రాజకీయం ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటుంది. ఎత్తులు పైఎత్తులు.. శత్రుత్వం ప్రదర్శిస్తూ ఒకరిపై మరొకరు మాటల కత్తులు దూసుకోవడం.. ఆ వెంటనే అనూహ్యంగా కండువాలు మార్చుకోవడం.. ఇలా ఎప్పటికప్పుడు రక్తికట్టిస్తుంటుంది రాజకీయం. సినిమాకి అంతకుమించి ఏం కావాలి? ఆ సంఘటనలే దర్శక రచయితల్లో స్ఫూర్తిని నింపుతుంటాయి. రాజకీయ కథలకి జిందాబాద్ కొట్టేలా చేస్తుంటాయి. నేపథ్యం రాజకీయమైనా అందులోనూ థ్రిల్లర్‌లు, డ్రామాలు, యాక్షన్ కథలు రూపొందుతుంటాయి. ఒకొక్క సినిమా ఒక్కో కోణాన్ని స్పృశిస్తూ వినోదాన్ని పంచుతుంటాయి. చైతన్యాన్ని నింపుతుంటాయి. అగ్ర కథానాయకులు మొదలుకొని.. యువతరం వరకూ అందరూ రాజకీయ కథలపై మొగ్గు చూపుతున్నారు. ప్రస్తుతం తెలుగులో నాలుగైదు సినిమాలు ఆ నేపథ్యంలో రూపొందుతూ ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.
గాడ్‌ఫాదర్‌గా చిరు..
godfather chiranjeevi latest news: చిరంజీవి కథానాయకుడిగా నటిస్తున్న 'గాడ్‌ఫాదర్' పొలిటిక్ యాక్షన్ డ్రామా సినిమానే. మలయాళంలో విజయవంతమైన 'లూసిఫర్'కు రీమేక్‌గా రూపొందుతోంది. మోహన్‌రాజా దర్శకత్వం వహిస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్స్, సూపర్‌గుడ్ ఫిల్మ్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. జన జాగృతి అనే రాజకీయ పార్టీ నేపథ్యంలో సాగే డ్రామాతో ఈ చిత్రం రూపొందుతున్నట్టు తెలుస్తోంది. చిరంజీవి ఓ శక్తివంతమైన పాత్రలో కనిపిస్తారు. నయనతార ప్రధానమైన పాత్రని పోషిస్తున్నారు. ఇటీవలే హైదరాబాద్‌లో ఓ కీలక షెడ్యూల్‌ని పూర్తి చేశారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్‌లో జరుగుతోంది. ఈ షెడ్యూల్‌లోనే నయనతార పాల్గొని తన పాత్రకు సంబంధించిన కీలక సన్నివేశాల చిత్రీకరణను పూర్తి చేసింది. ఈ విషయాన్ని చిత్రబృందం గురువారం సామాజిక మాధ్యమాల ద్వారా తెలిపింది.
యువ నాయకుడిగా ఎన్టీఆర్?
ntr koratala siva movie: 'జనతా గ్యారేజ్' కలయికలో మరో చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. దర్శకుడు కొరటాల ఈ సినిమాలో ఎన్టీఆర్‌ని ఓ యువ నాయకుడిగా చూపించనున్నారని తెలుస్తోంది. అదే నిజమైతే ఇందులోనూ రాజకీయం ప్రస్తావన ఉంటుందని స్పష్టమవుతోంది. కొరటాల ఇదివరకు రాజకీయ రంగం నేపథ్యంలోనే మహేష్‌తో 'భరత్ అనే నేను' రూపొందించి విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. యువ కథానాయకుడు వైష్ణవ్‌తేజ్ నటించిన 'రంగ రంగ వైభవంగా' కథ రాజకీయం ప్రధానంగా సాగేదే అని సమాచారం. ఈ నేపథ్యంలో సినిమాలు తెలుగు తెరకు కొత్తేమీ కాదు. ఈమధ్య కాలంలోనే బాలకృష్ణ 'లెజెండ్', రానా 'లీడర్', 'నేనే రాజు నేనే మంత్రి', విజయ్ దేవరకొండ 'నోటా', నారా రోహిత్ 'ప్రతినిధి'తోపాటు పలు చిత్రాలు రూపొంది విజయాన్ని అందుకున్నాయి.
ఐఏఎస్ అధికారిగా..
Shankar ram charan movie: రాజకీయం, ప్రభుత్వ వ్యవస్థలతో ముడిపడిన కథలు తరచూ వస్తుంటాయి. రామ్‌చరణ్ కథానాయకుడిగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రమూ ఆ నేపథ్యంలోనే రూపొందుతున్నట్టు తెలుస్తోంది. రామ్‌చరణ్ ఓ ఐఏఎస్ అధికారిగా కనిపిస్తారని సమాచారం. ఇందులో తాజా రాజకీయ, సామాజిక పరిస్థితులపై కీలక సన్నివేశాలుంటాయని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ రాజమహేంద్రవరం పరిసరాల్లో జరుగుతోంది. కియారా అడ్వాణీ కథానాయికగా నటిస్తోంది. దిల్‌రాజు నిర్మిస్తున్నారు.
మాస్ నేపథ్యంలో.. స్థానికత
macherla niyojakavargam movie news: నితిన్ కథానాయకుడిగా 'మాచర్ల నియోజకవర్గం' అనే సినిమా రూపొందుతోంది. మాస్ కథతోనే రూపొందుతున్నా ఇందులో రాజకీయ నేపథ్యం కీలకమని తెలుస్తోంది. ఎం.ఎస్.రాజశేఖర్ రెడ్డి దర్శకత్వంలో, సుధాకర్‌రెడ్డి, నిఖితారెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కృతిశెట్టి కథానాయికగా నటిస్తోంది. ఈ చిత్రంలో స్థానిక పాలిటిక్స్‌పై సన్నివేశాలుంటాయని తెలుస్తోంది.
ఇదీ చూడండి: ప్రభాస్‌ను సర్ప్రైజ్ చేసిన పవన్ కల్యాణ్!