తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ స్వల్ప అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరారు. ఏటా నిర్వహించే సాధారణ హెల్త్ చెకప్‌లో భాగంగానే ఆసుపత్రికి వెళ్లారని, ఆయన ఆరోగ్యంగానే ఉన్నారని ఆయన సతీమణి లతా రజనీకాంత్ చెప్పారు. రెండ్రోజుల క్రితం దిల్లీ నుంచి వచ్చిన రజనీకాంత్.. బుధవారం రాత్రి తాను నటించిన ‘అన్నాత్తే’ చిత్రాన్ని కుటుంబ సభ్యుల మధ్య తిలకించారు. గురువారం సాయంత్రం ఉన్నట్టుండి చెన్నైలోని కావేరి ఆసుపత్రిలో చేరారు. విషయం బయటకు రావడం వల్ల రజనీ అభిమానులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.
"రజనీకాంత్ ఎప్పటిలాగానే సాధారణ హెల్త్ చెకప్ కోసమే ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యంగా ఉన్నారు. ఏడాదికి ఒకసారి ఆయనకు ఇలాంటి పరీక్షలు చేయడం సహజమే’’ అని రజనీ సతీమణి లతా రజనీకాంత్ పేర్కొన్నారు.
ఆయన కొన్ని గంటల తర్వాత ఇంటికి వస్తారని మొదట అనుకున్నారు. అయితే శుక్రవారం పూర్తిగా వైద్యుల పర్యవేక్షణలో ఉండాలని ఆసుపత్రి వర్గాలు చెప్పినట్లు తెలుస్తోంది. తలనొప్పి, అస్వస్థత కారణంగా ఆయన ఆసుపత్రిలో చేరారనే ప్రచారమూ జరిగింది. గురువారం రాత్రి రజనీకాంత్‌ను చూసేందుకు ఆయన కుమార్తె ఐశ్వర్య కావేరి ఆస్పత్రికి వచ్చారు.
70 ఏళ్ల రజనీకాంత్ ప్రతిష్టాత్మక దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును అందుకునేందుకు రెండు రోజుల క్రితం దిల్లీకి వెళ్లారు. ఈ పర్యటనలో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీ సహా ప్రముఖులను కలిశారు.
ఇవీ చదవండి: