కరోనా కారణంగా తెలుగు చలన చిత్ర పరిశ్రమ తీవ్రంగా నష్టపోతోంది. మొదటి దశ నుంచి కాస్త కోలుకున్నామనే లోపే వెండితెర వెలుగులను రెండో దశ చీకట్లోకి తోసింది. నటీనటులు, దర్శక నిర్మాతలు, కార్మికులు కొవిడ్ బారిన పడి ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సుమారు 100 మందికి పైగా కార్మికులు, సాంకేతిక నిపుణులు మృత్యువాత పడ్డారు. ఒక్క చిత్రపురి కాలనీలోనే 10 మందికి పైగా సినీ కార్మికులు చనిపోయారంటే ఎంత ఆందోళనకర పరిస్థితులు తలెత్తాయో అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి పరిణామాల మధ్య పరిశ్రమలో కరోనా కట్టడి చేసేందుకు సినీ పరిశ్రమ కఠిన ఆంక్షలకు సిద్ధమవుతోంది.
కార్మికులకు వ్యాక్సిన్...
గతంలో కరోనా నిర్ధరణ పరీక్షలు చేసుకుంటూ సినిమా చిత్రీకరణలు కొనసాగించారు. రెండో దశ ప్రభావం తీవ్రంగా ఉండటంతో చిత్రీకరణలు అర్ధాతరంగా నిలిపివేశారు. ఇలాంటి కఠిన పరిస్థితుల్లో మరిన్ని జాగ్రత్తలు వహించాలని సినీవర్గాలు భావించాయి. చిరంజీవి అధ్యక్షతన ఏర్పాటైన కరోనా క్రైసిస్ ఛారిటీ ద్వారా కార్మికులందరికీ వ్యాక్సినేషన్ ప్రక్రియ చేపట్టాయి.
అపోలో ఆస్పత్రి సౌజన్యంతో ఉచిత టీకా వేయించాలని సంకల్పించారు. ఈ కార్యక్రమానికి కార్మికుల నుంచి పెద్దగా స్పందన రాలేదు. కేవలం 100 నుంచి 150 మంది మాత్రమే టీకా వేయించుకున్నారు. ప్రస్తుతం వివిధ కారణాల వల్ల టీకా పంపిణీ నిలిపివేయగా.. 20 వేల మంది కార్మికుల ఆరోగ్య పరిస్థితి అయోమయంలో పడింది.
టీకా తీసుకుంటేనే...
సినిమా చిత్రీకరణ విషయంలోనూ సినీవర్గాలు ఓ నిర్ణయానికి వచ్చాయి. కోట్లాది రూపాయలు వెచ్చించి నిర్మిస్తున్న సినిమాలపై.... వైరస్ ప్రభావం పడకుండా వ్యాక్సిన్ తీసుకున్న కార్మికులను మాత్రమే చిత్రీకరణలకు అనుతించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. 24 విభాగాల్లోని వారంతా టీకా వేయించుకున్నారని నిర్ధారించాకే సెట్‌లోకి అడుగుపెట్టేలా చర్యలు తీసుకోవాలని యోచిస్తున్నారు. అన్ని యూనియన్ల నాయకులు తమ సభ్యులు వ్యాక్సిన్ తీసుకున్నారా లేదా అనే విషయాన్ని వాకబు చేస్తున్నారు.
సుమారు 5వేల మందికి...
ప్రస్తుత పరిస్థితుల్లో టీకాలు దొరకడం ప్రశ్నార్థకరంగా మారింది. దీంతో స్వయంగా చిరంజీవి జోక్యం చేసుకొని టీకాలు అందించేందుకు కృషిచేస్తున్నారు. ప్రభుత్వ వర్గాలు, ప్రైవేటు ఆస్పత్రులతో మాట్లాడుతూ... టీకాలు అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. వీలైనంత త్వరగా కార్మికులకు టీకాలు ఇప్పించాలని భావిస్తున్నారు. సినిమా చిత్రీకరణలకు ప్రభుత్వం అనుమతించేలోగా సుమారు 5 వేల మంది కార్మికులకు మెుదటి డోసు ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
ఇదీ చూడండి: LOCK DOWN: రాష్ట్రవ్యాప్తంగా పకడ్బందీగా లాక్‌డౌన్ అమలు