"సరిపడిన స్థాయిలో కంటెంట్ లేకుండా థియేటర్లను తెరవడం మంచిది కాదు. దీని వల్ల పరిశ్రమకు మంచి కన్నా చెడే ఎక్కువ జరిగే ప్రమాదముంది. ఈ మధ్య చైనాలో ఇలాగే తొందర పడి 500 థియేటర్లు తెరచి మళ్లీ మూసేశారు. రెండోసారి ప్రయత్నించినా ఇదే జరిగింది. కాబట్టి థియేటర్లు తెరవడానికి రెండు నెలలు ముందే చిత్రీకరణలకు అనుమతులిచ్చి.. సరిపడిన స్థాయిలో చిత్రాలు అందుబాటులోకి వచ్చాక వాటిని తెరిస్తే బాగుంటుంది" అని ఇటీవల కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డితో చర్చల సందర్భంగా ప్రముఖ నిర్మాత సురేష్‌బాబు చేసిన వ్యాఖ్యలివీ. అవును అది నిజమే. అందుకే చిత్ర పరిశ్రమ ఇందుకు తగ్గ ఏర్పాట్లలో నిమగ్నమవుతోంది.
వేసవి సినీ మారథాన్ ముగిశాక మళ్లీ దసరా సీజన్ వరకు చిత్ర పరిశ్రమలో పెద్ద సినిమాల సందడి అంతగా కనిపించేది కాదు. జూన్ నుంచి ఆగస్టు వరకు బాక్సాఫీస్ ముందు చిన్న చిత్రాల జోరే దర్శనమిచ్చేది. కరోనా దెబ్బకు దాదాపు ఆరు నెలల సినీ క్యాలెండర్ మొత్తం తుడిచిపెట్టుకు పోయింది. ఫలితంగా సినీ సందడి లేక థియేటర్లు, చిత్రీకరణలు లేక పరిశ్రమ కళ తప్పింది. ఈ క్లిష్ట పరిస్థితుల మధ్య అత్యంత జాగ్రత్తగా చిత్రీకరణలు జరపడం ఒకెత్తైతే.. థియేటర్లు తెరిచే నాటికి వాటికి సరిపడే స్థాయిలో సినిమాల్ని సిద్ధం చేసి ఉంచడం మరొకెత్తు. ఇక ఆగస్టు నాటికి దేశవ్యాప్తంగా థియేటర్లు తెరచుకునేందుకు అనుమతులిచ్చే దిశగా కేంద్ర ప్రభుత్వం చర్యలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. అందుకే ఒకనెల అటు ఇటైనా థియేటర్లు తెరిచే నాటికి 20 నుంచి 30 చిత్రాలనైనా ముస్తాబు చేసి పెట్టుకోవడమే లక్ష్యంగా పరిశ్రమ అడుగులేస్తోంది.
20 చిత్రాలకు తగ్గవు
చివరి దశ చిత్రీకరణలో ఉన్న వాటిల్లో పవన్, వెంకటేష్ చిత్రాలు మినహా మిగిలినవి ఐదు నుంచి ఇరవై రోజుల చిత్రీకరణ మిగిలి ఉన్నవే. ఇక వీటితో పాటు కొత్త దర్శక నిర్మాతల చేతుల్లో రూపుదిద్దుకుంటున్న సినిమాలు 20 వరకైనా ఉండే అవకాశముంది. పోస్ట్‌ప్రొడక్షన్ పనులు ఇప్పటికే కొందరు ప్రారంభించిన నేపథ్యంలో.. థియేటర్లు తెరచుకునే నాటికి 20కి పైగా సినిమాలు సిద్ధం చేయడం పెద్ద విషయమేమీ కాదు.
వెంటాడుతున్న భయాలు
సినిమాల్ని సిద్ధం చేసినప్పటికీ... ఎంత మంది ధైర్యంగా విడుదలకు ముందుకొస్తారన్నది అసలు సమస్య. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం భద్రతా ప్రమాణాలు పాటిస్తూ థియేటర్లు తెరచినా ప్రేక్షకులు రావడానికి సమయం పట్టవచ్చని కొందరు భావిస్తున్నారు. కాబట్టి సినిమా హాళ్లు తెరచుకున్నా చాలా మంది నిర్మాతలు కొన్నాళ్ల పాటు వేచి చూసే ధోరణిలో ఉండే అవకాశముంది. దీనికి తోడు ఇప్పుడు తుది దశ చిత్రీకరణలో ఉన్న సినిమాల్లో రవితేజ, నాని, రానా, రామ్, నాగచైతన్య, అఖిల్, వైష్ణవ్ తేజ్, సాయితేజ్ లాంటి హీరోల చిత్రాలన్నీ రూ.10 కోట్ల నుంచి రూ.50 కోట్ల మధ్య బడ్జెట్‌తో తెరకెక్కినవే. ఇలాంటి చిత్రనిర్మాతలు బాక్సాఫీస్ పరిస్థితులు అంచనా వేసుకొన్న తర్వాతే థియేటర్లలోకి తీసుకొచ్చే అవకాశముంది. ఒకవేళ తొలి నెల చిన్న చిత్రాలకు దారిచ్చినా.. నష్ట భయాల్ని ఎదుర్కొంటూ థియేటర్లలోకి అడుగు పెట్టేవెన్ని? ఓటీటీ వైపు చూసేవెన్ని? అనేవి తేలని ప్రశ్నలే.
చిత్రీకరణ తుది దశలో ఉన్నవి
- పవన్ కల్యాణ్ - 'వకీల్‌సాబ్'
- వెంకటేష్ - 'నారప్ప'
- రవితేజ - 'క్రాక్'
- సాయితేజ్ - 'సోలో బ్రతుకే సో బెటరు'
- నాగచైతన్య - 'లవ్‌స్టోరీ'
- అఖిల్ - 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్'
- శర్వానంద్ - 'శ్రీకారం'
- బెల్లంకొండ శ్రీనివాస్ - 'అల్లుడు అదుర్స్'
- మంచు విష్ణు - 'మోసగాళ్లు'
- సందీప్ కిషన్ - 'ఏ1 ఎక్స్‌ప్రెస్'
- అల్లరి నరేష్ - 'నాంది', 'బంగారు బుల్లోడు'
- సత్యదేవ్ - 'ఉమామహేశ్వర ఉగ్రరూపశ్య'
దేశంలో కరోనా ప్రభావం మొదలయ్యే నాటికి సిద్ధమయ్యే సినిమాలు..
నాని, సుధీర్‌బాబు - 'వి'
అనుష్క - 'నిశ్శబ్దం',
రానా - 'అరణ్య'
రామ్ - 'రెడ్',
వైష్ణవ్ తేజ్ - 'ఉప్పెన'
రాజ్‌తరుణ్ - 'ఒరేయ్ బుజ్జిగా'
కీర్తి సురేష్ - 'మిస్ ఇండియా'
ప్రదీప్, అమృత అయ్యర్ల - '30 రోజుల్లో ప్రేమించటం ఎలా?'