పడిలేచిన కెరటం నితిన్. ఆరంభంలోనే ఘన విజయాల్ని సొంతం చేసుకున్నాడు. స్టార్ హీరోలతో సమాన స్థాయి క్రేజ్ వచ్చింది. అగ్ర దర్శకులందరితోనూ కలిసి సినిమాలు చేశాడు. అలాంటి నటుడు వరుసగా డజనుకి పైగా సినిమాలతో వరుస పరాజయాల్ని చవిచూస్తాడని ఎవరైనా ఊహిస్తారా? నితిన్ విషయంలో అదే జరిగింది.
ఇష్క్‌తో మళ్లీ
ఇక అందరూ నితిన్ పనైపోయిందని మాట్లాడుకున్నారు. కానీ నితిన్ మాత్రం పట్టువదలని విక్రమార్కుడిలా విజయం కోసం పోరాటం చేశాడు. పరాజయాలు ఎదురైన కొద్దీ మరింత కసితో పనిచేశాడు. అదే ఆయన్ని మళ్లీ నిలబెట్టింది. 'ఇష్క్'తో ఎట్టకేలకి ఆయన తన ఖాతాలో మరో విజయం సొంతం చేసుకున్నాడు. అప్పట్నుంచి ఆయన మళ్లీ విజయాల పరంపర కొనసాగిస్తూ వస్తున్నాడు. 'గుండె జారి గల్లంతయ్యిందే', 'అఆ' చిత్రాలు నితిన్‌ను మరోస్థాయిలో నిలబెట్టాయి. ఈ మధ్యే వచ్చిన 'భీష్మ' మంచి విజయాన్ని సాధించగా.. ప్రస్తుతం 'రంగ్‌దే' సినిమాతో బిజీగా ఉన్నాడు నితిన్.
![TELUGU ACTOR NITHIN BIRTHDAY SPECIAL STORY](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/6587703_rang.jpg)
'తొలిప్రేమ' చూసి అలా..
యువతరంలో మంచి క్రేజ్‌ని సంపాదించుకున్న కథానాయకుల్లో నితిన్ ఒకడు. ఆయన 1983 మార్చి 30న జన్మించాడు. తండ్రి సుధాకర్ రెడ్డి సినిమా పంపిణీదారుడు కావడం వల్ల ఇంట్లో సినీ వాతావరణమే ఉండేదట. నచ్చిన సినిమాని కనీసం రెండు మూడు సార్లైనా చూసేవాడట. పవన్‌కల్యాణ్ 'తొలిప్రేమ' చిత్రాన్ని చూశాకే కథానాయకుడు కావాలనే కోరిక పుట్టిందని చెబుతుంటాడు నితిన్. ఆ చిత్రాన్ని థియేటర్లో 28 సార్లు చూశాడట. తనలో మొదట కథానాయకుడు కావాలనే ఆలోచనకు బీజం పడింది కూడా 'తొలిప్రేమ' తీసిన దర్శకుడు కరుణాకరన్ వల్లేనట.
"కరుణాకరన్ మా నాన్నకి స్నేహితుడు. దాంతో తరచుగా ఆయన మా ఇంటికి వచ్చేవాడు. ఒక రోజు నన్ను చూసి స్మార్ట్‌గా ఉన్నావు, నిన్ను పెట్టి సినిమా తీస్తా" అన్నారని నితిన్ గుర్తు చేసుకుంటుంటాడు. ఆయన సరదాగా అన్నాడనిపించినా... నితిన్ మనసులో నిజంగానే హీరో అయితే బాగుంటుందేమో అనే కోరిక కలిగిందట.
'జయం'తో మొదలు
అయితే 'నువ్వు నేను' సినిమా చూడటానికి వెళ్లిన నితిన్‌ని అక్కడే తేజ చూసి "నేను 'జయం' సినిమా తీస్తున్నా. అందులో నటిస్తావా" అని అడిగాడట. అలా 2002లో 'జయం'తో కెమెరా ముందుకొచ్చాడు నితిన్. ఆ తర్వాత 'దిల్'తో మరో విజయాన్ని ఖాతాలో వేసుకున్నాడు. రాజమౌళితో 'సై' చేసి విజయాన్నందుకున్న నితిన్.. కథానాయకుడిగా మరోస్థాయికి ఎదిగాడు.
వరుస పరాజయాలు ఎదురైనా..
ఆ తర్వాత 2005 నుంచి వరుస పరాజయాల్ని చూసినప్పటికీ వెనక్కి తగ్గలేదు. ప్రయత్నలోపం లేకుండా సినిమాలు చేశాడు. పరిస్థితులను ఎదురొడ్డి నిలిచినవాడే గెలుపు వాకిట నిలుస్తాడన్ననట్లుగా 'ఇష్క్'తో ఓ విజయాన్ని అందుకొన్నాడు. ఈ మధ్య పరాజయాలు ఎదురైనా మళ్లీ విజయమే లక్ష్యంగా నితిన్ కొత్త కథల్ని ఒప్పకుంటున్నాడు.
'భీష్మ'తో మరో హిట్
గత నెల విడుదలైన 'భీష్మ' పక్కా కమర్షియల్ ఎంటర్టైన్మెంట్తో హిట్టయింది. చంద్రశేఖర్ యేలేటి ఓ కొత్త రకమైన కథతో 'రంగ్ దే' లో సినిమా చేస్తున్నాడు నితిన్. ఇప్పటికే ఈ సినిమా పోస్టర్ విడుదలైంది. ఇందులో కీర్తి సురేశ్ కథానాయికగా నటిస్తోంది. వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తోన్ని ఈ చిత్రానికి.. దేవీశ్రీ ప్రసాద్ బాణీలు కూరుస్తున్నాడు. సితార ఎంటర్టైన్మెంట్ నిర్మిస్తోంది.
![TELUGU ACTOR NITHIN BIRTHDAY SPECIAL STORY](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/6587703_bhee.jpg)
పెళ్లి వాయిదా
దుబాయ్‌లో ఏప్రిల్ 16న, తన ప్రేయసి శాలినితో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకునేందుకు సన్నాహాలు చేశాడు నితిన్. కరోనా ప్రభావం వల్ల పెళ్లికి ఇది సరైన సమయం కాదని.... తన వివాహాన్ని వాయిదా వేసుకున్నాడు.
![TELUGU ACTOR NITHIN BIRTHDAY SPECIAL STORY](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/6587703_wife.jpg)
ఇదీ చదవండి: 'పుట్టినరోజు వేడుకలు వద్దు.. పెళ్లి వాయిదా వేస్తున్నా'