తమిళ నటుడు సూర్య కథానాయకుడిగా సుధా కొంగర దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'సూరారై పోట్రు'. తెలుగులో ఈ సినిమా 'ఆకాశం నీ హద్దురా' పేరుతో విడుదలైంది. ఎయిర్ దక్కన్ వ్యవస్థాపకుడు జీఆర్ గోపీనాథ్ జీవిత కథ ఆధారంగా సినిమాని తెరకెక్కించారు. ఇందులో అపర్ణ బాలమురళి కథానాయికగా నటించింది. తాజాగా ఈ చిత్రం షాంఘై అంతర్జాతీయ చలన చిత్రోత్సవం-2021 వేడుకల్లో పనోరమ విభాగంలో అర్హత సంపాదించింది. ఈ ఉత్సవాలు జూన్ 11 నుంచి జూన్ 20 వరకు జరగనున్నాయి.
ఐఎమ్‌డీబీలో టాప్-3 చిత్రంగా రికార్డు
'సూరారై పోట్రు' మరో అరుదైన ఘనత సాధించింది. ప్రముఖ మూవీ రేటింగ్ సంస్థ ఐఎమ్‌డీబీ సినిమాల జాబితాలో మూడో స్థానంలో నిలిచింది. ప్రపంచ సినీ చరిత్రలో గొప్ప చిత్రాలుగా పేరొందిన 'ది షాషంక్ రిడెంప్షన్', 'ది గాడ్ ఫాదర్' తర్వాత స్థానం సాధించి రికార్డు సృష్టించింది.
ఈ చిత్రంలో తెలుగు నటుడు మోహన్‌బాబు పైలెట్‌గా తన సొంత పేరుతో భక్తవత్సలం నాయుడుగా నటించారు. పరేష్ రావల్, ఊర్వశి, కరుణాస్, వివేక్ ప్రసన్న తదితరులు ఇతర పాత్రల్లో నటించారు. 2డీ ఎంటర్‌టైన్‌మెంట్, సిఖ్యా ఎంటర్‌టైన్‌మెంట్ కలిసి సంయుక్తంగా నిర్మించిన చిత్రానికి జీవీ ప్రకాశ్ కుమార్ సంగీత స్వరాలు సమకూర్చారు. నికేత్ బొమ్మిరెడ్డి సినిమాటోగ్రాఫర్‌గా సతీష్ సూర్య ఎడిటర్ పనిచేశారు. గునీత్ మొంగా నిర్మాత.