అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన మూడో చిత్రం 'అల వైకుంఠపురములో'. ఈ సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకొచ్చింది. విడుదలకు ముందే పాటలతో విశేష ఆదరణ పొందిన ఈ సినిమా.. ఇప్పుడు బాక్సాఫీసు వద్ద భారీ కలెక్షన్లతో దూసుకుపోతుంది. ఇందులో వినిపించే జానపద గీతం 'సిత్తరాల సిరపడు' పాట ప్రత్యేకంగా నిలిచింది. అసలు ఇది ఎవరు రాశారు? ఎక్కడ పుట్టింది? ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానమే ఈ కథనం.
'అల వైకుంఠపురములో'లోని పతాక సన్నివేశాల్లో శ్రీకాకుళం మాండలికంతో 'సిత్తరాల సిరపడు' అనే పాట రాయించి, దానిని పోరాట సన్నివేశాలకు జోడించి కథను మరింత రక్తికట్టించారు. అయితే ఆ పాట రాసింది ఎల్ఐసీలో సీనియర్ మేనేజర్‌గా పనిచేస్తున్న బల్లా విజయకుమార్.
ఒడిశాలోని జయపుర్కు చెందిన విజయకుమార్... ఉద్యోగ రీత్యా రకరకాల ప్రాంతాలకు తిరుగుతూ అక్కడి జానపదాలు, పాటలపై మక్కువ పెంచుకున్నారు. ఆ మక్కువతోనే గజల్స్ రాయడం, చిన్నచిన్న జానపదాలు అల్లడం చేసేవారు. ఈ క్రమంలో హుదూద్‌పై ఆయన రాసిన ఓ గీతం.. సిరివెన్నెల సీతారామశాస్త్రి సోదరుడు సీవీఆర్ శాస్త్రిని ఆకర్షించింది. ఇద్దరి మధ్య మంచి అనుబంధం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా బన్నీ సినిమాలో 'సిత్తరాల' పాట రాసే అవకాశాన్ని తెచ్చిపెట్టింది.
అయితే ఈ పాట విషయాన్ని చాలా రహస్యంగా ఉంచిన త్రివిక్రమ్... పాట రాసిన విజయకుమార్ ఆశ్చర్యపోయేలా చేశారు. కేవలం సరదాగా రాసుకున్న పాట త్రివిక్రమ్‌కు ఇచ్చినా... పాటల విడుదల సమయంలో తన పాట ఎక్కడా వినిపించకపోవడం వల్ల ఒకింత అసంతృప్తికి గురయ్యారు విజయ్. సినిమా వాళ్లంటే ఇంతేనేమో అనే అభిప్రాయానికి వచ్చారు.
సిరపడు అనే పదాన్ని శ్రీకాకుళం ప్రాంతంలో పెంకితనం, అల్లరి పిల్లలను ఉద్దేశించి ఎక్కువగా వాడుతుంటారని విజయకుమార్ చెబుతున్నారు. కరణాలు, విశ్వబ్రాహ్మణులు ఎక్కువగా ఈ పదాన్ని రహస్య కోడ్‌గా వినియోగిస్తారని తెలిపారు. అలాంటి ఎన్నో తెలియని పదాలతో ఒక్కో వాక్యానికి 8 పదాలు ఉపయోగిస్తూ పాట రాశారు. త్రివిక్రమ్ మాయాజాలం, రామ్‌లక్ష్మణ్ పోరాటాలతో తన పాట తెరపై అద్భుతంగా వచ్చిందని హర్షం వ్యక్తం చేశారు. ఇలాంటి జానపదాలకు ప్రాధాన్యతనిచ్చి జనాదరణ పొందేలా చూడాలని విజయకుమార్ కోరుతున్నారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">