బాలీవుడ్ దర్శకనిర్మాత సంజయ్ లీలా భన్సాలీ తన కొత్త ప్రాజెక్టు కోసం నెట్‌ఫ్లిక్స్ ఓటీటీతో కలిసి పనిచేయనున్నారని బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. 'హీరా మండి' అనే కథను ఈ డిజిటల్ వేదిక కోసం రూపొందించనున్నారని సమాచారం. 2021లో చిత్రీకరణ ప్రారంభం కానున్న ఈ ప్రాజెక్టుకు విభు పూరి దర్శకుడిగా ఎంపికైనట్లు తెలుస్తోంది. భన్సాలీ తెరకెక్కించిన 'గుజారిష్' చిత్రానికి మాటల రచయితగా విభు పనిచేశారు.
సంజయ్ లీలా భన్సాలీ.. ప్రస్తుతం 'గంగూబాయ్ కతియవాడి' చిత్రీకరణలో బిజీగా ఉన్నారు. 'హీరా మండి' చిత్రాన్ని భన్సాలీ మార్క్‌తో దర్శకుడు విభు పూరి రూపొందించనున్నారట. మయాంక్ ఆస్టెన్ సూఫీ రచించిన 'ఎ సడన్ విజిట్ టూ పాకిస్థాన్: హీరా మండి ద డ్రీమ్ హోమ్ ఆఫ్ ద హోర్స్' అనే పుస్తకం నుంచి కథను గ్రహించారు. ఈ పుస్తకం వేశ్యల జీవితాన్ని ప్రతిబింబిస్తుంది. ఈ కథను చిత్రీకరించేందుకు భన్సాలీ 2007లో హక్కులను కొనుగోలు చేశారు. అయితే ఈ ప్రాజెక్టును పట్టాలెక్కించడానికి భన్సాలీకి 13 ఏళ్లు పట్టింది. త్వరలోనే నటీనటుల వివరాలను ప్రకటించే అవకాశం ఉంది.
ఇదీ చూడండి: గన్స్‌తో వచ్చేసిన అడివి శేష్, విశాల్