ప్రాంతీయంగా వారు ఎన్ని బ్లాక్‌బస్టర్స్ ఇచ్చినా హిందీ పరిశ్రమలో ఒక్క సినిమా అయినా చేయాలని ఉవ్విళ్లూరుతుంటారు మన కథానాయకులు. కొందరు హీరోలు ఇప్పటివరకు టాలీవుడ్లోనే సినిమాలు చేస్తామని చెప్పినా.. ప్రస్తుతం బాలీవుడ్ వైపు వెళ్లేందుకు ఉత్సాహం చూపుతున్నారు. ఇప్పటికే ప్రభాస్, రామ్ చరణ్, రానా వంటి హీరోలు అక్కడ అదృష్టం పరీక్షించుకున్నారు. వీరి బాటలోనే తారక్, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ, రష్మిక సత్తా చాటడానికి సిద్ధమవుతున్నారు. హీరోలతో పాటు దర్శకులూ అక్కడ పాగా వేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అలా ఇంట గెలిచి రచ్చ గెలిచేందుకు సిద్ధమవుతోన్న వారెవరో చూద్దాం.
తారక్
నటన, డ్యాన్స్, ఫైట్స్, డైలాగ్ డెలివరీతో దక్షిణాదిలో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు యంగ్ టైగర్ ఎన్టీఆర్. ఈ హీరో ఇప్పటివరకు వేరే పరిశ్రమలో సినిమాలు చేయడం గురించి ఆలోచించలేదు. కానీ ప్రస్తుతం రాజమౌళి తెరకెక్కిస్తోన్న 'ఆర్ఆర్ఆర్'తో బాలీవుడ్లో అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఇందులో కొమురం భీమ్ పాత్రలో కనిపించనున్నారు తారక్. ఈ సినిమాలో రామ్ చరణ్ మరో హీరోగా నటిస్తున్నారు. 'తుఫాన్' సినిమాతో ఇప్పటికే చరణ్ హిందీ పరిశ్రమకు పరిచయమయ్యారు.
అల్లు అర్జున్
తనదైన స్టైల్, డ్యాన్స్, నటనతో యూత్ ఐకాన్‌గా గుర్తింపు పొందారు అల్లు అర్జున్. బన్నీకి తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కేరళలో చాలామంది అభిమానులున్నారు. ఆయన నటించిన సినిమాలు హిందీలోనూ డబ్ అయి యూట్యూబ్‌లో రికార్డు స్థాయిలో వ్యూస్‌తో దూసుకెళ్తున్నాయి. దీంతో తన బాలీవుడ్ ఎంట్రీకి ఇదే సరైన సమయమని భావించిన అర్జున్.. 'పుష్ప' చిత్రంతో హిందీ పరిశ్రమలో అదృష్టం పరీక్షించుకునేందుకు సిద్ధమయ్యారు. సుకుమార్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ఆగస్టు 13న విడుదలవనుంది.
విజయ్ దేవరకొండ
'అర్జున్ రెడ్డి' చిత్రంతో ఒక్కసారిగా సెన్సేషనల్ స్టార్‌గా మారిపోయారు విజయ్ దేవరకొండ. అనతి కాలంలోనే పాన్ ఇండియా స్థాయిలో సినిమా చేయడానికి సిద్ధమయ్యారు. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ హీరోగా తెరకెక్కుతోన్న 'లైగర్'తో బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. అనన్యా పాండే హీరోయిన్గా చేస్తోన్న ఈ మూవీలో రమ్యకృష్ణ కీలకపాత్ర పోషిస్తున్నారు.
రష్మిక
'ఛలో' సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన రష్మిక.. తర్వాత స్టార్ హీరోయిన్గా మారిపోయింది. తనదైన అందం, అమాయకత్వంతో కుర్రకారు గుండెల్లో కలల రాణిగా వెలుగొందుతోంది. ప్రస్తుతం అల్లు అర్జున్ 'పుష్ప'తో బాలీవుడ్లో అడుగుపెట్టబోతున్న రష్మిక.. అది విడుదలవక ముందే అక్కడ నేరుగా ఓ చిత్రం చేయబోతుంది. సిద్ధార్థ్ మల్హోత్రా హీరోగా నటిస్తోన్న 'మిషన్ మజ్ను'లో హీరోయిన్గా ఎంపికైంది.
బెల్లంకొండ శ్రీనివాస్
ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ తనయుడిగా తెలుగు తెరకు 'అల్లుడు శీను' చిత్రంతో పరిచయమయ్యారు బెల్లంకొండ శ్రీనివాస్. మొదటి సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి హిట్ అయినా తర్వాత హిట్లు అందుకోవడంలో విఫలమయ్యారు. ప్రస్తుతం బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. బాలీవుడ్లో తెరకెక్కుతోన్న 'ఛత్రపతి' రీమేక్‌లో హీరోగా నటించబోతున్నారు. ఈ సినిమా ద్వారా దర్శకుడు వి.వి వినాయక్ కూడా హిందీ పరిశ్రమలో అడుగుపెట్టబోతున్నారు.
గౌతమ్ తిన్ననూరి
క్రికెట్ కథలతో టాలీవుడ్లో వచ్చిన సినిమాల్లో ది బెస్ట్ అంటే 'జెర్సీ' అనే చెప్పాలి. నేచురల్ స్టార్ నాని, తన అద్భుత నటనతో కంటతడి పెట్టించారు. అనిరుధ్, తన సంగీతంతో ప్రతి సీన్లోనూ లీనమయ్యేలా చేశారు. గౌతమ్ తిన్ననూరికి దర్శకుడిగా ఇది రెండో సినిమా అయినప్పటికీ ఎంతో అనుభవం ఉన్నవాడిలా తీసి అందరి చేత శెభాష్ అనిపించుకున్నారు. బాలీవుడ్లో ఈ సినిమాను షాహిద్ కపూర్ హీరోగా తీస్తున్నారు. ఇటీవల షూటింగ్ పూర్తయింది. త్వరలో విడుదల కానుంది. మరి అక్కడ గౌతమ్ ఎలాంటి ఫలితాన్ని అందుకుంటారో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.
శైలేష్ కొలను
టాలీవుడ్లో వచ్చిన మిస్టరీ థ్రిల్లర్ 'హిట్'. విశ్వక్సేన్ హీరోగా చేయగా, శైలేష్ కొలను దర్శకుడిగా పరిచయమయ్యారు. దీనికి వచ్చిన ఆదరణ చూసి, బాలీవుడ్‌లోనూ తీసేందుకు నిర్మాతలు దిల్‌రాజు, అల్లు అరవింద్ సిద్ధమయ్యారు. రాజ్‌కుమార్ రావ్‌తో హిందీలో ఈ సినిమా రీమేక్ చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం షూటింగ్ జరుగుతుండగా, త్వరలో థియేటర్లలో విడుదల కానుంది. మరి శైలేష్ అక్కడ కూడా 'హిట్' కొడతారో లేదో చూడాలి.
వినాయక్
ఎన్నో హిట్ సినిమాలతో టాలీవుడ్లో స్టార్ డైరెక్టర్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు వీవీ వినాయక్. కానీ సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన చాన్నాళ్లకు బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు. ప్రస్తుతం 'ఛత్రపతి' రీమేక్ పనుల్లో బిజీగా ఉన్నారు. త్వరలో షూటింగ్ ప్రారంభం కానుంది. ఇదే సినిమాతో బెల్లంకొండ శ్రీనివాస్.. హీరోగా బాలీవుడ్‌కు పరిచయమవుతున్నారు. మరి వీరి ద్వయం హిందీ ప్రేక్షకుల్ని ఎలా మెప్పిస్తుందో చూడాలి.