థియేటర్‌ల్లోనా.. ఓటీటీ వేదికల్లోనా?
-కరోనాకు ముందే పూర్తయిన సినిమాలు ఎప్పుడు ఏ వేదిక ద్వారా విడుదలవుతాయనే విషయం ఆసక్తిని రేకెత్తిస్తోంది. థియేటర్ కోసమే తీశాం, అందులోనే తమ సినిమాల్ని ప్రేక్షకులకు చూపిస్తామని పలువురు హీరోలు, దర్శకనిర్మాతలు చెబుతున్నారు. వాస్తవ పరిస్థితులు అందుకు భిన్నంగా మారిపోతున్నాయి. థియేటర్లు తెరవక ఇప్పటికే రెండు నెలలు పైనే అయ్యింది. నిర్మాతలపై వడ్డీల భారం అంతకంతకూ పెరుగుతోంది. ఈ పరిస్థితులన్నీ ఆయా చిత్రవర్గాల్ని పునరాలోచించుకునేలా చేస్తున్నాయి. కొన్నాళ్లు వేచి చూసైనా థియేటర్లలోనే విడుదల చేసుకోవాలనుకొన్న దర్శకనిర్మాతలు ఇప్పుడు... ఓటీటీ వేదికలకు అమ్మేస్తే ఎలా ఉంటుందనీ సమాలోచనలు చేస్తున్నారు.
అంతర్జాలం ఆధారంగా నడిచే ఓటీటీలు మన ప్రేక్షకులకు వేగంగా చేరువయ్యాయి. థియేటర్లను సైతం ప్రభావితం చేసే స్థాయికి చేరాయి. అయినా సరే... అవి థియేటర్లకు ప్రత్యామ్నాయం కాలేవనేది సినీ వర్గాల మాట. అది నిజం కూడా. అయితే లాక్‌డౌన్ కాలంలో ప్రేక్షకుల వినోద ఆస్వాదనకు మాత్రం ఓటీటీ వేదికలే శరణ్యంగా మారాయి. కొన్ని చిన్న సినిమాల విడుదలకూ ఇవే ఆధారంగా మారాయి. ఈమధ్యే అమెజాన్ ప్రైమ్ వీడియో పలు భాషల్లో 7 సినిమాల్ని విడుదల చేయడానికి ఒప్పందం కుదుర్చుకున్నట్టు ప్రకటించింది. ఆయా ఓటీటీ వేదికలు తెలుగు నిర్మాతలతోనూ జోరుగా సంప్రదింపులు జరుపుతున్నాయి.
ఆర్థిక సమీకరణాలే కీలకం
లాక్‌డౌన్ తర్వాత ప్రేక్షకులు స్థానిక భాషలకు చెందిన వెబ్‌సిరీస్‌లు, సినిమాలే కాకుండా... ప్రపంచ సినిమానూ చూశారు. వాళ్లను ఆకట్టుకోవడమే లక్ష్యంగా ఓటీటీ వేదికలు మరిన్ని స్థానిక చిత్రాల్ని కొనుగోలు చేసి, నేరుగా విడుదల చేయడం కోసం రంగంలోకి దిగాయి. తెలుగులో 'వి', 'నిశ్శబ్దం', 'రెడ్', 'అరణ్య', 'ఉప్పెన', 'ఒరేయ్ బుజ్జిగా', 'మిస్ ఇండియా', '30 రోజుల్లో ప్రేమించటం ఎలా?', 'కృష్ణ అండ్ హిజ్ లీల' తదితర చిత్రాలతో పాటు మరికొన్ని అనువాద చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. దాదాపు ఈ చిత్ర బృందాలన్నింటితోనూ ఓటీటీ సంస్థలు బేరసారాలు సాగించాయి. అయితే నిర్మాతలు చెబుతున్న ధరలకూ, ఓటీటీలు ఇస్తామన్న ధరలకు పొంతన లేకపోవడం వల్ల ఒప్పందాలు నిలిచిపోయాయి. నిర్మాతలు పెట్టుబడి ఎంత? రాబడి ఎంత? అనేదే చూసుకుంటారు. అలా తాము పెట్టిన పెట్టుబడికి తగ్గ లాభాలొస్తేనే ఇవ్వాలని నిర్ణయించుకుంటున్నారు. హిందీలో మాత్రం ఇప్పటికే నేరుగా ఓటీటీల్లో విడుదలలు ఊపందుకున్నాయి. 'ఘూమ్‌కేతు' ఇప్పటికే జీ5లో విడుదలైంది. అమితాబ్ 'గులాబో సితాబో', విద్యాబాలన్ 'శకుంతలాదేవి' త్వరలో రాబోతున్నాయి. రూ.38 కోట్ల వ్యయంతో తెరకెక్కిన టగులాబో సితాబో' సినిమాను అమెజాన్ ప్రైమ్ వీడియో రూ.62 కోట్లకు కొనుగోలు చేసినట్టు సమాచారం. నిర్మాతలకు ఎక్కువ ఆదాయమే లభిస్తుండడం వల్ల అక్కడ ఒప్పందాలు జరిగిపోతున్నాయి. తమిళంలోనూ పరిమిత వ్యయంతో తెరకెక్కిన కొన్ని చిత్రాల వ్యాపారం దూకుడుగానే ఉంది. ఈ విషయంపై నిర్మాత మధుర శ్రీధర్‌రెడ్డి మాట్లాడారు.
"ఎక్కడైనా నిర్మాత పెట్టిన పెట్టుబడి కంటే ఎక్కువ వస్తుందంటే సినిమాల్ని ఇవ్వడానికే ఇష్టపడతారు. తెలుగులోనూ నిర్మాతల పెట్టుబడి కంటే ఎక్కువగా ఇవ్వడానికే ముందుకొస్తున్నాయి ఓటీటీలు. అయితే మనవాళ్లు కాస్త సంయమనం ప్రదర్శిస్తున్నారు. ఇన్నాళ్లూ వేచి చూశారు కాబట్టి... త్వరలోనే పరిస్థితులు మారితే థియేటర్లలోనే మన సినిమాల్ని చూసుకోవచ్చు కదా అని ఆలోచిస్తుండొచ్చు" అని మధుర శ్రీధర్ రెడ్డి అన్నారు.
హిందీలో ఓటీటీల్లో విడుదలకు నిర్మాతలు మొగ్గు చూపడానికి బలమైన ఓ కారణం ఉందంటున్నారాయన. "హిందీలో సినిమా ప్రచారం కోసం రూ.10 నుంచి రూ.15 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది. అది నిర్మాతలకు అదనపు భారమే. పైగా ఇప్పటికిప్పుడు థియేటర్లలో సినిమాల్ని విడుదల చేసుకునే పరిస్థితులు లేవు. ఇలాంటి విషయాల్ని దృష్టిలో ఉంచుకుని ఓటీటీలవైపే మొగ్గు చూపుతుండొచ్చు" అని చెప్పారు. 'మిస్ ఇండియా' నిర్మాత మహేష్ కోనేరు మాట్లాడుతూ "ఓటీటీకి వెళుతున్నామంటే అందుకు తగ్గట్టుగా ప్రీమియం ధరలు ఓటీటీల నుంచి రావాలి. ఆ సంస్థలైతే సీరియస్‌గానే మాతో సంప్రదింపులు జరుపుతున్నాయి" అని అన్నారు.
అది కూడా ఓ కారణం
థియేటర్లు తెరుచుకున్న తర్వాత ఇతర భాషలతో పోలిస్తే మన దగ్గర విడుదల కోసం పోటీపడే సినిమాలు తక్కువే. ఆయా భాషల్లో పరిమిత వ్యయంతో తెరకెక్కిన సినిమాలు ఓటీటీ దిశగా వెళుతున్నాయి. ముఖ్యంగా తమిళంలో అదే పరిస్థితి కనిపిస్తోంది. జ్యోతిక నటించిన 'పొన్మగల్ వంధల్' అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలైంది. కీర్తి సురేష్ నటించిన 'పెంగ్విన్' విడుదల కానుంది. నటి జ్యోతిక ఈ విషయంపై మాట్లాడుతూ "మరికొన్ని నెలలపాటు థియేటర్లు తెరుచుకోలేని పరిస్థితి. తెరుచుకున్నాక అప్పుడు విడుదలయ్యే సినిమాల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. చిన్న చిత్రాలకు అవకాశం ఎప్పుడొస్తుందో తెలియదు. ఈ పరిస్థితుల్లో మా సినిమాను ఓటీటీల్లో విడుదల చేయడమే ఉత్తమనుకున్నాం" అన్నారామె. థియేటర్లు తెరుచుకున్నాక తెలుగులో విడుదలకు పోటీ పడే సినిమాలు ఎక్కువగానే ఉన్నా... వాటిలో అగ్ర తారల చిత్రాలు లేవు. దాంతో చిన్న చిత్రాలకూ వాటి స్థాయికి తగ్గట్టుగా థియేటర్లు దొరికే అవకాశం ఉంటుంది. మరికొన్నాళ్లు థియేటర్‌లో విడుదల కోసం వేచి చూసేందుకు నిర్మాతలకు అదొక కారణమైంది. అయితే థియేటర్లు తెరుచుకోవడానికి మరింత సమయం పట్టిందంటే... సినిమాలు స్టేల్ అయ్యే ప్రమాదం ఉందనే ఆందోళన నిర్మాతల్లో కనిపిస్తోంది. అందుకే ఓటీటీల్లో విడుదల గురించి కాస్త గట్టిగానే ఆలోచిస్తున్నారు. 'నిశ్శబ్దం' ఎగ్జిక్యూటివ్ నిర్మాత వివేక్ కూచిభొట్ల మాట్లాడుతూ "మేం ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు కానీ... ఇలా చెయ్యం అని మాత్రం చెప్పలేం" అన్నారు.