడి.. అనంతరం ఆమెను అతి క్రూరంగా హత్య చేశారు. ఇదే కథను నేపథ్యంగా చేసుకుని ఆనంద్ చంద్ర ‘ఆశ ఎన్‌కౌంటర్’ తెరకెక్కించారు. జనవరి 1న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆర్జీవీ సమర్పణలో అనురాగ్ కంచర్ల ఈ చిత్రాన్ని నిర్మించారు.
ఈ వారం ఓటీటీలో విడుదలయ్యే సినిమాలివే!
'సేనాపతి' ఏం చేశాడు?
ప్రముఖ నటుడు రాజేంద్ర ప్రసాద్ నటించిన చిత్రం 'సేనాపతి'(Senapathi). పవన్ సాధినేని దర్శకత్వం వహించారు. ఓటీటీ ‘ఆహా’లో డిసెంబరు 31న స్ట్రీమింగ్ కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ట్రైలర్‌ను విడుదల చేసింది. రాజేంద్ర ప్రసాద్ ఇప్పటి వరకూ కనిపించని విభిన్న లుక్‌లో దర్శనమిచ్చారు. డబ్బు, హత్య చుట్టూ సాగే సన్నివేశాలతో ట్రైలర్ ఆద్యంతం ఉత్కంఠ రేకెత్తిస్తోంది. ఈ సినిమాని విష్ణు ప్రసాద్, సుస్మిత కొణిదెల నిర్మించారు. శ్రవణ్ భరద్వాజ్ సంగీతం అందించారు.
అమెజాన్ ప్రైమ్ వీడియో
- లేడీ ఆఫ్ మేనర్- డిసెంబరు 31
- టైమ్ ఈజ్ అప్ -డిసెంబరు 31
నెట్‌ఫ్లిక్స్
- ది పొస్సెసన్ ఆఫ్ హన్నా గ్రేస్- డిసెంబరు 27
- చోటా భీమ్: ఎస్14 -డిసెంబరు 28
- క్రైమ్ సీన్: ది టైమ్స్ స్వ్కేర్ కిల్లర్ - డిసెంబరు 29
- క్యూర్ ఐ: సీజన్-6- డిసెంబరు 31
- కోబ్రా కాయ్(సీజన్-4) -డిసెంబరు 31
- ది లాస్ట్ డాటర్- డిసెంబరు 31
డిస్నీ+ హాట్‌స్టార్
- కేషు కీ వేదాంత్ నదానీ -డిసెంబరు 31
ఇదీ చూడండి: 'రాధేశ్యామ్' సినిమా గ్రాఫిక్స్.. 12 దేశాల్లో వర్క్