డార్లింగ్ ప్రభాస్ 'బాహుబలి'(bahubali) తర్వాత టాలీవుడ్లో పాన్ ఇండియా(Pan india) కల్చర్ బాగా పెరిగిపోయింది. పలువురు అగ్రహీరోల అందుకు తగ్గ కథల్ని ఎంచుకుని మరీ అందులో నటిస్తున్నారు. విజయ్ దేవరకొండ(vijay devarakonda), అడివి శేష్ లాంటి వాళ్లు.. ఈ తరహా సినిమాలతోనే బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నారు. అయితే ఈ మధ్య కాలంలో తమిళ అగ్రహీరోల చూపు తెలుగు సినీ పరిశ్రమపై పడుతోంది. విజయ్, ధనుష్(dhanush) లాంటి వాళ్లు మన ఇండస్ట్రీలో నేరుగా సినిమాలు చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఆ సంగతుల సమాహారమే ఈ స్టోరీ.
ధనుష్-శేఖర్ కమ్ముల.. పాన్ ఇండియా సినిమా
కర్ణన్, జగమే తందితరం లాంటి సినిమాలతో ప్రేక్షకుల్ని అలరిస్తున్న ధనుష్‌కు తెలుగులోనూ మంచి మార్కెట్ ఉంది. ఈ నమ్మకంతోనే టాలీవుడ్లో నేరుగా ఓ చిత్రంలో నటించేందుకు ముందుకొచ్చారు. శేఖర్ కమ్ముల(sekhar kammula) ఈ ప్రాజెక్టుకు దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగు-తమిళ-హిందీ భాషల్లో దీనిని విడుదల చేయనున్నారు. పూర్తి వివరాలు త్వరలో వెల్లడించనున్నారు.
విజయ్‌తో దిల్‌రాజు భారీ ప్లాన్
తలపతి విజయ్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 'స్నేహితుడు' తర్వాత ఆయన సినిమాలు దాదాపుగా తెలుగులో డబ్ అవుతూ, సినీ అభిమానుల్ని అలరిస్తూ వచ్చాయి. ఈ ఏడాది 'మాస్టర్'(Master) అంటూ వచ్చి ప్రేక్షకుల మనసు దోచుకున్నారు. అయితే దిల్‌రాజు నిర్మాణంలో, వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఆయన స్ట్రెయిట్ తెలుగు చిత్రం చేసేందుకు అంగీకారం తెలిపారు. భారీ బడ్జెట్‌తో, పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా తెరకెక్కించనున్నారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలు చిత్రబృందం త్వరలో అధికారికంగా వెల్లడించే అవకాశముంది.
సూర్య ఎంట్రీ ఎప్పుడు?
విజయ్, ధనుష్‌లతో పాటు సూర్య, కార్తి, అజిత్ లాంటి తమిళ అగ్రహీరోల చిత్రాలు కూడా తెలుగు, తమిళంలో ఒకేసారి విడుదలవుతూ ఉంటాయి. ఇప్పుడు ధనుష్, విజయ్.. తెలుగు దర్శకులతో పనిచేసేందుకు సిద్ధమవగా, సూర్య ఎప్పుడు చేస్తారా అని ఆయన అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఇంతకు ముందు రాంగోపాల్ వర్మ 'రక్తచరిత్ర 2'లో సూర్య నటించినప్పటికీ అప్పటికీ పాన్ ఇండియా స్థాయి కథల ప్రభావం అంతగా లేదు. ఇటీవల కాలంలో ఆ కల్చర్ పెరిగిన దృష్ట్యా సూర్య.. తెలుగులో నేరుగా త్వరలో ఓ సినిమా చేస్తారేమో!
ఇవీ చదవండి: