పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ పుట్టినరోజు గురించి ఆయన అభిమానులు ఇప్పటి నుంచే సామాజిక మాధ్యమాల్లో సరికొత్తగా ట్రెండ్ చేయడానికి సిద్ధం అవుతున్నారు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న 'వకీల్ సాబ్' టీజర్‌ను సెప్టెంబర్ 2న పవన్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేయాలని చిత్రబృందం యోచిస్తుందట. టీజర్ కట్ పూర్తయిందని దర్శకుడు వేణు శ్రీరామ్ ఇటీవలే ట్వీట్ చేశారు. తాజాగా అందుతోన్న సమాచారం ప్రకారం పవన్ పుట్టినరోజున మోషన్ పోస్టర్ మాత్రమే రిలీజ్ చేస్తారని అంటున్నారు.
పవన్ 50వ పుట్టినరోజు సంబరం చిరస్థాయిగా నిలిచేలా సామాజిక మాధ్యమాల్లో ట్రెండ్‌సెట్టర్‌గా నిలవాలని ఆయన అభిమానులు సన్నద్దమౌతున్నారు. ఇప్పటికే సినిమాకు సంబంధించిన పవన్ ఫస్ట్ లుక్‌తో పాటు చిత్రంలోని 'మగువా మగువా' లిరికల్ సాంగ్ విడుదలై ఆకట్టుకున్నాయి. సినిమాపై కూడా అంచనాలు పెంచేసేలా ఉన్నాయి.
వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా వచ్చే సంక్రాంతి పండగకి బరిలో దిగనుందని సమాచారం. హిందీలో అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్రలో నటించిన 'పింక్' చిత్రానికి ఈ సినిమా రీమేక్. బోనీ కపూర్ సమర్పణలో శ్రీవేంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్‌రాజు - శిరీష్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. సినిమా చిత్రీకరణ దాదాపు పూర్తయింది. కరోనా కారణంగా ప్రస్తుతం షూటింగ్ ఆగిపోయింది.