అతిలోక సుందరి శ్రీదేవి జీవితం ఆధారంగా త్వరలో ఓ పుస్తకం రాబోతోంది. ఆగస్ట్ 13న ఆమె జయంతి సందర్భంగా 'పెంగ్విన్ ర్యాండమ్ హౌస్' అనే పుస్తక ప్రచురణ సంస్థ ఈ విషయాన్ని ప్రకటించింది. శ్రీదేవి భర్త బోనీ కపూర్ అనుమతి మేరకు ఈ పుస్తకం రాశారు ప్రముఖ కథా రచయిత సత్యార్థ్ నాయక్. ఈ పుస్తకానికి 'శ్రీదేవి: గర్ల్... ఉమన్... సూపర్‌స్టార్' అని టైటిల్ పెట్టారు.
ఈ ఏడాది అక్టోబరులో ఈ పుస్తకాన్ని విడుదల చేయనున్నట్టు ప్రచురణ సంస్థ తెలిపింది. పురుషాధిపత్యం ఉన్న చిత్రసీమలో శ్రీదేవి ఏ విధంగా అడుగుపెట్టింది...? తర్వాత సూపర్‌స్టార్ స్థాయికి ఆమె ఏ విధంగా చేరుకోగలిగింది..? లాంటి పలు విషయాలను ఇందులో ప్రస్తావించారు.
"నేను శ్రీదేవిని ఎంతో ఆరాధిస్తా. ఆమె జీవితాన్ని లిఖించే బాధ్యతను నాకు అప్పగించినందుకు సంతోషంగా ఉంది. ఆమెతో కలిసి పనిచేసిన చాలామంది నటీనటులను కలిశా. ఆమెతో వారికున్న జ్ఞాపకాలను ఇందులో పొందుపరిచా".
-సత్యార్థ్ నాయక్, రచయిత
శ్రీదేవి సినీ ప్రస్థానం, విజయాలే కాకుండా 'ఇంగ్లీష్-వింగ్లీష్' చిత్రంతో ఆమె రెండో ఇన్నింగ్స్ గురించి ఇందులో ప్రస్తావించినట్లు వెల్లడించారు సత్యార్థ్. ఈ పుస్తకం శ్రీదేవికి అంకితమిస్తున్నామని, ఆమె అభిమానులకు బహుమతిగా మిగిలిపోతుందని పుస్తక ప్రచురణ సంస్థ పెంగ్విన్ ర్యాండమ్ తెలిపింది.
ఇదీ చదవండి...సిరిమల్లె పువ్వా.. చిరకాలం గుర్తుండిపోవా..!