మాస్ అభిమానులకు ఊపునిచ్చేది ఫైటే. కానీ రొటీన్ ఫైట్‌లు తెరపై చూపిస్తుంటే ప్రేక్షకులకు రుచించడం లేదు. ఏదైనా కొత్తగా చేస్తేనే ఎంజాయ్ చేస్తున్నారు. అందుకే దర్శకనిర్మాతలు పోరాట ఘట్టాలను ప్రత్యేకంగా తీర్చిదిద్దుతున్నారు. ఇప్పుడు అగ్ర హీరో ప్రభాస్, యువ కథానాయకుడు రామ్ నటిస్తున్న సినిమాల్లోనూ పోరాటాలు కీలకం కానున్నాయి. వాటిని అద్భుతంగా తీర్చిదిద్దడానికి రామోజీ ఫిల్మ్‌సిటీ వేదికైంది. ఆ విశేషాలేంటో చూద్దాం...
ప్రభాస్- నాగ్ అశ్విన్ కాంబినేషన్లో వైజయంతీ మూవీస్ ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తోంది. సి.అశ్వనీదత్ నిర్మిస్తున్నారు. అమితాబ్ బచ్చన్ ముఖ్య భూమిక పోషిస్తున్నారు. దీపికా పదుకొణె కథానాయిక. 'ప్రాజెక్ట్ కే' వర్కింగ్ టైటిల్‌తో ఇటీవలే ఈ సినిమా చిత్రీకరణ మొదలైంది. ఓ పాడుబడ్డ శివాలయం నేపథ్యంలో అమితాబ్‌బచ్చన్‌పై కీలక సన్నివేశాల్ని తెరకెక్కించారు. తనపై సీన్స్ పూర్తయ్యాకా తిరిగి ముంబయికి చేరుకున్నారు అమితాబ్. ప్రస్తుతం కొంతమంది విదేశీ ఫైటర్లపై పోరాట సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నారు.
రామ్ చిత్రంలో ఆది పోరాటాలు
రామ్ కథానాయకుడిగా తమిళ దర్శకుడు లింగుస్వామి ఓ చిత్రాన్ని తీస్తున్నారు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్స్ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ రామోజీ ఫిల్మ్‌సిటీలోని ఎం.సిటీలో జరుగుతోంది. దీంతో పాటు హైవే పై సాగే సన్నివేశాలను ప్రతినాయకుడిగా నటిస్తున్న ఆది పినిశెట్టి, ఫైటర్లపై తెరకెక్కించారు. ఓ రోడ్డు ప్రమాదం నేపథ్యంలో సాగే సన్నివేశాలివి. మరికొన్ని రోజుల పాటు ఫిల్మ్‌సిటీలోనే చిత్రీకరణ చేయనున్నారు.
తాప్సీ ఎన్నికల సందడి
రామోజీ ఫిల్మ్‌సిటీలో తాప్సీ సందడి చేస్తోంది. ఆమె ప్రధాన పాత్రలో 'ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ' చిత్రంతో విజయం అందుకున్న స్వరూప్ ఆర్‌ఎస్‌జె దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం 'మిషన్ ఇంపాజిబుల్'. మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై నిరంజన్‌రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాప్సీ, ఇతర నటీనటులపై ఎన్నికల నేపథ్యంగా సాగే సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు.
ఇవీ చదవండి: