దర్శకత్వ బాధ్యతలు స్వీకరించి సరి కొత్త ఆలోచనలతో కొత్త దర్శకుడు అనే మాట గుర్తురాకుండా చేశారు. వైవిధ్యంగా రాసుకున్న కథను పక్కాగా తెరకెక్కించి తొలి ప్రయత్నంలోనే మంచి విజయం అందుకున్నారు. ఆ సత్ఫలితం ఇచ్చిన ఉత్సాహంతో తదుపరి ప్రాజెక్టులు పట్టాలెక్కించారు. కొంత ఆలస్యమైనా ఆసక్తికర చిత్రాలు రూపొందిస్తూ అంచనాలు పెంచుతున్నారు. ఈ ఏడాది ద్వితీయ విఘ్నం దాటేందుకు తగిన కసరత్తులు చేస్తున్నారు. వాళ్లెవరు.. ఆ సినిమాలేంటో చూసేద్దాం...
'రాధేశ్యామ్'.. రాధాకృష్ణ(Radhe Syam)
గోపీచంద్ కథానాయకుడుగా రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహించిన చిత్రం 'జిల్'. యాక్షన్ ప్రధానంగా వచ్చిన ఈ సినిమా ప్రేక్షకుల్ని మెప్పించి, దర్శకుడిగా ఆయనకు పేరు తీసుకొచ్చింది. అయితే రాధాకృష్ణ వెంటనే మరో కథను పట్టాలెక్కించలేదు. ఎంత ఆలస్యమైనా ప్రభాస్‌తోనే(Prabhas) తన తదుపరి ప్రాజెక్టు చేయాలని నిర్ణయించుకున్నారు. సుమారు నాలుగేళ్ల విరామానికి తగినట్టుగానే ఓ వింట్జ్ ప్రేమకథను సిద్ధం చేసుకున్నారు. అదే 'రాధేశ్యామ్'(Radhe Syam). పూజా హెగ్డే నాయిక. యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మి స్తుంది. ప్రస్తుతం తుది దశ చిత్రీకరణలో ఉంది. త్వరలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది చిత్రబృందం. రాధాకృష్ణ కుమార్ తలపెట్టిన రెండో ప్రయత్నం తనను ఏ స్థాయికి తీసుకెళ్తుందో చూడాలి.
'మహాసముద్రం'... మరోమెట్టేనా?(Mahasamudram)
'ఆర్ఎక్స్ 100' చిత్రంతో సంచలన దర్శకుడిగా మారారు అజయ్ భూపతి. వాస్తవ సంఘటనల ఆధారంగా రొమాంటిక్ యాక్షన్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కించిన ఈ సినిమా ఆయనకు యువతలో క్రేజ్ తెచ్చిపెట్టింది. ఆ ఉత్సాహంతోనే దాదాపు రెండేళ్ల అనంతరం 'మహా సముద్రం' పట్టాలెక్కించారు. శర్వానంద్, సిద్ధార్థ కథానాయకులుగా వస్తోన్న ఈ లవ్ అండ్ యాక్షన్ డ్రామాతో ఓ కొత్త అనుభూతిని పంచనున్నారు. అదితిరావు హైదరీ, అను ఇమ్మానుయెల్ నాయికలు. ఏకే ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నిర్మిస్తుంది. రావూరమేశ్ మరో కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్ర షూటింగ్ దాదాపు ముగింపు దశకు వచ్చింది. దసరాకు ప్రేక్షకుల ముందుకు తెచ్చే యోచనలో చిత్రబృందం ఉంది. మరి ఈ ప్రయత్నం భూపతిని మరోమెట్టు ఎక్కిస్తుందా?
'మిషన్ ఇంపాజిబుల్'... స్వరూపం ఏంటి?(Mission Impossible)
తెలుగులో డిటెక్టివ్ కథలు అరుదుగా వస్తుంటాయి. కొంత అనుభవం ఉంటే తప్ప ఇలాంటి స్క్రిప్టులకు సాహసం చేయకూడదనే మాటలకు స్వస్తి పలికారు స్వరూప్ ఆర్ ఎస్జే. నవీన్ పొలిశెట్టిని(Naveen polishetty) 'ఏజెంట్ శ్రీనివాస ఆత్రేయ'గా పరిచయం చేసి థ్రిల్ చేశారు. టాలీవుడ్లో కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు. రెండో ప్రయత్నంగా మరో ఆసక్తికర సబ్జెక్టును ఎంచుకున్నారాయన. 'మిషన్ ఇంపాజిబుల్' అనే చిత్రం తెరకెక్కిస్తున్నారు. మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మిస్తుంది. ఇప్పటికే సగానికి పైగా చిత్రీకరణ పూర్తైంది. ఇప్పుడు ఇందులో ఓ కీలక పాత్రను తాప్సీ నటించనుందని తెలుస్తోంది. మరి స్వరూప్ రెండో కొత్త ప్రయత్నం... మెప్పిస్తుందా?
'శ్రీదేవీ సోడా సెంటర్'... 'ద్వి'గుణీకృతమేనా?(Sridevi Soda centre)
'పలాస' చిత్రంతో కరుణ కుమార్ అనే కొత్త దర్శకుడు తెలుగు తెరపై మెరిశారు. సమాజంలో మనుషుల మధ్య కనిపిస్తున్న అంతరాల్ని ఎత్తి చూపుతూ.. విభిన్న దారిలో ఆయన చేసిన ప్రయత్నం విమర్శకుల ప్రశంసల్ని అందుకుంది. ఈ చిత్రంతో శ్రీకాకుళం పల్లె జీవితాల్ని, వా జీవభాషను తెరపై ఎంతో భావోద్వేగభరితంగా ఆవిష్కరించి ఎన్నో హృదయాలు హత్తుకున్నారాయన. 'మెట్రో కథలు' పేరుతో ఓ వెబ్ సిరీస్ రూపొందించిన కరుణ కుమార్ ప్రస్తుతం సుధీర్ బాబు(Sudheer Babu) హీరోగా 'శ్రీదేవి సోడా సెంటర్' అనే మరో పల్లెటూరి కథను చూపించనున్నారు. 70 ఎమ్ఎమ్ ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మిస్తుంది. ఇందులో సుధీర్ బాబు లుక్ ఇప్పటికే విడుదలై ఆకట్టుకుంటోంది. మరి ద్వితీయ ప్రయాణం అద్వితీయంగా సాగుతుందా?
హిట్-2తో.. రెండో విజయమా?(Hit2 Movie)
విభిన్నమైన నేర పరిశోధనా కథాంశంతో 'హిట్'(Hit movie) తెరకెక్కించి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు శైలేష్ కొలను. విశ్వక్సేన్ కథానాయకుడుగా వచ్చిన ఈ చి్తరం దర్శకుడిగా శైలేష్‌పై ప్రశంసలు కురిపించింది. ఆ ప్రతిభే ఆయనకు బాలీవుడ్ అవకాశం అందించింది. ఇదే సినిమాను రాజ్‌కుమార్ రావు హీరోగా హిందీలో రీమేక్ చేస్తున్నారు శైలేష్. ఇది సెట్స్ మీదకు వెళ్లకుండానే... ఇప్పుడు 'హిట్-2'ను పట్టాలెక్కించే పనిలో ఉన్నారు. అడవిశేష్ ఇందులో కథానాయకుడు. ఈ పాటికే చిత్రీకరణకు వెళ్లాల్సిన ఈ సినిమా... కరోనా సెకెండ్వేవత్తో ఆగిపోయింది. త్వరలోనే ఈ చిత్రం పట్టాలెక్కనుంది. మరి 'హిట్-2' శైలేష్ కొలనుకు... రెండో హిట్‌ను అందిస్తుందేమో వేచిచూడాలి.
తొలి సినిమాతోనే మంచి వినోదం అందించిన వీరిలో ద్వితీయ ప్రయత్నం సైతం అద్వితీయం అనిపించుకునేదెవరో తెలియాలంటే కొంతకాలం ఆగాల్సిందే.
ఇదీ చూడండి: Madonna: కుర్రకారు ఎదను చుట్టేసే చిట్టి పూలతీగ!