తెలుగు సినిమాలను ఓటీటీలో(OTT) విడుదల చేయడంపై తెలంగాణ చలన చిత్రవాణిజ్య మండలి అభ్యంతరం వ్యక్తం చేసింది. అక్టోబర్ వరకు తెలుగు నిర్మాతలెవరూ తమ సినిమాలను ఓటీటీలో విడుదల చేయవద్దని విజ్ఞప్తి చేసింది.
లాక్డౌన్ కారణంగా తెలుగు రాష్ట్రాల్లో సినిమా థియేటర్లు మూతపడటం, ఓటీటీలో కొత్త సినిమాలు విడుదల అవుతున్న క్రమంలో హైదరాబాద్ ఫిల్మ్‌నగర్‌లోని కార్యాలయంలో తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు మురళీమోహన్ అధ్యక్షతన సమావేశమైన నిర్మాతలు, ఎగ్జిబిటర్లు, డిస్టిబ్యూటర్లు.. థియేటర్లు తెరిచే వరకు సినిమాలను ఓటీటీలో విడుదల చేయరాదని ఏకగ్రీవంగా తీర్మానించారు.
అక్టోబర్ వరకు కూడా థియేటర్లు తెరువని పక్షంలో నిర్మాతలు ఓటీటీ వైపు దృష్టి సారించవచ్చని సూచించారు. నిర్మాతల మండలి నిర్ణయాన్ని కాదని ఓటీటీలో సినిమాలను విడుదల చేస్తే తమ భవిష్యత్ కార్యాచరణను త్వరలోనే వెల్లడిస్తామని హెచ్చరించారు. ఈ విషయంపై ఈ నెల 7న మరోసారి తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ సమావేశం అవుతుందని తెలిపారు.
అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సినిమా టికెట్ల ధరల విషయంలో తీసుకున్న నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ విజ్ఞప్తి చేసింది. ఈ నిర్ణయం తెలంగాణపై కూడా ప్రభావం చూపుతుందని వెల్లడించింది. సినిమా టికెట్ల ధర విషయంలో ప్రభుత్వం సానుకూలమైన నిర్ణయం తీసుకోవాలని సూచించింది
ఇవీ చదవండి: