అగ్ర కథానాయకుడు చిరంజీవి సినిమాల విషయంలో వేగం పెంచారు. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో చేస్తున్న 'ఆచార్య' సెట్స్‌పై ఉండగానే.. తన తర్వాతి మూడు చిత్రాలపైనా స్పష్టతనిచ్చేశారు. ఇప్పుడాయన చేతిలో ఉన్న ప్రాజెక్టుల్లో 'లూసీఫర్', 'వేదాళం' రీమేక్‌లతో పాటు దర్శకుడు బాబీ సినిమా ఉందని సమాచారం. 'లూసీఫర్' రీమేక్‌ను చిరు తొలుత యువ దర్శకుడు సుజీత్‌కు అప్పగించాలనుకున్నారు. ఇప్పుడా కథ మరో అగ్ర దర్శకుడు చేతిలోకి వెళ్లినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన స్క్రిప్ట్ పనులు జరుగుతున్నాయి.
ఇక 'వేదాళం' రీమేక్ బాధ్యతల్ని మెహర్ రమేశ్‌కు అప్పగించారని సమాచారం. ఇప్పటికే స్క్రిప్ట్ పనులు ఓ కొలిక్కి వచ్చాయట. ఈ రెండింటితో పాటు దర్శకుడు బాబీ చిరు కోసం ఓ చక్కటి కథ సిద్ధం చేసి పెట్టారు. వీటిలో చిరు ముందుగా ఏ సినిమాను పట్టాలెక్కిస్తారన్నది సందిగ్ధంగానే ఉంది. అయితే ఇటీవలే చిరు తన తర్వాతి చిత్రం కోసం లుక్ టెస్ట్‌లోనూ పాల్గొన్నారు. దీనిలో భాగంగా గుండు బాస్‌లా కొత్త అవతారంలో దర్శనమిచ్చి అందర్నీ ఆకర్షించారు.
- రవితేజ కొత్త ప్రాజెక్టుల విషయంలో సస్పెన్స్ కొనసాగుతోంది. ఇప్పుడాయన గోపీచంద్ మలినేని దర్శకత్వంలో 'క్రాక్' చేస్తున్నారు. తర్వాత రమేశ్ వర్మ, నక్కిన త్రినాథరావు దర్శకత్వాల్లో సినిమాలు చేయాల్సి ఉంది. ఈ రెండింటిలో ముందు సెట్స్‌పైకి వెళ్లే సినిమా ఎవరిదో స్పష్టత లేదు. తాజాగా దర్శకుడు మారుతి రవితేజ కోసం ఓ కథ సిద్ధం చేశారని వార్తలొస్తున్నాయి. ఈ నేపథ్యంలో రేసు మరింత ఆసక్తిగా మారబోతున్నట్లు తెలుస్తోంది.
- 'వైల్డ్‌డాగ్' తర్వాత నాగార్జున చేయబోయే కొత్త సినిమా విషయంలోనూ డోలాయమానం కొనసాగుతోంది. ప్రస్తుతం ఆయన చేతిలో కల్యాణ కృష్ణ దర్శకత్వంలో చేయాల్సిన 'సోగ్గాడే చిన్నినాయనా' సీక్వెల్‌తో పాటు ప్రవీణ్ సత్తారు దర్శకుడిగా కొత్త సినిమా ఉన్నాయి. వీటిలో ముందుగా పట్టాలెక్కే సినిమా ఏదన్నది స్పష్టత లేదు.
- బోయపాటి చిత్రం తర్వాత బాలకృష్ణ సినిమాలపైనా రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే బాలయ్య 'ఆదిత్య 369'కు సీక్వెల్‌గా 'ఆదిత్య 999 మ్యాక్స్' పేరుతో ఓ స్క్రిప్ట్‌ను సిద్ధం చేసి పెట్టుకున్నారు. మరోవైపు సీనియర్ దర్శకుడు బి.గోపాల్ ఆయన కోసం ఓ కథ సిద్ధం చేస్తున్నారని వార్తలొచ్చాయి. వీటిలో బాలయ్య దేనికి ఓటేస్తారో చూడాలి.