'లవర్‌బాయ్' అనే ఇమేజ్ నుంచి బయటికి రావాలనే ఉద్దేశంతో 'అశ్వథ్థామ' కథ రాశానని యువ కథానాయకుడు నాగశౌర్య చెప్పాడు. అతడు హీరోగా రూపొందిన ఈ చిత్రానికి రమణ తేజ దర్శకుడు. మెహరీన్ కథానాయిక. ఈ సినిమా ప్రచారంలో భాగంగా నాగశౌర్య ప్రత్యేక ముఖాముఖిలో పాల్గొన్నాడు.
ఈ కథ ఎలా పుట్టింది?
నిజ జీవితంలో రోజులోని 24 గంటలు అప్రమత్తంగా ఉండాలని చెప్పే కథ ఇది. దీనికి కాస్త కామెడీ కలిపి, ఓ ఎంటర్టైనర్గా రూపొందించాం. ఈ సినిమా కథ నేనే రాశా. దర్శకుడు రమణ తేజ, సహాయ దర్శకుడు ఫణితో కలిసి పనిచేశా. కథ పూర్తయిన తర్వాత మా అమ్మానాన్నకు చెప్పా. మనమే తీద్దాం అన్నారు. నాపై నమ్మకంతో ఒప్పుకున్నారు. దాన్ని నిలబెట్టాలనే ఉద్దేశంతో నేను చాలా కష్టపడ్డా. స్క్రిప్టుపై నేను నమ్మకం పెట్టా, వాళ్లు నాపై నమ్మకం పెట్టారు (నవ్వుతూ).
కథ రాశారు, దర్శకత్వం వహించే ఆలోచనలు ఉన్నాయా?
లేదండీ (నవ్వుతూ). అలాంటి ఆలోచనలు లేవు.
ఈ గడ్డం ఏంటి?
నా తర్వాతి సినిమా కోసం జుట్టు, గడ్డం పెంచాను. చాలా ఇబ్బందిగా ఉంటోంది. జుట్టు పెంచడం అంటే ఇంత నరకంగా ఉంటుందని ఇప్పుడే నాకు తెలిసింది.
'అశ్వథ్థామ' కోసం చాలా కసరత్తులు చేసినట్లున్నారు?
అవును.. ఈ సినిమాలో నా పాత్ర కాస్త యాక్షన్‌తో కూడుకుని ఉంటుంది. కాబట్టి బొద్దుగా ఉంటే బాగోదని, ఫిట్‌గా మారాను. ప్రతి ఒక్కరికీ సిక్స్‌ప్యాక్ ఉంటుంది. కొంచెం కసరత్తు చేసి, దాన్ని బయటికి తీసుకురావాలంతే. దీనికంటే ముందు మనం తీసుకునే ఆహారాన్ని అదుపులో పెట్టుకోవాలి. మంచి శరీరం కావాలి అనుకుంటే.. తిండిని తగ్గించాలి. తిండి కావాలనుకుంటే.. శరీరం గురించి పట్టించుకోకూడదు (నవ్వుతూ).
తొలిసారి మాస్‌గా నటించారు కదా?
అవును. ఇన్నాళ్లు లవర్‌బాయ్‌గా చేశా. ఆ ఇమేజ్ నుంచి బయటికి రావాలి, విభిన్నంగా కనిపించాలి అనిపించింది. నిజానికి ప్రేమకథల్లో నటించడం నాకే నచ్చలేదు.. విసుగొచ్చేసింది. నా దగ్గరకు అన్నీ ప్రేమకథలే వచ్చేవి. నాకు నచ్చిన కథల్ని నిర్మాతలకి పంపితే.. 'నీకు సరిపోదేమో శౌర్య అనేవాళ్లు'. అందుకే నాకు నేను కథ రాసుకుని, మా సంస్థలో చేశాం. కథకు మాస్, క్లాస్ అని ఉండదు. సినిమాలోని మలుపులు ముఖ్యం. కంటెంట్ బాగుంటే ఏ హీరో నటించినా.. ప్రేక్షకులు చూస్తారు.
యాక్షన్ సీన్లు ఎక్కువగా ఉన్నట్లున్నాయి?
ఫైట్ మాస్టర్ అంబరివ్ ‘కేజీఎఫ్’ సినిమాకు పనిచేశారు. ఆయన మా నాన్నకు తెలిసిన వ్యక్తి. ఓ రోజు మా నాన్న ఇంట్లో 'కేజీఎఫ్' టీజర్ పెట్టి, చూడమన్నారు. 'బాగుంది, ఫైట్ సీన్లు బాగా తీశారు' అన్నాను. ఆ తర్వాత నాన్న నాకు చెప్పకుండా మాస్టర్‌తో మాట్లాడి, అంతా సెట్ చేసేశారు. 'కేజీఎఫ్' సూపర్ హిట్ అయ్యింది. అంబరివ్.. సల్మాన్ ఖాన్‌లాంటి హీరోలతో బిజీ అయిపోయారు. ఆపై మా సినిమా కోసం పనిచేశారు.
ఐరా క్రియేషన్స్ పతాకంపై నాగశౌర్య తల్లిదండ్రులు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా జనవరి 31న విడుదలకు సిద్ధమౌతోంది.
ఇదీ చదవండి: భారతీయుడుకి విలన్‌గా కాజల్..?