ఆంధ్రప్రదేశ్‌లో సినిమా థియేటర్ల విద్యుత్ ఛార్జీల రద్దుతో పాటు థియేటర్లకు రిసార్ట్ ప్యాకేజి కింద రుణాలు ప్రకటించడంపై తెలుగు నిర్మాతల మండలి హర్షం వ్యక్తం చేసింది. ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది. కరోనా వల్ల తీవ్రంగా నష్టపోయిన టాలీవుడ్‌కు ఏపీ ప్రభుత్వం రాయితీలు ప్రకటించడం ఎంతో చేయూతనిచ్చిందని నిర్మాతల వాణిజ్య మండలి అధ్యక్షుడు నారాయణదాస్ నారంగ్ ఆనందం వ్యక్తం చేశారు.
ఏప్రిల్, మే, జూన్ నాటి థియేటర్ల యాజమాన్యాలు చెల్లించాల్సిన ఫిక్స్డ్ విద్యుత్ ఛార్జీలను పూర్తిగా రద్దు చేయడం, మిగిలిన 6 నెలల ఫిక్స్డ్ విద్యుత్ ఛార్జీలను వాయిదాల పద్దతిలో చెల్లించేందుకు ఆమోదించడం, రిసార్ట్ ప్యాకేజి కింద ఏ,బీ సెంటర్లకు 10 లక్షలు, సి సెంటర్ థియేటర్లకు 5 లక్షల చొప్పున రుణాలు ఇచ్చేలా ఏపీ మంత్రి వర్గం కీలక నిర్ణయాలు తీసుకోవడం పరిశ్రమకు ఊరటనిస్తుందని నారాయణదాస్ అన్నారు. సీఎం జగన్ తీసుకున్న నిర్ణయం థియేటర్స్‌కు వెసులుబాటుతోపాటు వేలాది మంది సినీ కార్మికులకు జీవనోపాధి కలిగిస్తుందని పేర్కొన్నారు.
అటు ఇండస్ట్రీలోని అగ్ర నటీనటులు, నిర్మాణ సంస్థలు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తూ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు ట్వీట్లు కూడా చేస్తున్నారు.