72వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ మే14న మొదలవనుంది. 25 వరకు జరిగే ఈ ప్రతిష్టాత్మక వేడుకకు ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రముఖులు హాజరుకానున్నారు. దశాబ్ద కాలం తర్వాత మొదటిసారిగా భారత్ తరఫున ఒక్క చిత్రం కూడా ఈ వేడుకలో ప్రదర్శితం కావడంలేదు.
మొత్తం 12 రోజుల పాటు వేడుక నిర్వహించనున్నారు. జిమ్ జర్ముస్క్ తీసిన 'ద డెడ్ డోంట్ డై' అనే చిత్రంతో కార్యక్రమం ప్రారంభం కానుంది.
భారత నటీమణులు ఐశ్వర్యారాయ్ బచ్చన్, సోనమ్ కపూర్, దీపికా పదుకునె, హుమా ఖురేషీ ఈ ఏడాదీ రెడ్ కార్పెట్‌పై సందడి చేయనున్నారు.
కోల్‌కతాలోని సత్యజిత్ రే ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇనిస్టిట్యూట్‌కు చెందిన ముగ్గురు యువకులు తొలిసారిగా కేన్స్ వేడుకలో పాల్గొననున్నారు.
2010లో విక్రమాదిత్య మోత్వానే తెరకెక్కించిన 'ఉడానే మేడ్ ఇట్ టు అన్సర్టేన్ రిగార్డ్' చిత్రం మొదటగా కేన్స్‌లో ప్రదర్శితమైంది. ఆ తర్వాత ప్రతి ఏడాది భారతీయ చిత్రం ప్రదర్శితం అయ్యేది. కానీ ఈ సంవత్సరం భారత్ నుంచి ఏ ఒక్క చిత్రమూ ఎంపిక కాలేదు.
కేన్స్ వేడుకలో ఐఎఫ్ఎఫ్ఐ పోస్టర్
కేన్స్ వేడుకలో భారత ప్రతినిధులు ప్రత్యేక పోస్టర్‌ను విడుదల చేయనున్నారు. ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ పోస్టర్ విడుదల చేయబోతున్నారు. ఐఎఫ్ఎఫ్ఐ ఈ ఏడాది చివర్లో గోవాలో జరగనుంది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ ఛైర్మన్ ప్రసూన్ జోషి, ఫిల్మ్ మేకర్స్ రాహుల్ రవైలీ, షాజ్ కరున్, మధుర్ భండార్కర్ ఇందులో సభ్యులు.
"వివిధ దేశాల చిత్ర నిర్మాతలు కలిసి ద్వైపాక్షిక ఒప్పందాలు చేసుకోవడం వల్ల సినిమాలకు కొత్త మార్కెట్లను సృష్టించడానికి అవకాశం ఉంటుంది. భారత్‌లో ప్రపంచస్థాయి సినిమాల చిత్రీకరణకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది".
-అమిత్ ఖారే, సమాచార, ప్రసారశాఖ కార్యదర్శి