బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్య కేసులో ఊహించని మలుపులు తిరుగుతున్నాయి. తాజాగా, బిహార్ ప్రభుత్వం సుశాంత్ కేసుపై సీబీఐ విచారణకు సిఫార్సు చేసినట్లు ప్రకటించింది. దీనిపై స్పందించిన మహారాష్ట్ర ప్రభుత్వం.. ఇటువంటి చర్యల వల్ల రాష్ట్ర ప్రభుత్వ హక్కులకు భంగం వాటిల్లుతుందని పేర్కొంది. భాజపా రాజ్యాంగ విధ్వంసానికి పాల్పడుతోందని తెలిపింది.
కరోనాను అరికట్టడంలో బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ విఫలమయ్యారని.. అందుకే ప్రజల దృష్టిని మళ్లించేందుకే సీబీఐ దర్యాప్తునకు ఆదేశించినట్లు మహారాష్ట్ర ఎన్సీపీ అధికార ప్రతినిధి నవాబ్ మాలిక్ ఆరోపించారు.
"మోదీ ప్రభుత్వం భారత ప్రజాస్వామ్యాన్ని అవమానిస్తోంది. భాజపా కూటమి కూడా ఈ విషయంలో సాయం చేయడం విచారకరం. ఇదంతా రాజకీయ ప్రయోజనాల కోసం చేస్తున్నారు. న్యాయస్థానం మా ఆవేదనను గుర్తిస్తుందని మేము ఆశిస్తున్నాం."
-నవాబ్ మాలిక్, ఎన్సీపీ అధికార ప్రతినిధి
మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్ముఖ్ మాట్లాడుతూ.. ఈ కేసులో సీబీఐ విచారణ అవసరం లేదని.. ముంబయి పోలీసులకు దీనిని పరిష్కరించే సత్తా ఉందని ఉద్ఘాటించారు.