ఒక్కసారి కన్నుగీటి... సామాన్యుల నుంచి ప్రముఖుల వరకూ అందరినీ ఫిదా చేసిన కేరళకుట్టి ప్రియా ప్రకాశ్ వారియర్. ఇప్పుడు 'చెక్'తో నితిన్ పక్కన మెరిసి తెలుగులోనూ తెరంగేట్రం చేసిన ప్రియ, తన మనసులోని ముచ్చట్లను చెబుతోందిలా..
ఆ ట్రైలర్ నా జీవితాన్నే మార్చేసింది
నా మొదటి సినిమా 'లవర్స్‌డే' (మలయాళంలో ‘ఒరు అడార్ లవ్’) ట్రైలర్ ముందువరకూ నేను అందరిలాంటి పక్కింటి అమ్మాయినే. ఆ ట్రైలర్ తరువాత ఒక్కరాత్రిలోనే నాకు ఇంత గుర్తింపు వస్తుందని నేనే కాదు మా ఇంట్లోవాళ్లూ ఊహించలేదు. నిజానికి ఆ సినిమా చేస్తున్నప్పుడు దర్శకుడు 'ఇలా చేత్తో గన్ను పేల్చాల్సి ఉంటుంది చెయ్యగలవా' అని చేసి చూపించారు. ప్రయత్నిస్తానని చెప్పా. ఆ సీన్‌ను ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు 'వీలుంటే కన్ను కూడా కొట్టు' అని చెప్పడం వల్ల అన్నీ ఒకేసారి ఒకే టేక్‌లో చేశా. ఆ తరువాత అది ఎంత పెద్ద వైరల్ అయ్యిందో చెప్పక్కర్లేదు. ఎంతోమంది ప్రముఖులు అలా కన్ను గీటేందుకు ప్రయత్నించారు. చాలాబాగా చేశావంటూ మెచ్చుకున్నవాళ్లూ ఉన్నారు. చాలామంది కుర్రాళ్లయితే 'ఐ లవ్యూ... ప్లీజ్ ఫాలో మీ' అంటూ సామాజిక మాధ్యమాల్లో మెసేజీలు కూడా పెట్టారు.
స్కూలు మానేసి దాక్కునేవాళ్లం
నేను మొదటినుంచీ కో-ఎడ్యుకేషన్ స్కూల్లోనే చదివా. అయితే... ‘ఒరు అడార్ లవ్’ సినిమాలోలా నాకు స్కూల్లో ప్రేమకథలు లేవు కానీ... అల్లరి పనులు మాత్రం చేసేదాన్ని. టీచర్లు ఎప్పుడు ఏ అవకాశం వస్తుందా... నన్ను ఏ విధంగా శిక్షించాలా అని ఎదురుచూసేవారు. నేనేమో వాళ్లకు దొరక్కుండా స్నేహితులతో కలిసి అప్పుడప్పుడూ స్కూలు ఎగ్గొట్టి ఫుట్‌బాల్ గ్రౌండ్‌లోనో, ఖాళీ తరగతి గదుల్లోనే దాక్కునేదాన్ని. అంతా సద్దుమణిగాక మేమంతా కలిసి సరదాగా గడిపేవాళ్లం. తరవాత ఏమీ ఎరగనట్లు ఇంటికి వెళ్లిపోయేదాన్ని.
ప్రేమలేఖలు ఎక్కువే
కాలేజీలో ఉన్నప్పుడు క్రష్‌లనేవి మామూలే. నాక్కూడ్డా చాలామంది ప్రేమలేఖలు రాసేవారు. ఇప్పుడైతే కొందరు అభిమానులు నాకు ఎంతో చక్కని ప్రేమలేఖలు రాస్తున్నారు. వాటిలో కొన్నింటిని చదివినప్పుడు నవ్వొస్తుంది... మరికొన్నింటిని చూసినప్పుడు 'అబ్బా ఎంత బాగా రాశారో' అనుకోకుండా ఉండలేను. నాకు ఎవరైనా ప్రేమలేఖ రాస్తే... అందులో నన్ను ఆకట్టుకునే వాక్యాలు ఏమైనా ఉన్నాయా అని ముందు వెతుకుతా. ఆ తరువాత వాళ్లు చేసిన అచ్చుతప్పులూ, గ్రామర్ పొరపాట్లను కూడా గమనిస్తా. అవేవీ లేకుండా అందంగా ప్రేమలేఖను రాస్తే మాత్రం మళ్లీమళ్లీ చదువుకుంటా.
అతనితో చేయాలని...
నాకు మొదటినుంచీ అల్లు అర్జున్ అంటే చాలా ఇష్టం. నా తొలి సినిమా ట్రైలర్ విడుదల అయ్యాక తన కొడుకుతో కలిసి నాలా నటిస్తూ... ఆ వీడియోను ట్వీట్ చేశారు. దాన్ని చూసిన రోజు ఎంత ఆనందించానో చెప్పలేను. ఇప్పుడిప్పుడే 'చెక్' చేశా కాబట్టి... భవిష్యత్తులో అల్లుఅర్జున్‌తో చేసే అవకాశం వస్తుందనే అనుకుంటున్నా.
‘నువ్వేం బాగాలేవు’ అన్నాడు
నాకూ, మా తమ్ముడికీ ఏడేళ్లు తేడా ఉంది. దాంతో మేమిద్దరం కొట్టుకున్న సందర్భాలు లేవు కానీ... ఎన్నో విషయాల్లో వాదించుకుంటాం. నా ట్రైలర్ విడుదలయ్యాక వాడు... ‘ఇందులో ఏముంది... దీనికే ఫాన్స్ అయిపోతారా... అబ్బాయిలు ఇంటికి బొకేలు పంపిస్తారా... అందరూ అనుకున్నంతగా అందులో నువ్వేం బాగాలేవు’ అనేశాడు. ముందు కోపం వచ్చినా తరువాత నవ్వొచ్చింది.
హైదరాబాద్ రెండో ఇల్లు
కొన్నాళ్లక్రితం ‘లవర్స్‌డే’ ప్రమోషన్ కోసం హైదరాబాద్ వచ్చా. ఇప్పుడు చెక్ షూటింగ్ కోసమే కాదు... తరచూ కథలు వినడానికీ, ప్రమోషన్లకోసం కూడా ఇక్కడకు ఎక్కువగా వస్తున్నా. అందుకే ఇప్పుడు హైదరాబాద్ నా రెండో ఇల్లులా అయిపోయింది.
నచ్చే ఆహారం
చైనీస్ పుడ్
ఆ రెండూ ఇష్టం
టైం దొరికితే హాయిగా డ్యాన్స్ చేస్తూ నచ్చిన పాటలు వింటూ, పాడుకుంటూ గడిపేస్తా. ముఖ్యంగా మోహినీఆట్టం చేయడం నాకు చాలాచాలా ఇష్టం.