Melania Trump Declines Jill Biden Tea Party : అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ గెలిచిన తర్వాత అధికార మార్పిడి జరగబోతుంది. ఈ నేపథ్యంలో శ్వేతసౌధంలో జరగనున్న సంప్రదాయబద్ధమైన సమావేశానికి ట్రంప్ సతీమణి మెలానియా దూరంగా ఉన్నట్లు సమాచారం. ఈమేరకు అక్కడి వార్తా సంస్థలు కథనాలు పేర్కొన్నాయి.
అధ్యక్షుడు జో బైడెన్ బాధ్యతల నుంచి వైదొలుగునున్నారు. ఈ నేపథ్యంలో ఈనెల 13న ఓవల్ ఆఫీస్‌లో డొనాల్డ్ ట్రంప్‌తో భేటీ కానున్నారు. ఈ సమావేశంలో ఫస్ట్ లేడీ టీ పార్టీ ఇవ్వడం ఆనవాయితీ. అందుకు సంబంధించిన ఆహ్వానాన్ని జిల్ బైడెన్ గత వారమే మెలానియా ట్రంప్‌నకు పంపినట్లు వైట్‌హౌస్ తెలిపింది.
2016 అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించారు. ఈ క్రమంలో నాడు ఫస్ట్ లేడీగా ఉన్న మిచెల్ ఒబామా మెలానియాకు టీ పార్టీ ఇచ్చారు. ఆ తర్వాత 2020 ఎన్నికల ఫలితాల్లో అవకతవకలు జరిగాయని డొనాల్డ్ ట్రంప్ ఆరోపించారు. ఈ నేపథ్యంలో అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్, ట్రంప్ భేటీ కావాల్సి ఉంది. కానీ కాలేదు. దీంతో ఆ ఆనవాయితీకి బ్రేక్ పడినట్లు అయింది. అయితే తాజాగా జరిగిన ఎన్నికల్లో గెలిచిన ట్రంప్‌నకు శాంతియుతంగా అధికార మార్పిడి చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు జో బైడెన్ ప్రకటించారు. ఈ క్రమంలో ప్రస్తుత ఫస్ట్ లేడీగా ఉన్న జిల్ బైడెన్ ఇవ్వనున్న టీ పార్టీకి మెలానియా ట్రంప్ దూరంగా ఉండటం ఆసక్తికర పరిణామం.
అమెరికా జాతీయ భద్రతా సలహాదారుగా మైక్ వాల్జ్
మరోవైపు, అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టబోతున్న రిపబ్లికన్ నేత డొనాల్డ్ ట్రంప్ తన పాలనవర్గం కూర్పును వేగవంతం చేశారు. ఇప్పటికే పలు కీలక బాధ్యతలకు నియామకాలు చేపట్టిన ఆయన తాజాగా అమెరికా తదుపరి జాతీయ భద్రతా సలహాదారుగా కాంగ్రెస్ సభ్యుడు మైక్ వాల్జ్‌ను నియమించినట్లు సమాచారం. అమెరికా ఆర్మీలోని ప్రత్యేక భద్రతా దళం అయిన గ్రీన్ బెల్ట్‌లో ఆర్మీ కల్నల్‌గా పదవీ విరమణ చేసిన వాల్జ్ 2019 నుంచి ప్రతినిధుల సభలో సభ్యుడిగా ఉన్నారు. ప్రస్తుతం ఇండియా కాకస్‌కు సహ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు.
సెక్రటరీ ఆఫ్ స్టేట్‌గా ఫ్లోరిడా సెనేటర్ మార్కో రూబియోను అపాయింట్ చేసినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా డిఫెన్స్ సెక్రటరీగా ట్రంప్ విశ్వసనీయులైన మైక్ రోజర్స్, రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ కేద్ కెలాగ్ను నియమించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ మేరకు పలు అంతర్జాతీయ మీడియాల్లో కథనాలు వచ్చాయి.