తెలుగువారంతా అభిమానంగా బాలు అని పిలుచుకునే శ్రీపతి పండితారాధ్యుల బాల సుబ్రహ్మణ్యం తండ్రి సాంబమూర్తి పేరొందిన హరికథా పండితులు. తండ్రి స్ఫూర్తితో చిన్న తనం నుంచే పాటల వైపు బాలు దృష్టి మళ్లింది. తండ్రి కోరిక మేరకు ఇంజినీరు కావాలనే ఆశయంతో మద్రాసులో ఏఎమ్ఐఈ కోర్సులో చేరారు. మనిషి అక్కడ ఉన్నా బాలు మనసు మాత్రం పాట మీదే ఉండేది.
తొలి పరిచయం
తండ్రి మాట మేరకు ఇంజినీరింగ్ పూర్తి చేసి ఉంటే తెలుగు సినీ కళామతల్లికి ఓ మధురమైన గాయకుడు కుమారుడిగా లభించేవాడు కాదేమో. 1966లో పద్మనాభం నిర్మించిన 'శ్రీశ్రీశ్రీ మర్యాద రామన్న' చిత్రంతో ఎస్పీబాలు స్వరజైత్రయాత్ర ప్రారంభమైంది. దీనికి ఎస్పీ కోదండపాణి సంగీత దర్శకుడు. తొలి అవకాశాన్ని ఇచ్చిన ఆయన్ను తన తండ్రితో సమానంగా బాలు భావిస్తారు. బాలూకు ఆయన గాత్ర మాధుర్యమే శ్రీరామరక్ష.
అసాధరణ జ్ఞాపకశక్తి
19 ఏళ్ల వయస్సులోనే, ఏ మాత్రం శాస్త్రీయ సంగీతంలో ప్రవేశంలేని ఎస్పీబీ.. కొద్దికాలంలోనే తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. కాలం మార్పు వల్ల వచ్చిన కొత్త సినిమా పాటల ధోరణులని అంగీకరించి, అభ్యసించి, ప్రతి సంవత్సరానికీ పెరుగుతున్న సినిమాల సంఖ్యకు తగ్గట్టు రోజుకి కనీసం 10 నుంచి 15 దాకా కొత్త పాటలు పాడటం సామాన్యమైన విషయం కాదు. మామూలుగా తెలిసిన పాట పాడటం ఒక ఎత్తు, సంగీత దర్శకుడు చెప్పినట్టు బాణీ పట్టుకోవటం ఇంకో ఎత్తు. ఈ విషయంలో బాలుకు ఉన్న అసాధారణ జ్ఞాపకశక్తి చాలా ఉపయోగపడింది.
తెలుగుదనం ఉట్టిపడేలా
పాటలోనే మాటలని, గళంలో అభినయ ముద్రలని నింపి తెలుగుదనం ఒలికించగల విలక్షణత ఎస్పీ బాలు ప్రత్యేకత. గళం విప్పినా.. స్వరం కూర్చినా.. ఆ పాటలోని కవి భావాన్ని సూటిగా ప్రేక్షకులవద్దకు తీసుకువెళ్ళగలిగే సత్తా ఆయన గళానికి ఉంది. తరాలు మారినా ఎందరో నటులకు వారి హావభావలకు, నటనా శైలికి అనుగుణంగా ఆయన పాటలు పాడి ప్రాణం పోశారు. పదాల మాధుర్యాన్ని గమనించి ఆయన చేసే ఉచ్ఛారణ ఆయన పాటను పండిత పామరులకి చేరువ చేసింది.
16 భాషల్లో..40 వేల పాటలు
తన సుదీర్ఘ సినీప్రస్థానంలో పదహారు భాషల్లో 40 వేలకు పైగా పాటలు పాడి, 40కి పైగా సినిమాలకు సంగీత దర్శకత్వం వహించిన బాలసుబ్రహ్మణ్యం.... తనకంటూ ఓ అరుదైన రికార్డు సొంతం చేసుకున్నారు. 'పాడుతా తీయగా', 'పాడాలని ఉంది' లాంటి కార్యక్రమాల ద్వారా ఎందరో ఔత్సాహిక గాయకులను తయారు చేసి చిత్ర పరిశ్రమకు పరిచయం చేశారు. పాట ఏదైనా.. భావం ఎలాంటిదైనా.. ప్రతి పాటకూ ఓ ప్రత్యేకతను ఆపాదించి పెట్టడం బాలూకే చెల్లింది. తన శిష్యులను సైతం అదే విధంగా తయారు చేసిన గురు స్థానం ఆయనదే కావడం విశేషం.