కరోనా కారణంగా థియేటర్లు మూతపడ్డాయి. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న సినిమాలు విడుదల తేదీలను వాయిదా వేసుకున్నాయి. అయితే కొందరు మాత్రం తమ చిత్రాలను నేరుగా ఓటీటీలో విడుదల చేయాలని భావిస్తున్నారు. దీనిపై కొంత సందిగ్ధం నెలకొంది. అయితే తమిళ హీరో సూర్య మాత్రం ఈ విషయంలో ఓ అడుగు ముందుకేశారట.
జ్యోతిక ప్రధాన పాత్రలో హీరో సూర్య నిర్మించిన చిత్రం 'పొన్మగల్ వంధాల్'. లాక్డౌన్ కారణంగా థియేటర్స్ బంద్ కొనసాగుతున్న నేపథ్యంలో ఈ సినిమాను నేరుగా అమెజాన్ ప్రైమ్‌లో విడుదల చేయాలని సూర్య భావించారు. ఒప్పందం కుదుర్చుకోవడమూ జరిగిందట. అయితే సూర్య నిర్ణయాన్ని తమిళనాడు థియేటర్స్ యాజమాన్య సంఘం ప్రతినిధులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అలాగే సూర్యను హెచ్చరిస్తూ తమిళనాడు థియేటర్స్ యాజమాన్య సంఘం ప్రధాన కార్యదర్శి పన్నీర్ సెల్వం ఓ వీడియో సందేశం కూడా పంపారు.
"సినిమాలను పూర్తిగా థియేటర్లను దృష్టిలో ఉంచుకునే తెరకెక్కిస్తారు. సూర్య నిర్మించిన 'పొన్మగల్ వంధాల్' నేరుగా ఓటీటీలో విడుదల కావడాన్ని మేం వ్యతిరేకిస్తున్నాం. ఓటీటీలో విడుదల చేయాలనే నిర్ణయాన్ని సూర్య వెనక్కి తీసుకోవాలి. లేకపోతే సూర్య నటించిన, నిర్మించిన సినిమాలపై నిషేధం విధిస్తాం." అంటూ పన్నీర్ సెల్వం హెచ్చరించారు.
ఇప్పటికే చిన్న నిర్మాతలు, పెద్ద నిర్మాతలు ఓటీటీల్లో సినిమాలు విడుదల చేసే అంశంపై ఆలోచన చేస్తున్నారు. అయితే ఒకవేళ అలా చేస్తే నిర్మాతలు నష్టపోయే ప్రమాదముందని సినీ మేధావులు హెచ్చరిస్తున్నారు. అందువల్ల ఇప్పటికైతే అలాంటి నిర్ణయాన్ని నిర్మాతలు మార్చుకున్నట్లు కనిపిస్తోంది.