సినీ వర్గాలతో పాటు, రాజకీయంగా తీవ్ర ప్రకంపనలు సృష్టించిన బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసును విచారించడానికి కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) రంగంలోకి దిగింది. సుశాంత్ ప్రేయసి రియా చక్రవర్తి సహా ఆమె తల్లిదండ్రులు ఇంద్రజిత్ చక్రవర్తి, సంధ్యా చక్రవర్తి, సోదరుడు షోయిక్ చక్రవర్తితో పాటు శామ్యూల్ మిరంద, శ్రుతి మోదీ అనే మరో ఇద్దరిపై సీబీఐ అధికారులు గురువారం ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. వీరందరిలో కొత్తగా వినిపిస్తున్న శ్రుతి మోదీ ఎవరని తెలుసుకోవడానికి నెటిజన్లు తెగ ఆసక్తి చూపుతున్నారు. సోషల్‌మీడియాలో ఆమెకు సంబంధించిన ఖాతాలను వెతకడం ప్రారంభించారు.
శ్రుతి మోదీ ఎవరో తెలుసా!
శ్రుతి మోదీ గురించి సామాజిక మాధ్యమాల్లో వెతికే క్రమంలో ఆమె గురించి ఓ కీలక సమాచారం తెలిసింది. ఆమె దివంగత నటుడు సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్, రియా చక్రవర్తిలకు సన్నిహితురాలని తేలింది. ఆమెకు సంబంధించిన ఇన్స్టాగ్రామ్ ఖాతాను రియా, సుశాంత్‌లు అనుసరిస్తున్నారు. గతంలో 4వేల మందికి పైగా ఫాలోవర్స్‌తో ఉన్న ఈ వెరిఫైడ్ అకౌంట్.. తాజాగా ప్రైవేట్‌గా మారింది. సుశాంత్ మృతి కేసులో శ్రుతి మోదీ వాంగ్మూలాన్ని ఇటీవలే ముంబయి పోలీసులు తీసుకున్నారని సమాచారం. శ్రుతి.. రియా చక్రవర్తి, ఆమె సోదరుడు షోయక్ చక్రవర్తిల మాజీ మేనేజర్ అని విచారణలో తేలింది. అంతే కాకుండా ఆమె గతంలో సుశాంత్‌కు మేనేజర్‌గా వ్యవహరించిందని తెలిసింది.
సుశాంత్ మేనేజర్‌గా
ఓ ప్రముఖ వార్తాసంస్థ కథనం ప్రకారం.. శ్రుతి మోదీ జులై 2019 నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి వరకు సుశాంత్‌కు మేనేజర్‌గా ఉందని తెలుస్తోంది. సుశాంత్.. ఆర్థికంగా ఉన్నవాడని, నెలకు దాదాపుగా రూ.10 లక్షలు ఖర్చు చేస్తాడని ముంబయి పోలీసులకు శ్రుతి తెలిపింది. బాంద్రాలోని అతని నివాసం కోసం నెలకు రూ. 4.5 లక్షల అద్దెను చెల్లించేవాడని పోలీసులకు చెప్పింది.
సుశాంత్ మృతికి అతడి స్నేహితురాలు రియా చక్రవర్తి, ఆమె కుటుంబ సభ్యులే కారణమని ఆరోపిస్తూ దివంగత హీరో తండ్రి గత నెలలో పట్నా పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. అలానే ఈ కేసు దర్యాప్తును సీబీఐ చేపట్టాలని బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ సిఫారసు చేశారు. బిహార్ ప్రభుత్వ అభ్యర్థనను అంగీకరిస్తూ కేంద్రం ఈ కేసును సీబీఐకి అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఈ కేసును సీబీఐకి అప్పగించడం పట్ల మహారాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే విముఖత వ్యక్తం చేసింది.