ప్రముఖ నటుడు సోనూసూద్.. గతేడాది కరోనా లాక్డౌన్ పెట్టినప్పటి నుంచి ఎంతోమందికి సాయం చేస్తూ, ప్రజల మనసుల్లో చోటు సంపాదించారు. ప్రస్తుతం సెకండ్ వేవ్ నేపథ్యంలో తనకు సోషల్ మీడియా ద్వారా ఆక్సిజన్ కోసం అడిగిన వారికి సాయం చేస్తున్నారు. ఇప్పుడు మరో అడుగు ముందుకేసి, ఏకంగా రాష్ట్రాల్లో ఆక్సిజన్ ప్లాంట్లే నెలకొల్పేందుకు సిద్ధమవుతున్నారు. ఫ్రాన్స్ సహా ఇతర దేశాల నుంచి వీటిని దిగుమతి చేయనున్నారు. త్వరలో వాటిని వైరస్ ఎక్కువగా ప్రభావితం ఉన్న రాష్ట్రాల్లో ఏర్పాటు చేయనున్నారు.
"అవసరాల్లో ఉన్న ప్రజల కోసం ఆక్సిజన్ ప్లాంట్స్ తీసుకురానున్నాం. ఆక్సిజన్ సిలిండర్స్ కొరతతో బాధపడటం ప్రస్తుతం మనం చాలాచోట్ల చూస్తున్నాం. ఈ పరిస్థితుల్లో మేం వీలైనంత మందికి సాయం చేస్తున్నాం. ఏదేమైనప్పటికీ ప్రస్తుతమున్న ఆక్సిజన్ ప్లాంట్స్‌తో అన్ని ఆస్పత్రుల్లో ఉన్న సిలిండర్స్ నింపడం చాలా కష్టం. అందుకే మా వంతు బాధత్యగా కొన్ని ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నాం. తొలి ప్లాంట్ ఆర్డర్ చేశాం. ఫ్రాన్ నుంచి 10-12 రోజుల్లో మన దేశానికి అది రానుంది" అని సోనూ చెప్పారు.
ప్రస్తుతం కాలం అనేది తమకు బిగ్గెస్ట్ ఛాలెంజ్ అని సోనూసూద్ చెప్పారు. వీలైనంత కష్టపడి మరణాలను తగ్గించేందుకు ప్రయత్నిస్తామని ఆయన అన్నారు.