వీరు, వారు అనే భేదం లేకుండా దేశవ్యాప్తంగా కష్టాల్లో ఉన్న పలువురిని ఆదుకుంటూ.. రియల్ హీరో అనిపించుకున్న సోనూసూద్ మరోసారి వార్తల్లో నిలిచారు. ఈసారి ఒలింపిక్స్‌కు శిక్షణ పొందుతున్న ఓ క్రీడాకారుడికి, సివిల్స్ పరీక్షలకు సన్నద్ధమవుతున్న మరో విద్యార్థినికి అండగా నిలిచారు.
మనోజ్ అనే ఓ అథ్లెట్.. ఒలింపిక్స్‌లో పాల్గొనేందుకు శిక్షణ పొందుతున్నారు. అందుకు అవసరమైన రన్నింగ్ షూ తనవద్ద లేకపోవటం వల్ల తన స్నేహితుల నుంచి అడిగి తెచ్చుకునేవారు. తన ఆట ప్రపంచ స్థాయిలో ఉన్నా, కుటుంబ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉందని... తన సహాయం చేయాలంటూ సోనూకు మనోజ్ ట్వీట్ చేశారు. వెంటనే స్పందించిన స్పందించిన ఈ నటుడు.. ఆ ఆటగాడికి అవసరమైన బూట్లు ఈ రోజే అందేలా చర్యలు తీసుకున్నారు. అనంతరం "డన్ భాయీ... ఈ రోజు అందుతాయి" అని ట్విటర్‌లో జవాబిచ్చారు.
గోవింద్ అగర్వాల్ అనే మరో యువకుడు, ఐఏఎస్‌కు సిద్ధమవుతున్న తన సోదరికి కొన్ని పుస్తకాలు కావాలని.. తనది వ్యవసాయ కుటుంబం కావటం వల్ల తమ తండ్రి ఏర్పాటు చేయలేకపోయారన్నారు. ఈ క్లిష్ట పరిస్థితిలో తమను ఆదుకోవాలని సోనూను కోరారు. ఇందుకు సోనూ "మీ పుస్తకాలు మీకు రేపటికల్లా అందుతాయి" అని హామీ ఇచ్చారు. ఆ మేరకు మాట నిలబెట్టుకున్నారు.
లాక్‌డౌన్‌లో వలస కార్మికుల కోసం విమానాలతో సహా వివిధ ప్రయాణ సౌకర్యాలు కల్పించి సోనూ తన సేవా ప్రస్థానం ప్రారంభించారు. అనంతరం దానిని కొనసాగిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రైతుకు ట్రాక్టర్ అందించటం సహా కష్టాల్లో ఉన్న అనేకమందికి చేయూతనందిస్తున్నారు. ఇటీవలే నొయిడాకు చెందిన 20,000 మంది వలస కార్మికులకు ఆశ్రయం కల్పిస్తామని సోనూ ప్రకటించారు. తమ ‘ప్రవాసీ రోజ్‌గార్’ కార్యక్రమం ద్వారా వారికి స్థానిక వస్త్ర కర్మాగారంలో ఉపాధి లభించేలా కృషి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. అంతేకాకుండా, వలస కూలీలను ఆదుకునేందుకు ఓ టోల్ ఫ్రీ నంబరు, వాట్సాప్ హెల్ప్‌లైన్ నంబరును కూడా ఇప్పటికే ఏర్పాటు చేశారు.