ప్రస్తుతం పలు చిత్రాలతో బిజీగా ఉన్న తమిళ హీరో ఆర్య(Arya).. మరో కొత్త సినిమాలో నటించేందుకు సిద్ధమయ్యారని తెలిసింది. 'సూదు కవ్వం' ఫేమ్ నలన్ కుమారస్వామి దర్శకత్వంలో ఓ చిత్రం చేయనున్నారని తెలిసింది. రొమాంటిక్ కామెడీ నేపథ్యంగా తెరకెక్కునున్న ఈ మూవీని గ్రీన్ స్టూడియో పతాకంపై కె.ఇ.జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారట. త్వరలోనే అధికార ప్రకటన వచ్చే అవకాశముంది.
ఈ చిత్రకథను నలన్.. ఆర్యకు గత ఏడాది చివరల్లోనే వినిపించగా.. కథ విన్న ఆర్య గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చారట. ఇందులో ఆర్య సరికొత్త పాత్రలో కనిపించనున్నారని టాక్. ఇది అభిమానులకు చాలా బాగా నచ్చుతుందని చెప్పుకుంటున్నారు. లాక్‌డౌన్ పూర్తికాగానే సినిమా సెట్స్ పైకి వెళ్లనుందని సమాచారం.
నలన్ గత ఏడాదిలో వచ్చిన తమిళ భాషా రొమాంటిక్ ఆంథాలజీ చిత్రం 'కుట్టి స్టోరీ' సీరీస్‌లో ఒకటైన 'ఆదల్ పాదల్' లఘు చిత్రానికి దర్శకత్వం వహించారు. ఇందులో విజయ్ సేతుపతి, అదితి బాలన్ కీలక పాత్రల్లో నటించారు. 'వరుడు' చిత్రంలో ప్రతినాయకుడి పాత్రలో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు ఆర్య. ఆ తర్వాత తెలుగులో స్ట్రయిట్‌గా నటించిన చిత్రం 'సైజ్ జీరో'. ఆయన నటించిన ఎన్నో సినిమాలు తమిళం నుంచి తెలుగులోకి అనువాదమై మెప్పించాయి. ప్రస్తుతం తమిళంలో 'సార్‌పట్ట పరంబరై'లో బాక్సర్‌గా, హీరో విశాల్ నటిస్తున్న 'ఎనిమీ'లో ప్రతినాయకుడిగా కనిపించనున్నారు.
ఇదీ చూడండి: NTR: కల్యాణ్‌రామ్ సినిమా కోసం తారక్!