తెలుగు చిత్రసీమలో పరుచూరి బ్రదర్స్‌కు ప్రత్యేకమైన స్థానం ఉంది. వారిలో ఒకరైన పరుచూరి గోపాలకృష్ణ రచయితగా, నటుడిగా రాణించారు. ఆయన 'పరుచూరి పలుకులు' పేరుతో సినిమా విశేషాలతో పాటు, ఆ రోజుల్లో జరిగిన ఆసక్తికర విషయాలను అభిమానులతో పంచుకుంటారు. తాజాగా నాటి అందాల కథానాయిక ముచ్చర్ల అరుణ గురించి పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడారు.
"1980లో ఇండస్రీ సిస్టర్స్, సినిమా సిస్టర్స్ అని కొంతమందిని పిలుస్తుండేవాళ్లం. వారిలో వరలక్ష్మి, పూర్ణిమ, ముచ్చర్ల అరుణ, జ్యోతి, లతాశ్రీ, మధురిమ ఇలా ఐదారుగురు ఉండేవారు. మేం అప్పట్లో 15, 20 సినిమాలకు కథలు రాస్తుండేవాళ్లం. ఏ సినిమాలో ఎవరు చెల్లెలుగా నటిస్తే బాగుంటుంది? అని అనుకుని ఆ పాత్రను రాసేవాళ్లం. అలా బాలయ్య చిత్రాల్లో మధురిమ చెల్లెలు పాత్రలు వేసేది. రాఘవేంద్రరావు దర్శకత్వంలో మొదటిసారి 'బొబ్బిలి బ్రహ్మన్న'లో ముచ్చర్ల అరుణ - కృష్ణంరాజు చెల్లెలిగా నటించింది. మాతో ఆమె ఎన్నో సినిమాలు చేసింది. అప్పట్లో నేను చాలా సినిమాల్లో ప్రతినాయకుడిగా నటించా. ముఖ్యంగా 'భారతంలో అర్జునుడు'లో అరుణ దివ్యాంగురాలు. అయినా సరే ఆమెను పాడు చేసేందుకు ప్రయత్నిస్తే, నా నుంచి తప్పించుకొని ఆత్మహత్య చేసుకుంటుంది. ఆ సన్నివేశంలో మా అన్నయ్య 'ఎందుకురా ఫీలవుతున్నావు. నీకు మానభంగాలు చేయడం కొత్తా? లేక మర్డర్లు చేయడం కొత్తా?' అని డైలాగ్ చెబుతాడు. అప్పుడు నేను 'ఏమీ చేయకుండానే చనిపోయిందని బాధగా ఉంది' అని సమాధానం ఇస్తా. థియేటర్‌లో ఆ సన్నివేశం వచ్చినప్పుడు ఒకటే ఈలలు, గోలలు. దాంతో ఈతరం బాబూరావు' అన్నా మీకు దండం పెడతా. మీరు విలన్ పాత్రలు వేయకండి. మీ ఇమేజ్ మారిపోయింది" అన్నారు. ఇక అప్పటి నుంచి విలన్ వేషాలు వేయడం తగ్గించేశాను. ఒక రకంగా చెప్పాలంటే నేను విలన్ వేషాలు వేయకుండా ఉండటానికి ఆ సినిమా, ముచ్చర్ల అరుణే కారణం. వాటి తర్వాత రెండు మూడు చిత్రాలు చేశా. ఎన్టీఆర్ సినిమాలో కామెడీ విలన్‌గానూ చేశా. 'శశిరేఖా పరిణయం' చిత్రంలోనూ హాస్య ప్రతినాయకుడిగా చేశా. చాలా మంచి పేరొచ్చింది"
"ఇటీవల ఓ ఫంక్షన్‌లో ముచ్చర్ల అరుణను కలిశాను. 'బొబ్బలి బ్రహ్మన్న' షూటింగ్ సందర్భంగా జరిగిన సరదా సంఘటనను గుర్తు చేసుకుని నవ్వుకున్నాం. ఆ రోజుల్లో షూటింగ్ ఉదయం 7 గంటలకు మొదలైతే సాయంత్రం 5గంటలకు అయిపోయేది. ఇప్పుడా పరిస్థితి లేదు. ఒక రోజు రాత్రి భోజనం చేశాక గదిలో నిద్రపోతుంటే ఎవరో వచ్చి తలుపు కొట్టారు. తీరా చూస్తే, చేతిలో కాగితం పట్టుకొని ముచ్చర్ల అరుణ నిలబడింది. 'డైరెక్టరు గారు మీ దగ్గర కొన్ని డైలాగ్‌లు నేర్చుకొని రమ్మన్నారు' అని చెప్పింది. 'ఇప్పుడా..? పొద్దున్నే రండి' అని చెప్పాను. 'కాదు ఉదయాన్నే అందరూ సిద్ధమై 7 గంటలకు షూటింగ్‌కు వెళ్లాలి కదా. ఈ డైలాగ్స్ సరిగా చెప్పకపోతే సినిమా నుంచి తీసేస్తానని డైరెక్టర్‌గారు హెచ్చరించారు' అని చెప్పింది. దాంతో సరేనని లోపలి రమ్మని చెప్పా. నేను ఒకటి చెబితే, ఆమె ఇంకొకటి చెబుతోంది. ఎన్నిసార్లు చెప్పినా, 'మళ్లీ చెప్పండి' అంటూ కంగారు పెడుతోంది. పదిహేను - ఇరవై నిమిషాలు నన్ను సతాయించింది. నా పక్కనే రాఘవేంద్రరావుగారి రూమ్ ఉంది. వెంటనే వచ్చి తలుపులు తీసి 'ఏమిటి చెమటలు పడుతున్నాయా' అంటూ ఆటపట్టించారు. ఆయనే కావాలని ముచ్చర్ల అరుణను నా దగ్గరకు పంపారని తర్వాత తెలిసింది."
"ఓసారి నేను రైలులో మద్రాసు వెళ్తుండగా నాతో పాటు ముచ్చర్ల అరుణ కూడా ఉంది. ఆ రోజు హోటల్లో జరిగిన దాని గురించి క్షమాణపలు కోరింది. 'మాకేం కాదమ్మా. మీలాంటి అమ్మాయిల జీవితాలు ఇబ్బంది పడతాయి' అని చెప్పా. చిత్రసీమకు ఆమె సిస్టర్ అయితే మాకు మాత్రం కూతురులాంటిదని" అని పరుచూరి ముగించారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇదీ చూడండి: సినీ రచనా దమ్ము చూపించిన అన్నదమ్ములు