నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతికి సంబంధించిన కేసు దర్యాప్తును సీబీఐ చేపట్టింది. దీనిలో భాగంగా సుశాంత్ చనిపోయిన రోజు ఆయన ఇంటిలో ఉన్న నలుగురు వ్యక్తులను విచారించింది. సుశాంత్‌తో పాటు ఆ ఫ్లాట్‌లో నివసించే సిద్దార్ధ్ పితానీ, సహాయకుడు నీరజ్, వంటమనిషి కేశవ్, ఇంటిపని చేసే దీపేశ్ సావంత్‌లను సీబీఐ ప్రశ్నించింది. సుశాంత్ జీవితంలో ఆఖరి కొద్ది గంటల్లో ఏం జరిగింది... అనే కీలక సమాచారాన్ని వారి నుంచి రాబట్టింది.
జూన్ 13, రాత్రి: భోజనం వద్దన్న సుశాంత్, మ్యాంగో షేక్ కావాలని అడిగారు. మిగిలిన అందరిని తినాలని సూచించారు. అనంతరం రాత్రి 10:30 గం.కు సుశాంత్‌కు ఫోన్ చేయగా... ఆయన స్పందించకపోవటం వల్ల నిద్రపోయినట్టు భావించానని వంటమనిషి కేశవ్ తెలిపాడు.
జూన్ 14, ఉదయం 5:30గం: తొలుత నిద్ర మేల్కొన్న ఇంటి పనిమనిషి దీపేశ్.. ఒక గంట తర్వాత మేడపై ఉన్న సుశాంత్ గదికి వెళ్లాడు. అప్పటికే లేచి బెడ్‌పై కూర్చొని ఉన్న సుశాంత్‌ను టీ కావాలా అని అడగ్గా.. తనకు టీ, టిఫిన్ వద్దని సుశాంత్ అన్నారు.
ఉదయం 7:00 గం: వంటవాడు కేశవ్, సహాయకుడు నీరజ్ నిద్రలేచారు.
ఉదయం 8:00 గం: నీరజ్, సుశాంత్‌ను కింద నుంచి పిలవగా.. ఆయన మెట్లపైకి వచ్చి చల్లని నీరు కావాలని అడిగారు.
ఉదయం 9:15 గం: కేశవ్ దానిమ్మ రసం, కొబ్బరినీరు ఇచ్చేందుకు సుశాంత్ గదికి వెళ్లారు. తను అతన్ని చూడటం అదే ఆఖరుసారి అని కేశవ్ తెలిపారు.
ఉదయం 10:30 గం: భోజనంలోకి ఏం కావాలని అడిగేందుకు కేశవ్, సుశాంత్ గదికి వెళ్లగా.. తలుపు లోపలనుంచి మూసి ఉంది. రియా వచ్చినప్పుడు తప్ప సుశాంత్ గది తలుపులు ఎప్పుడూ మూసేవారు కాదని... దీనితో ఆందోళన చెందామని నలుగురూ చెప్పారు.
ఉదయం 10:30 గం: సుశాంత్ గది తలుపు మరోసారి తట్టగా.. ఆయన స్పందించలేదు. సుశాంత్ సోదరి ఫోన్‌లో సూచించిన ప్రకారం మరింత గట్టిగా తలుపు తట్టారు.
ఉదయం 11:15 గం: మధ్యమధ్యలో సుశాంత్ గది తలుపు తడుతూ, ఆయన గది ముందు ఆందోళనతో తిరిగారు. అనంతరం ఆ గది మారుతాళం కోసం వెతికారు. సుశాంత్ మేనేజర్ శామ్యూల్ మిరాండాకు ఫోన్‌చేయగా ఆయన లేవని చెప్పారు. సెక్యూరిటీ గార్డు రాజును అడగ్గా, వెతికి చూస్తానని చెప్పాడు.
మధ్యాహ్నం 12:15 గం: తాళాలు బాగుచేసే వ్యక్తిని పిలవాలని నిర్ణయించుకుని, సుశాంత్ సోదరికి ఫోన్ చేసి చెప్పారు. ఆన్‌లైన్‌లో తాళాలు బాగుచేసే ఓ వ్యక్తిని సంప్రదించగా అతను వచ్చి.. తాళం విరగగొట్టి రూ.2000 తీసుకుని వెంటనే వెళ్లిపోయాడు. అతనికి అది సుశాంత్ గది అని ఆ వ్యక్తికి తెలియదని సాక్షులు చెప్పారు.
లోపలకు వెళ్లి చూస్తే...
అనంతరం సుశాంత్ గదిలోకి దీపేశ్, సిద్దార్ధ్ వెళ్లగా మిగిలిన వారు బయటే ఉండిపోయాడు. గదిలో లైట్లు ఆపి, కర్టెన్లు మూసి ఉన్నాయి. వారు లైటువేసి, సుశాంత్ సింగ్ ఉరివేసుకొని ఉండటం చూసి షాక్‌కు గురయ్యారు. సుశాంత్ సోదరికి సిద్దార్ధ్ ఫోన్ చేసి ఈ విషయం చెప్పారు. అంబులెన్స్, వైద్య సహాయం కోసం 108కు ఫోన్ చేశారు. బాధితులు ఎవరని వారు మరీ మరీ అడగటం వల్ల సుశాంత్ పేరు వెల్లడించానని సిద్దార్ధ్ వివరించాడు.
గుల్షన్, ఏం చేశావు బాబూ...
ఇంతలో సుశాంత్ పెద్దక్క ప్రియాంక ఫోన్ చేశారు. సుశాంత్‌ను కిందికి తెచ్చి, ఆయనకు ఊపిరి ఆడుతోందా లేదా చూడాల్సిందిగా ఆమె భర్త సూచించటం వల్ల.. వారు అలానే చేశారు. ఇంతలో మరో సోదరి మీతూ అక్కడకు చేరుకుని ‘"గుల్షన్, నువ్వేం చేశావు బాబూ...!"’ అని విలపించారు. సుశాంత్ ప్రాణం నిలబెట్టేందుకు తమకు తోచిన విధంగా ప్రయత్నించామని ఇంతలో పోలీసులు వచ్చారని సాక్షులు చెప్పారు.