బాలీవుడ్లో చాలా మంది తారలు తమ స్థాయి, స్క్రీన్ టైమింగ్‌ను దృష్టిలో పెట్టుకుని పాత్రలు ఎంచుకుంటుంటారు. ఇక దర్శకుల విషయానికొస్తే.. కథ రాసుకునే సమయంలోనే ఒక నిర్దిష్ట హీరో, హీరోయిన్లను ఊహించుకుంటారు. వారే ఆ పాత్రకు సరిగ్గా సరిపోతారని నిర్ణయించుకుంటారు. అయితే, స్టార్లు ఆ పాత్రను తిరస్కరించినప్పుడు.. మరొక నటుడిని ఆ అవకాశం వరిస్తుంది. అటువంటి పాత్రలు కొన్నిసార్లు ప్రేక్షకుల మదిలో చిరస్థాయిగా నిలిచిపోతాయి. ఇలా కొంత మంది నటీనటులు ఆ పాత్రలను కోల్పోయినందుకు చింతిస్తున్నట్లు చెబితే.. ఇంకొందరు వేరొకరికి స్టార్డమ్ ఇచ్చామని చెబుతుంటారు. ఏదేమైనా తమ కోసం వెతుక్కుంటూ వచ్చిన కొన్ని ఐకానిక్ పాత్రలను తిరస్కరించిన బాలీవుడ్ టాప్-5 నటులపై ఓ లుక్కేద్దాం రండి.
సిల్క్ పాత్రను వదులుకున్న కంగన
'ది డర్టీ పిక్చర్' చిత్రంలో సిల్క్ స్మిత పాత్రలో నటించిన విద్యాబాలన్ ఒక్కసారిగా స్టార్డమ్ తెచ్చుకుంది. ఈ సినిమాలో ఆమె పాత్రకు జాతీయ అవార్డు వరించింది. అయితే, మొదట ఆ పాత్రకోసం 'మణికర్ణిక' ఫేమ్ కంగనా రనౌత్‌ను అడిగారు. అప్పటికే మరో సినిమాలో నటిస్తున్న కారణంగా.. కుదరదని చెప్పింది. ఆ తర్వాత కంగన చాలా ఇంటర్వ్యూల్లో మాట్లాడుతూ.. ఈ అవకాశాన్ని కోల్పోయినందుకు అందరూ తనను తెలివి తక్కువ దానిలా చూసినట్లు పేర్కొంది.
రణ్‌వీర్‌కు జోడీగా ఎంపికైనా..
'రామ్ లీలా'లో రణ్వీర్ సింగ్, దీపికా పదుకొణె కెమిస్ట్రీ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ సినిమలో లీలా పాత్రలో నటించిన దీపిక విమర్శల ప్రశంసలు పొందింది. అయితే ఈ పాత్ర ఆఫర్ తొలుత కరీనా కపూర్ వద్దకు వెళ్లగా తిరస్కరించింది.
బయోపిక్‌ను తిరస్కరించిన అక్షయ్
'భాగ్ మిల్కా భాగ్' చిత్రంలో అథ్లెట్‌గా కనిపించి ప్రేక్షకులను ఒక్కసారిగా తన వైపుకు తిప్పుకున్న నటుడు ఫర్హాన్ అక్తర్. ప్రారంభంలో ఈ పాత్ర కోసం బాలీవుడ్ యాక్షన్ కింగ్ అక్షయ్ కుమార్‌ను సంప్రదించింది చిత్రబృందం. అప్పటికే 'తీస్మార్ ఖాన్' చిత్రీకరణలో బిజీగా ఉండటం వల్ల తిరస్కరించాడు.
తమిళ కుట్టిగా కత్రినా నటించాల్సింది!
రోహిత్ శెట్టి సినిమా 'చెన్నై ఎక్స్‌ప్రెస్'లో షారుఖ్ ఖాన్‌కు జోడీగా దీపికా పదుకొణె నటించింది. ఈ పాత్ర తనకు ఎంతగానో పేరు తెచ్చిపెట్టింది. అయితే ఈ క్యారెక్టర్ కోసం ముందుగా కత్రినా కైఫ్‌ను అడిగారు. కానీ అందుకు ఆమె ఒప్పుకోలేదు.
హృతిక్ వదిలేసిన చిత్రం
ఫర్హాన్ అక్తర్ దర్శకత్వం వహించిన ప్రఖ్యాత చిత్రం 'దిల్ చాహ్తా హై'. ఇందులో ఆమిర్ ఖాన్, అక్షయ్ ఖన్నా, సైఫ్ అలీఖాన్ ప్రధాన పాత్రల్లో నటించారు. అక్తర్ మొదట్లో ఆకాశ్ పాత్రలో తన స్నేహితుడు హృతిక్ రోషన్ నటించాలనుకున్నాడు. ఇక అభిషేక్ బచ్చన్.. సిద్ పాత్రలో కనిపించాల్సింది. ఈ ఇద్దరు నటులు ఆ పాత్రలను తిరస్కరించడం వల్ల.. వారి స్థానంలో ఆమిర్ ఖాన్, అక్షయ్ ఖన్నాలు నటించారు.
ఇదీ చూడండి: క్యాన్సర్‌ను జయించిన 'సినీ' రియల్ హీరోలు