ఐదేళ్ల తర్వాత దర్శకత్వ బాధ్యతల నుంచి తప్పుకుంటానని ప్రముఖ దర్శకుడు కొరటాల శివ తెలిపారు. తెలుగులో ఎంతోమంది దర్శకులు ఉన్నా.. కొరటాలది మాత్రం ప్రత్యేక శైలి. ఆయన సినిమాలో ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు సామాజిక సందేశమూ అంతర్లీనంగా కనిపిస్తుంటుంది. ప్రస్తుతం ఆయన చిరంజీవి హీరోగా 'ఆచార్య' అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో చిరంజీవి ప్రకృతి వనరులను కాపాడే వ్యక్తిగా కనిపించనున్నారని సమాచారం.
"ఆచార్య' చిత్రం ఇప్పటికే నలభై శాతానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకుంది. ఇందులో రామ్ చరణ్ ఓ కీలకపాత్రలో కనిపించనున్నారు. ఆయన కోసం కథానాయికను ఎంపిక చేయాల్సి ఉంది. అంతేకాదు ఐదేళ్ళ తర్వాత దర్శకత్వ బాధ్యతల నుంచి వైదొలిగే ఆలోచనలో ఉన్నా. ఈ నిర్ణయం తెలుగు చిత్రసీమలో కొత్తదర్శకులను ప్రొత్సాహించాలనే ఉద్దేశంతోనే. అంతకుమించి మరొక కారణం ఏమీ లేదు. సొంతంగా ఓ ప్రొడక్షన్ హౌస్‌ను ప్రారంభించే ఆలోచన కూడా ఉంది."
-కొరటాల శివ, దర్శకుడు
కొరటాల శివ సినీ రచయితగా 'గర్ల్ ఫ్రెండ్' చిత్రంతో మొదలు పెట్టి 'భద్ర', 'మున్నా', 'ఊసరవెల్లి'లాంటి చిత్రాలకు పనిచేశారు. దర్శకుడిగా 'మిర్చి' చిత్రంతో తన ప్రస్థానాన్ని కొనసాగిస్తూ ఇప్పటి వరకు 'శ్రీమంతుడు', 'జనతా గ్యారేజ్', 'భరత్ అనే నేను' లాంటి సినిమాలను తెరకెక్కించారు.
ఇదీ చూడండి.. దారిని శుభ్రం చేస్తున్న చిరు.. గరిట పట్టిన చరణ్