"మళ్లీ నేను సినిమా తీస్తే పాటలు ఎవరు పాడతారనిపించేంత లోటుని సృష్టించిన మహా వ్యక్తి బాల సుబ్రహ్మణ్యం (Bala Subramaniam). ఆయనొక కారణజన్ముడు, అమరగాయకుడు" అన్నారు ప్రముఖ దర్శకుడు కె.విశ్వనాథ్. శుక్రవారం బాలు జయంతి (Bala Subramaniam Jayanthi). ఈ సందర్భంగా తెలుగు చిత్ర పరిశ్రమ ఆధ్వర్యంలో 'ఎస్పీ బాలుకు స్వర నీరాజనం' పేరిట ఓ కార్యక్రమాన్ని నిర్వహించింది. 12 గంటలపాటు ఆన్‌లైన్‌లో సాగిన ఆ కార్యక్రమంలో పలువురు సినీ ప్రముఖులు బాలు కీర్తిని కొనియాడుతూ, ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. గాయనీ గాయకులు బాలుకు నివాళులర్పిస్తూ రాగాలాపన చేశారు. ఈ సందర్భంగా కె. విశ్వనాథ్ మాట్లాడుతూ బాలు గురించి ఎంత చెప్పుకొన్నా తనివి తీరదన్నారు.
కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi) మాట్లాడుతూ "బాలు అన్నయ్యతో 1980 నుంచి సాన్నిహిత్యం ఉంది. కుటుంబం, సినిమా పరంగా బాగా దగ్గరగా ఉండేవాళ్లం. నా సినిమాలకి పాటలు పాడాలంటే ప్రత్యేక శ్రద్ధ తీసుకునేవారు. ఆయన గాత్రానికి నా బాడీ లాంగ్వేజ్ మ్యాచ్ చేసేందుకు చాలా కష్టపడ్డా. నా విజయంలో ఆయనకి సగభాగం ఇస్తా" అన్నారు.
SP Balu: బ్రహ్మ, మురారీ.. బాలు 'స్వరార్చితం'
దర్శకుడు కె.రాఘవేంద్రరావు మాట్లాడుతూ "పాటకి పల్లవి ప్రాణం అంటారు. కానీ నా దృష్టిలో బాలు గాత్రమే పాటకి, పల్లవికి ప్రాణం. మా ఇద్దరిదీ యాభయ్యేళ్ల అనుబంధం. బాలు ఎప్పటికీ మనతోనే ఉంటాడు" అన్నారు.
దర్శకుడు త్రివిక్రమ్ (Trivikram) మాట్లాడుతూ "ఆఖరి క్షణాల వరకు పాడుతూనే ఉన్నారు బాలు. దక్షిణాదిలో ఇప్పుడు పాడుతున్నవాళ్లల్లో 60 శాతం మంది ఆయన దగ్గరి నుంచి వచ్చినవారే. ఆయన గెలవడమే కాదు.. తర్వాతి తరాల్నీ గెలిపించారు" అన్నారు.
"బాలు తొలిసారి పూర్తి పాటలు నా 'నేనంటే నేనే' సినిమాకి పాడారు. మాది యాభయ్యేళ్ల అనుబంధం. గాయకుడిగా ప్రపంచ రికార్డు సృష్టించిన బాలు తెలుగువాడు కావడం మనందరి అదృష్టం" అన్నారు ప్రముఖ కథానాయకుడు కృష్ణ.
"ఇంత గొప్ప కార్యక్రమం నాన్న ఉన్నప్పుడు జరిగుంటే ఆయన ఎంతో సంతోషించేవారు" అన్నారు బాలు తనయుడు ఎస్పీ చరణ్. ఈ కార్యక్రమంలో కృష్ణంరాజు, పి.సుశీల, ఎస్పీ శైలజ, కోదండరామిరెడ్డి, మురళీమోహన్, వీకే నరేష్, నాని, శ్రీకాంత్, సురేష్‌బాబు, భువనచంద్ర, సి.కల్యాణ్, తమ్మారెడ్డి భరద్వాజ, వి.వి.వినాయక్, అర్జున్, కొరటాల శివ, పరుచూరి గోపాలకృష్ణ, ఆచంట గోపీనాథ్, జె.కె.భారవి, అనంతశ్రీరామ్, దేవిశ్రీ ప్రసాద్, సాయికుమార్ తదితరులు పాల్గొన్నారు.
బాలుకి అంకితం
'తీరం' కోసం బాలు పాడిన చివరి గీతం 'అసలేంటీ ప్రేమా..'తోపాటు అందులోని అన్ని పాటల్ని ఎస్పీ బాలుకి అంకితం ఇస్తున్నట్టు ఆ చిత్రబృందం ప్రకటించింది. శుక్రవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రముఖ రచయిత విజయేంద్రప్రసాద్, గీత రచయితలు సుద్దాల అశోక్‌తేజ, చంద్రబోస్, సంగీత దర్శకుడు రఘు రాం, దర్శకనిర్మాత అనిల్ ఇనమడుగు తదితరులు పాల్గొని బాలు ఆలపించిన చివరి గీతం గురించి, ఆయనతో అనుబంధం గురించి చెప్పారు. ప్రశాంత్ వై.జి.టి, క్రిష్టెన్ రవళి జంటగా నటించిన 'తీరం' చిత్రాన్ని సినెటేరియా మీడియా వర్క్స్ సంస్థ ద్వారా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.