కరోనా రెండో దశ(second wave) కారణంగా రాష్ట్రంలో మూతపడిన సినిమా థియేటర్లు(Cinema Theatres) త్వరలో తిరిగి తెరుచుకోనున్నాయి! దాదాపు రెండు నెలలకుపైగా మూసి ఉన్న హాళ్లలో ప్రదర్శనలు మొదలుపెట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. వైరస్ ప్రభావం తగ్గుముఖం పడటం వల్ల దశలవారీగా లాక్‌డౌన్ సడలింపులు ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో వాణిజ్య కార్యకలాపాలు ఊపందుకున్నాయి.
దీంతో థియేటర్లు, మల్టీప్లెక్సులు ఎప్పుడు మొదలవుతాయన్నది ప్రశ్నగా మారింది. ఈ క్రమంలోనే జులై 1 నుంచి తెరపై బొమ్మ పడే అవకాశముందని జోరుగా ప్రచారం సాగుతోంది. 50 శాతం సీటింగ్ సామర్థ్యంతో ప్రేక్షకులను అనుమతించేందుకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయనున్నట్లు తెలుస్తోంది. కరోనా మొదటి వేవ్ అనంతరం హాళ్ల తెరుచుకున్నప్పుడు ఎలాంటి విధివిధానాల్ని అమలు చేశారో.. ఇప్పుడు కూడా వాటినే అమలు చేయనున్నారని సమాచారం.
రిలీజ్ అయ్యేందుకు రెడీగా!
నాగచైతన్య 'లవ్‌స్టోరీ'(Love Story), రానా 'విరాటపర్వం'(Virataparvam), నాని 'టక్జగదీశ్'(Tuck Jagadish), 'ఎస్.ఆర్.కళ్యాణమండపం'(SR Kalyana mandapam) సహా అనేక సినిమాలు థియేటర్లలో విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ప్రేక్షకుల రాకను అంచనా వేసి ఆగస్టు తర్వాత పెద్ద సినిమాలను విడుదల చేయాలని నిర్మాతలు భావిస్తున్నారు. 'ఆర్ఆర్ఆర్', 'సర్కారు వారి పాట', 'ఆచార్య', 'రాధేశ్యామ్' సహ పలు చిత్రాలు ఈ జాబితాలో ఉన్నాయి. ఈ బడా చిత్రాలు మిగిలిన షూటింగ్‌ను వచ్చే నెలలో ప్రారంభించబోతున్నాయి!.
ఇప్పటికే చిత్రీకరణలు ప్రారంభం
తొలి దశ కరోనా తర్వాత సినిమాలు పట్టాలెక్కడానికి చాలా సమయమే పట్టింది. రెండో దశ తర్వాత చిత్రబృందాలు ధైర్యంగా సెట్స్‌పైకి వెళ్తున్నాయి. కరోనా విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుని చిత్రీకరణ చేయాలో ఇప్పటికే అవగాహన ఏర్పడింది. వ్యాక్సినేషన్ జోరుగా సాగుతోంది. నిర్మాణ సంస్థలే ముందుకొచ్చి నటులు, సాంకేతిక నిపుణులకు వ్యాక్సిన్ ఇప్పిస్తున్నాయి. అందుకే లాక్‌డౌన్ పూర్తిగా తొలిగించకముందే సినిమాలు పట్టాలెక్కాయి. సంపూర్ణేష్ బాబు 'క్యాలీఫ్లవర్', నితిన్ 'మాస్ట్రో' షూటింగ్‌లు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. 'థ్యాంక్యూ'(Thanku), శాకుంతలం'(sakunthalam), రవితేజ 'ఖిలాడి' సహా పలు ప్రాజెక్టులు చిత్రీకరణలు జరుపుకోవడానికి సిద్ధమవుతున్నాయి.
ఇదీ చూడండి: Tollywood: షూటింగ్స్ షురూ.. బడా చిత్రాలు ఎప్పుడంటే?